Monday, May 20, 2019


రచన,స్వరకల్పన&గానం:రాఖీ

నీ పదముల రేణువు నేను
నా పదముల ప్రాణము నీవు
బాసరలో భాసిల్లే భగవతి
స్థిరపరచవే సంస్థితవై నామతి
భారతీ దయా జలధీ
నా ప్రతి గీతీ నీ అభినుతి

1.నా పలుకునకర్థము నీవే
నావాక్కున చక్కెర కావే
అక్కరముల అక్కెర ప్రియమై
చక్కని చిక్కని భావన నీవే
వాగీశ్వరీ కరుణా ఝరీ
నా జిహ్వ నీకవని కవనవని

2.నా గళమే కర్ణకఠోరం
చేయవె సత్వరమే మృదుమధురం
శ్రవణపేయమై శ్రావ్యగాత్రమై
దయసేయవె హృదయనాదం
సంగీత సామ్రాజ్ఞి కృపావర్షిణి
కలవాణి నా కలల ఫలదాయిని
రచన,స్వరకల్పన&గానం:రాఖీ

మళ్ళీ బ్రతికొచ్చావని ఏసని భావించనా
ఫకీరులా గడిపావని మహ్మద్ వని ఎంచనా
పూజలు గొన్నావని ఈశుడవని సేవించనా
సాయీ నీ తత్వమె చిత్రమోయి
సాయీ నీ చరితమే పవిత్రమోయి
జయజయజయ జయసాయి-
సచ్చిదానందరూప సద్గురు సాయి

1.రోగాలను విభూతితో మాన్పే వైద్యుడవు
శోకాలను అనునయముతొ తీర్చే హితుడవు
జీవిత సత్యాలను బోధించే గురుడవు
భవజలధిని అవలీలగ దాటించే సరంగువు
సాయీ నీ తత్వమె చిత్రమోయి-సాయీ నీ చరితమే పవిత్రమోయి
జయజయజయ జయసాయి-సచ్చిదానందరూప సద్గురు సాయి

2.బంధాలు లేకున్నా మాకు బంధువైనావు
రాగద్వేష రహితుడవైనా మోహవశుడవైనావు
మాలోన ఒకడవుగా షిరిడీలో మసలినావు
మానవతను ఎరుక పరచి దైవమై నిలిచావు
సాయీ నీ తత్వమె చిత్రమోయి
సాయీ నీ చరితమే పవిత్రమోయి
జయజయజయ జయసాయి-
సచ్చిదానందరూప సద్గురు సాయి
రచన,స్వరకల్పన&గానం:రాఖీ

రూపము గనినంత చూపరులకు భీకరము
చల్లనైన నీదృక్కులు సర్వదా శ్రీకరము
నీ దర్శన భాగ్యమే ఆనందకరము
భవభయ హారకము నీ అభయకరము
ధర్మపురీ నరహరీ నీకు వందనాలయా
మము దయజూడగ శ్రీ చందనాలయా

1.వైశాఖ శుద్ధ చతుర్ధశీ రోజున
గోధూళివేళ స్తంభమునందున
నీ శ్రీ హరిఏడీ ఢింబకా చూపుమని
హిరణ్యకశ్యపుడు గద్దించినంతనే
సర్వాంతర్యామివని చాటిచెప్పడానికి
ఉద్భవించినావు ప్రహ్లాదుని మొరవిని

2.శిరమేమో కేసరిగా నరశరీరధారిగా
ద్వారమే పీఠముగా ఆసీనుడవయ్యి
భీషణ దంష్ట్రలు వాడియౌ నఖములతో
ఊరువుల పైనా ఒక ఉదుటున వేసుకొని
ఉగ్ర నారసింహుడవై ఉదరమే చీల్చివేసి
దితి సుతుని హతమార్చి నీ భక్తుని బ్రోచితివి

3.గోదావరి తీరమున ధర్మపురీ క్షేత్రమున
శ్రీ లక్ష్మీ సహ యోగ నరసింహమూర్తిగా
వెలసినావు స్వామి నీ మహిమలు జూపగా
మలచినావు స్వామీ మా బ్రతుకులు నీవిగా
శేషప్పవరదుడవై శతకము రాయించితివి
రాఖీప్రియ సఖుడవై సతతము నువు కాచితివి
రచన,స్వరకల్పన&గానం:రాఖీ

చలనం లేని శిలవైనావు
స్పందన ఎరుగని ఎదవైనావు
ఉలులెన్ని విరిగాయో నిను చెక్కలేక
కలలెన్ని కరిగాయో నువు కానరాక

1.అమావాశ్య బ్రతుకే నాది
తెల్లారని రేయి నాది
వేగుచుక్కలాగా తట్టిలేపుతావు
మలయమారుతానివై చుట్టుముట్టుతావు
ఎంతకూ పొద్దుపొడవదు
వింతగా లిప్తగడవదు
తూర్పు తలుపు తెరవకనే దినం గడచును
మేలుకొలుపు తెలియకనే నిద్ర కమ్మును

2.పరిచయాలె సరిగమలై
స్నేహితాలె పికగీతాలై
జీవితాన సంగీతం జలపాతమవ్వాలి
అనుభూతుల సుమగంధాలే విరజిమ్మాలి
నీచర్యలు చిత్రమైనవి
నీ చేష్టలు ఆత్రమైనవి
తప్పుకపోతుంటే నన్ను  సెలుకుతుంటావు
ముట్టుకోబోతుంటే నువు ముడుచుకుంటావు
రచన,స్వరకల్పన&గానం:రాఖీ

నీ కాలిమువ్వనౌతా నే కాలి కాటుకనౌతా
నీ మోవినవ్వునౌతా నీ గుండె గువ్వనౌతా
నా హృదయ రాణీ నీ ఇంటి దివ్వె నౌతా
నా ప్రణయ దేవీ నీ పూజ పువ్వునౌతా

1.క్రీగంటి చూపుకే నేను పడిపోయాను
నీవొంటి స్పర్శకే వివశుడిని అయ్యాను
సోయగాలు తిలకిస్తూ నే సోలిపోయాను
నీ హొయలుకే తరిస్తూ మైమరచిపోయాను

అతిలోక సుందరీ బానిసగా మార్చావే
శతపుష్ప మంజరీ దాసునిగ జేసావే

2.నీ వాలు జడలోనా మిన్నాగు నాట్యాలు
నీకొంగుముడిలోనా భూలోక స్వర్గాలు
నీ నడుము వంపుల్లో ఇసుక మైదానాలు
నీ అడుగుజాడల్లో నవపారిజాతాలు

రసరమ్య వాహినీ మాయలేవొ చేసావు
జగదేక మోహిని మత్తులోన ముంచావు
రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ

తీరదు ఋణము నను గన్న మా అమ్మది
తీరదు ఋణము నడిపించు మాయ'మ్మది

కడుపు చించి జన్మనిచ్చినందుకు
కడలి దాటించి దరిచేర్చునందుకు

1.స్తన్యమిచ్చి నా బొజ్జనింపింది
కంటికి రెప్పలా ననుకాచింది
తననోరుకట్టుకొని కోరినదిచ్చింది
కథలుచెప్పి జోలపాడి
నన్ను నిదురపుచ్చింది

నిస్వార్థపు సేవచేసి
ప్రేమగా పెంచింది
తనకుతాను మొత్తంగా
నాకే బ్రతుకు పంచింది

2.స్థిరమైన చిత్తముతో
చిత్ర పటము చూడలేదు
ఏకాగ్ర దృక్కులతో
తల్లి ప్రతిమ దాల్చలేదు
స్తోత్రాలు మంత్రాలతొ
అంబనుపూజించలేదు
మనసుపెట్టి ఎన్నడు
మాతను ధ్యానించలేదు

ఎందుకో జగజ్జననికి నాపై అనురాగం
ఏ పుణ్య విశేషమో
కవిగాయక ఘనయోగం