Monday, March 21, 2022

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


రాగం:కళ్యాణి


కళ్యాణ వేంకటేశ్వరా కళ్యాణమే కూర్చరా

కళ్యాణ వేంకటేశ్వరా జగత్కళ్యాణమే కూర్చరా

కారుణ్య శ్రీనివాసుడా మాపై కనికరము జూపరా

కారుణ్య శ్రీనివాసుడా అభయకరమునందీయరా

వేంకట గిరి శ్రీహరి గోవింద మాధవ హరే మురారి

ధర్మపురిన అలరారే వేంకటపతి నమోనమో శౌరి


1.మంగమ్మను పద్మావతిని సతులుగ చేకొంటివి

రంగరంగ వైభోగముతో సేవలందుకొనుచుంటివి

మేలుకొలుపు మొదలుకొని పవళించు వేళ వరకు

విశ్రమించవు భక్తులబ్రోయుచు కూర్చోవూ చివరకు

వేంకట గిరి శ్రీహరి గోవింద మాధవ హరే మురారి

ధర్మపురిన అలరారే వేంకటపతి నమోనమో శౌరి


2.వలచి వరించినావు  శ్రీమతిగా పద్మావతిని

అప్పుచేసి సైతం అందుకొంటివి శ్రీదేవి చేతిని

నిలువుదోపిడే అడిగేవు ఋణబాధ విముక్తికోసం

దేహమే కాదు స్వామి దోచుకోవయ్య నా మానసం

వేంకట గిరి శ్రీహరి గోవింద మాధవ హరే మురారి

ధర్మపురిన అలరారే వేంకటపతి నమోనమో శౌరి

 రచన,స్వరకల్పన&గానం:  డా.రాఖీ


సొట్టబుగ్గల సొగసెంత - కళ్ళు తిప్పలేనంత

సోగకన్నుల సొబగెంత - కవులు పొగడలేనంత

పలుకులలో పదునెంత- మంత్రముగ్ధులయ్యేంత

నవ్వులలో సుధ ఎంత-మృతులు తిరిగి బ్రతికేంత

నీస్నేహ సౌరభం ఒకవరం- చెలీ నీమనసే అనురాగ సరోవరం


1.మండుటెండలోన నీచెంతన మలయమారుతం

ఎడారిదారులందు ఎదురైతే నీవే ఆమని సంయుతం

కాళరాతిరిలో నీవే వెల్లువయ్యే పూర్ణచంద్రికా పాతం

ఆశల వెలుగుల పొడసూపేటి  తూరుపు సుప్రభాతం

నీస్నేహ సౌరభం ఒకవరం- చెలీ నీమనసే అనురాగ సరోవరం


2. నీవున్న తావులే కమనీయ నందనవనములు

నీసన్నధిలోని క్షణాలే  రాధికాసాంత్వన సమములు

నీ కరస్పర్శ  మరిపించు మయూర పింఛ స్పృశ్యతను

నీ దర్శనమే మురిపించు చకోరి చంద్రికా సదృశ్యతను

నీస్నేహ సౌరభం ఒకవరం- చెలీ నీమనసే అనురాగ సరోవరం

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


నీవే నడయాడే ఒక హరివిల్లు

నీ తనువున అణువణువున హోళీ ఆనవాళ్ళు

ఆపాదమస్తకం సప్తవర్ణ ప్రస్ఫుటమౌ గాజు పట్టకం

నఖశిఖ పర్యంతం వన్నెలు మార్చే కృకలాస సదృశం


1.విరబోసిన కురులలో ఒలికే నల్లదనం

చిరునవ్వున దంతాల మెరిసే తెల్లదనం

సిగ్గులొలుక బుగ్గలలో కురిసే ఎరుపుదనం

సిరిచందన ఛాయ చిలికె నీ సంవాహనం


2.నీ చేతి గాజులలో నిగారించె హరితము

పాదాల సంరక్షగ పరిఢవిల్లె హరిద్రము

వీనుల ఊగాడే బుట్టలదోగాడే ఉదావర్ణము

నయనాల కనుపాపల ద్యోతకమౌ నీలము