Monday, January 10, 2022

https://youtu.be/VQWfXctSmMk?si=FsOPtKiR4KA35HVj

 రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్(రాఖీ)

రాగం:పటదీప్

వలపుల వలన చిక్కవెందువలన
నీ కనులు మీనాలే కదా ఓ లలన
ముత్యాలు దొరుకునేలా నీ కడ  కడలే లేకున్నా
 నీ పెదవి అల్చిప్పల నవ్వులె మౌక్తికాల సృజన
స్పందించని ఎద ఉండదు  నిను తిలకించి
నందించని బ్రతుకుండదు  మది పులకించి

1.కాళిదాసులౌతారు నీ ఎదుట నిరక్షరకుక్షులు
తెనాలి రామకృష్ణులౌతారు నీవల్ల అజ్ఞాన పక్షులు
వరదలై పారుతాయి కవితలు కవితల నుండి
వరములై  తీరుతాయి కన్నకలలు కాస్తా పండి
స్పందించని ఎద ఉండదు  నిను తిలకించి
నందించని బ్రతుకుండదు  మది పులకించి

2.బింకమొదిలి చూసేరు నీవంక ఏదోవంకతో 
తహతహలాడేరు పలకరింప ఏదో టొంపుతో
వరుసకట్టి నిలిచేరు సామ్రాట్టులు నీ క్రీగంటి వీక్షణకై
రేబవళ్ళు పహారా కాసేరు ఈగవాలనీకుండ నీ రక్షణకై
స్పందించని ఎద ఉండదు  నిను తిలకించి
నందించని బ్రతుకుండదు  మది పులకించి


https://youtu.be/mG33I6z8G_Y


 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


రంగరించిన శృంగారం ..పోతపోసిన బంగారం

అంగాంగ నయగారం..అందాల ధనాగారం

తలపుకొస్తే జాగారం తప్పిపోతె చలిజ్వరం

కౌగిలిస్తే కారాగారం చుంబనాల్లొ రతిసారం


1.చేయబోకు చేష్టలతో నను మారాం

రేపబోకు నా మదిలో గాలి దుమారం

ఒక్కసారితాకనీయి నీమేనే అతిసుకుమారం

విరహమెంత వేధించినా మనమెన్నడు మారం


2.రమించే క్రమంలో మనతీరమెంతో దూరం

విరమించని మన ప్రయాణం ప్రణయ విహారం

అలుపులేదు చేరేదాకా సరస స్వర్గ ద్వారం

సృష్టికార్యమే పవిత్రం భావించనేల అది నేరం

https://youtu.be/Itw0hzat4Pk?si=hls1T4lvVNQhlukU

 రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్(రాఖీ


"అవసాన దశ"


గొంతేమో పెగలదు కాలుచేయి కదలదు

విన్నవించుకోవడం ఎంతకూ కుదరదు

ఎవ్వరూ గ్రహించకుంటె  బాధలెలా తీరురా

నా వెత గమనించకుంటె పాలుపోని తీరురా

నీవైనా ఎరుగవా నీలకంఠేశ్వరా హరా పరా

తక్షణమే స్పందించి నా యాతన నాపరా


1.రౌరవాది నరకాల్లో ఇంత క్రౌర్యముంటుందా

యమలోకపు శిక్షలలో ఈ దైన్యముంటుందా

పిడచకట్టు నాలుకపై గుక్కెడన్ని నీళ్ళకు కరువు

లుంగచుట్టు ప్రేగులకు పట్టెడంత ముద్దే ఆదరువు

నీవైనా ఎరుగవా నీలకంఠేశ్వరా హరా పరా

తక్షణమే స్పందించి నా యాతన నాపరా


2.కఫవాత పైత్యాలు దాడిచేసె నాపై ఒకేసారి

మతిమాట చెల్లకుంది నా మేన ఆపై ప్రతిసారి

పక్కతడిపే పరిస్థితుంటే ఇంకెక్కడిది పరువు

పశుపతి నీ చలవతో అయ్యింది గుండె చెఱువు

నీవైనా ఎరుగవా నీలకంఠేశ్వరా హరా పరా

తక్షణమే స్పందించి నా యాతన నాపరా

 https://youtu.be/zuZC8YYsaM4?si=PanrJVUqH03IniZc

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


ఎంత వర్చస్సు ముఖబింబానా

ఎంత తేజస్సు నీ స్వరూపాన

రెప్పైనా వాలదు నిన్ను చూస్తుంటే

చూపైనా మరలదు దర్శనమౌతుంటే

నినుపోలగ యత్నించాడు మోహినిగా శ్రీహరి

నువుగాక వేరేలేదు విశ్వ సౌందర్య లహరి


1.వశులుకాని దెవ్వరు ఇలలోన నినుగాంచి

పరవశులౌతారు నీ కైపులొ విలాసి విరించి

సామాన్య మానవుణ్ణి నీమాయకు వివశుణ్ణి

పాలుత్రాగు పసివాణ్ణి పరికించకు  దాసుణ్ణి

నినుపోలగ యత్నించాడు మోహినిగా శ్రీహరి

నువుగాక వేరేలేదు విశ్వ సౌందర్య లహరి


2.భీకరాకృతి దాల్చిన భద్రకాళి మూర్తివి నీవే

సదా చిన్మయానందం చిందించే పరాశక్తివీవే

నన్ను నిదురించనీ నీ ఒడి నెలబాలుడిగా

నీ పదముల కడతేరనీ నను పరమ భక్తుడిగా

నినుపోలగ యత్నించాడు మోహినిగా శ్రీహరి

నువుగాక వేరేలేదు విశ్వ సౌందర్య లహరి