Thursday, March 12, 2020

రచన,స్వరకల్పన&గానం:రాఖీ

విపత్తులేం కొత్తకాదు మానవాళికీ
ప్రకృతికి ఎదురీత అనాదిగా ఆనవాయితీ
బ్రతుకడమంటేనే నిత్యం సంస్ఫోటం
మనుగడ కోసం తప్పదెపుడు పోరాటం
చచ్చేవరకు జీవించాలి-చావుమిష ను చంపేయాలి
మానవలోకాన్నే స్వర్గతుల్యం చేయాలి

1.టర్నడోలు త్సునామీలు భువి ఎన్ని చూడలేదు
భూకంపాలు జలప్రళయాలెన్ననుభవించలేదు
బెదిరినంతసేపు మ్రింగచూచు ప్రతి సమస్య
ఎదిరించబూనితే తోకముడుచు పురుగు పుట్ర
బెంబేలు పడిపోతే ఉన్నమతి చెడిపోతుంది
జాగరూకులైతేసరి కరోనా కనుమరుగౌతుంది

2.ప్లేగు మశూచి వ్యాధుల మట్టుబెట్టలేదా
క్షయ కలరాలను కట్టడే సేయలేదా
జగమొండి రోగాలకు టీకా కనిపెట్టలేదా
నిరంతరం శోధిస్తూ చికిత్సలే చేపట్టలేదా
ప్రభుత్వ సూచనలన్నీ తు.చ తప్పక పాటించాలి
పాలనా యంత్రాంగానికి సహకరించి తీరాలి

3.నిర్లక్ష్యమె మూలకారణం అన్ని విలయాలకు
స్వయంకృతాపరాధాలే సకల జాడ్యాలకు
పరిశుభ్రత పాటించగలిగితే  పరమ ఔషధమౌతుంది
స్వఛ్ఛదనం పచ్చదనం మనిషికి సంజీవనౌతుంది
ఇంటిపట్టున ఉంటేచాలు కరోనా నరికట్టవచ్చు
మనుషులు తగు ఎడముంటే కరోనాఆట కట్టించవచ్చు
రచన,స్వరకల్పన&గానం:రాఖీ

సిత్రమే శివయ్య నీ తీరు
మొక్కినంత మాత్రాన్నే   ఆత్రాలన్నీ తీరు
వింతలెన్నొ సాంబయ్య నీ చెంతన
చింతలన్ని ఆర్పేను నీ నామ చింతన

 1.ముందూ వెనకా చూడవు
ఆగ్రహమొస్తే అసలే ఆగవు
అడ్డగిస్తే ఎవర్నైనా తలతెంచుతావు
భంగపరిస్తే మరున్నైనా దహియించుతావు
వీరభద్రునివై  కాలరుద్రునివై
శూల శస్త్రముతో జ్వాలనేత్రముతో

2.బూది బూసుకుంటావు
యోగ సమాధిలోన ఉంటావు
యాదిచేసుకోగానె వచ్చేస్తు ఉంటావు
ఏదడిగితే అది ఇచ్చేస్తు ఉంటావు
ఆలైనా ప్రాణాలైనా
పాశుపత అస్త్రమైనా పాశగత ఆయువైనా
రచన,స్వరకల్పన&గానం:రాఖీ

హక్కులంటే ఎంత ప్రీతి ప్రతి ఒక్కరికీ
బాధ్యతల ఊసే పట్టదు  జనాలకెవ్వరికీ
మినహాయింపే లేదు అమాత్యులైనా సామాన్యులైనా
ఓటేసే వరకే స్వీట్ మల్లన్న ఓటు వేసేసాక హేట్ మల్లన్న-బైకాట్ మల్లన్నా

1.ఆశయాలెన్నున్నా అవసరాల వరకే
ఎంతచదువుకున్నాగానీ తమభుక్తి కొరకే
అంతర్జాలంలో చిక్కుకుంది శిఖరాల నెక్కే యువత
రాంకుల పంట పండిస్తేనే ఔతుందా అది ఘనత
జాతీయత అన్నది ఎన్నడూ వినని బ్రహ్మపదార్థం
భారతీయత నాశించి భంగపడుటయే వ్యర్థం

2.అధికారమన్నదే అత్యంత ప్రాథమ్యం
పార్టీ ప్రయోజనాలైతే మరిమరి ముఖ్యం
డబ్బు -పదవి -డబ్బు అన్నదే ఓ విషవలయం
ఉఛ్చం నీచం అన్నవి రాజకీయాలలో మృగ్యం
ప్రజా సంక్షేమమే నేడు  ఓ నేతి బీరకాయ
అధినేతల చేతల్లో సర్వం సహా విష్ణుమాయ
రచన,స్వరకల్పన&గానం:రాఖీ

జయదేవుడు గ్రోలాడు నీ అందాల మకరందాన్నీ
కాళిదాసు రాసాడు నినుచూసే మేఘసందేశాన్నీ
అల్లసాని పెద్దన్న అల్లాడు పద్యాల్ని నీ వల్లనే
శ్రీనాథుడు వర్ణించిన రతిఆకృతి నీముందు కల్లనే
సహస్రదళ వికసిత సువర్ణ కమలం నువ్వు
గంధర్వ సంగీత అపూర్వ రాగస్వర సర్వస్వం నువ్వు

1.కలువలు ముకుళిస్తాయి నీ కనుల సింగారానికీ
 ఆవిరులే విరజిమ్ము విరులు నీ నయగారానికీ
భ్రమరాలు విభ్రములౌ నీ ముంగురుల అంగారానికీ
తారలు శశిని విడుచు నీమోము కోజాగరానికీ
విధాత అతులిత సౌందర్య శిల్పకల్పనా చాతుర్యం నువ్వు
అనన్య మానవ మానినీ సాదృశ ధన్యమాన్యవు నీవు

2.కిన్నెరసాని కన్నెరజేసింది నీ వయ్యారానికి
గోదావరి మ్రాన్పడిపోయింది నీగాంభీర్యానికి
క్రిష్ణవేణి విస్తుపోయింది నీ ఔదార్యానికి
భాగీరథి నివ్వెరపోయింది నీ నైర్మల్యానికి
షట్కర్మయుక్తగా సౌశీల్య వర్తిగా కీర్తిబడసినావు నీవు
సుగుణాల రాశిగా అనురాగరాగిణిగా వరలుతున్నావు