Tuesday, September 1, 2020

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

చెలీ చెలీ చెలీ సఖీ సఖీ సఖీ
నీ పేరు జపమయ్యింది
నీ తలపు తపమయ్యింది
నీపై ప్రేమ ఊపిరయ్యింది
నీతో బ్రతుకు ఆయువయ్యింది
ఎలా చావనే చెలీ బంధించు నీ బిగి కౌగిట
అందించు నే జీవించగ  అధర సుధలు ఏ పూట

1.కనిపించకుంటేనేమో మనుగడే దుర్భరము
కనిపించినావంటే సడలేను మది నిబ్బరము
అందుకోలేను నేలనేను నీవు నీలిఅంబరము
ఇంద్రధనుసు వంతెనమీదుగ నిను చేరగ సంబరము
ఎలా చావనే చెలీ బంధించు నీ బిగి కౌగిట
అందించు నే జీవించగ  అధర సుధలు ఏ పూట

2.తపనతో పరుగున వస్తే మృగతృష్ణవైతేనో
మనం సంగమించే చోటు దిక్చక్రమైతేనో
రెక్కలగుర్రమెక్కినేను నీ కల్లోకి వచ్చేస్తాను
ఏకాంతలోకాలకు నిన్నెగరేసుక పోతాను
ఎలా చావనే చెలీ బంధించు నీ బిగి కౌగిట
అందించు నే జీవించగ  అధర సుధలు ఏ పూట
https://youtu.be/4nU6GF6apXA?si=8TAikC1vcpe_gvvf

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

ఆకుపూజ నీకు చేతుమయ్యా ఆంజనేయా
ఆదుకొనుము ఆపదల్లొ మము వీరహనుమా
జిల్లేడుపూలమాల వేతుమయ్యా జితేంద్రియా
మాన్పవయ్య వ్యాధులన్ని సంజీవరాయా
వందనాలు అందుకో వాయునందనా
హరిచందనాలు గొనుమయ్య లంకాదహన పంచాననా

1.కోరినిన్ను కొలిచేము వాగధీశుడా
కొబ్బరికాయ కొట్టేము కొండగట్టు వాసుడా
పొర్లిదండాలు బెట్టేము కేసరి ప్రియసూనుడా
రామభజనలో మునిగెదము రాక్షసాంతకుడా
వందనాలు అందుకో వాయునందనా
చందనాలు గొనుమయ్య లంకాదహన పంచాననా

2.కృపతో మము చూడవయా హే కపివరా
చిత్తము స్థిరపరచవయా చిరంజీవుడా
ఆర్తితొ నిను శరణంటిమి మమ్మాదరించరా
ఆయురారోగ్యాలను స్వామి ప్రసాదించరా
వందనాలు అందుకో వాయునందనా
చందనాలు గొనుమయ్య లంకాదహన పంచాననా
https://youtu.be/BorVKaD_mwY

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

రాగం:హిందోళ వసంతం

స్వరం దేవుడిచ్చిన వరం
ఎలుగెత్తి ఆలపించగా తనువంతా రోమాంచితం
గాత్రం పరమ పవిత్రం
అపాత్రదానమనిపించేలా ఏల గర్వసంచితం
రంజింపజేయడమే గాయనీగాయక ధ్యేయం
మంజుల కలనిస్వనమే శుకపిక న్యాయం

1. సరాగాలు చిలకాలి మేను వీణగా మార్చి
శ్రావ్యతే ఒలికించాలి మనసు పులకరించి
మైమరిచిపోవాలి శ్రోతలూ గీతప్రదాతలు
స్థాణువులై నిలవాలి సకల జీవజాతులు
రంజింపజేయడమే గాయనీగాయక ధ్యేయం
మంజుల కలనిస్వనమే శుకపిక న్యాయం

2.శ్రుతితొ సంధానించాలి  జీవరావము
లయకు నిలయం కావాలి హృదయనాదము
శ్రుతి లయల మేళనంలో అనురాగం ఉదయించాలి
రాగతాళ సంగమంలో రసయోగం సిద్ధించాలి
రంజింపజేయడమే గాయనీగాయక ధ్యేయం
మంజుల కలనిస్వనమే శుకపిక న్యాయం