Saturday, August 14, 2021

 నా దేశమా నా భారత దేశమా

జగతికి తెలిపెడి మానవతా సందేశమా

చెదరని ఆకృతి చెరగని సంస్కృతి 

మువ్వన్నెల పతాకతో నింగికి పట్టగ హారతి

జోహార్ జోహార్ జోహార్ నీకిదె భారత భారతి


1.సున్నా అన్నది కనుగొని 

శూన్యం గణితాధారమని

వేదవిజ్ఞాన విశ్లేషణలో వికాసమెంతో సాధించి

శాస్త్రవిజ్ఞాన రంగంలో ఆవిష్కరణలుగావించి

ప్రపంచానికే తలమానికమై వరలే నా దేశమా

మేధావులనే విశ్వవ్యాప్తి గావించిన నా దేశమా


2.తాత్విక దర్శనమందించి

యోగ అన్నది అనుగ్రహించి

పారమార్థక సాధనమ్ములో సార్థకతనే బోధించి

మానవసేవయే మాధవసేవగ లోకానికి ప్రవచించి

ప్రపంచానికే తలమానికమై వరలే నా దేశమా

తత్వవేత్తలే విశ్వవ్యాప్తమై వెలిగే నా దేశమా





కదలవు మెదలవు-ఉలకవు పలకవు

పొగడినా పొంగవు-తెగడినా కృంగవు

ఎలా నీవు వశమయ్యేది-శ్రీహరి

ఏ మంత్రానికి లొంగేది తిరుపతి శ్రీపతి


1.గోవింద యనుచు నామాలు పఠించనా

కాలినడకతో నీ సప్తగిరుల నెక్కనా

తలబిరుసుని వదిలేసి నీలాలొసగనా

నీ కోనేటిలొ మునకలేసి పునీతమవనా


2.నీ మంగళ విగ్రహాన్ని దర్శించనా

పలు విధాల సేవలతో అర్చించనా

ముడుపులు కానుకలను సమర్పించనా

మనసావాచా కర్మణా నన్నే నివేదించనా

నీ పాదపద్మాల నా కవి తలనుంచనా