Thursday, July 23, 2020

నేటి నిజం దిన పత్రిక
మేటిదైన మన వార్తా పత్రిక
బైస దేవదాసు మానస పుత్రిక
పాఠక జనులకైతె నిత్య వేడుక

1.నిక్కచ్చి నిజాల కిది వేదిక
వాస్తవాల్నె ఘోషించే గొంతుక
పూర్తిగా పక్షపాతరహితమైనది
ఏ రాజకీయ పక్షానికి చెందనిది
పాత్రికేయ విలువలకు పేరొందినది
నమ్మిన సత్యానికే కట్టుబడినది

2.సారస్వతానికిచట పెద్దపీట
గురువారం సాహితీ కెరటాలె ప్రతిపుట
వర్ధమాన కవులకిచ్చు తగు బాసట
ఉత్తమ కవితలకు చోటు దొరికేనిట
తెలుగు రాష్ట్రాల ప్రభావవంతమైంది
పత్రికాలోకంలో మకుటాయ మానమిది

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

రాగం:దర్బార్ కానడ

పటాపంచలే చేయి సాయి
మా అజ్ఞాన తిమిరము
మనస్థైర్య మందించవోయి
నెగ్గునటుల బ్రతుకు సమరము
సాయిరాం షిరిడీ సాయిరాం
సాయిరాం ద్వారకమాయి రాం

1.కులమతాల నంటగట్టు నీకో గిరిగీసిపెట్టు
కుంచితమౌ మనోభ్రమలు మావి
మనిషివో దేవుడివో మర్మమునే ఎరుగనట్టి
సంచితమౌ దుష్కర్మలు మావి
సాయిరాం షిరిడీ సాయిరాం
సాయిరాం ద్వారకమాయి రాం

2.నమ్మిక తక్కువ భయమే ఎక్కువ
దైవమంటె మా మదిలో భావము
వంచనలే మించిపోయి లంచాలే వ్యసనమై
ప్రాయశ్చిత్తమటుల నీ శరణము
సాయిరాం షిరిడీ సాయిరాం
సాయిరాం ద్వారకమాయి రాం

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

రాగం:అమృత వర్షిణి

యతులకైన మతిచలించు
మునుల దీక్షనే ముంచు
ఋషులైనా పరవశించు
యోగుల భోగులగావించు
నీ అందానికి వందనాలు  వన్నెల సుందరీ
నీ పరువానికి ప్రణామాలు సొగసుల మంజరీ

1.కలములనే కదిలించు
కుంచెలైన  పులకించు
ఉలులింక ఉరకలెత్తు
అందెలు ఆరాటమొందు
నీ అందం బంధించగ వన్నెల సుందరీ
నీ పొంకం ప్రకటించగ సొగసుల మంజరీ

2.కుర్రకారు వెర్రెక్కు
దంపతుల కొంపముంచు
ముదుసలికే కసిరేపు
ముదితలైన మోహించు
నీ చక్కదనం అతి మిక్కిలి వన్నెల సుందరీ
నీ రూపం ఎదతాపం సొగసుల మంజరీ
https://youtu.be/SM5s3sOrcJ8?si=9Oqn5VEqWkvpgsrU

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

రాగం:భూపాలం

హాయిగొలుపు శ్రీ నరహరి సుప్రభాతం 
ధర్మపురి జనులకది అనునిత్య జాగృతం
మబ్బుననే మేలుకొని గోదారికి పయనం
స్నానానుష్ఠాలతొ ప్రతి దినం పావనం
మదినూయలనూపుతాయి మాఊరి(ధర్మపురి) జ్ఞాపకాలు
మధురానుభూతులతో కూడుకున్న వైభవాలు

(రాగం:మోహన)

1.ఆండా గాగిరుల నిండ స్వఛ్ఛమైన నదీజలం
దారంతా పలుకరిస్తు పరుల కుశల ప్రస్తావనం
ఇల్లుచేరి పూలు వత్తులతో మందిరాలకు చనడం
నరహరి హర బ్రహ్మలను ఆర్తి మీర అర్చించడం
ప్రదక్షిణాలు చండీలు సాష్టాంగ ప్రణామాలు
స్తోత్రాలు కీర్తనలు వేదోపనిషత్తుల పారాయణాలు

(రాగం:షణ్ముఖ ప్రియ)

2.పొద్దస్తమానం తమతమ పనులలో మునగడం
పురాణాలు హరికథలు ఇష్ఠాగోష్ఠుల మాపు గడపడం
పండుగలు పబ్బాలు బోయనాలు వాయనాలు
ప్రతి రోజూ ఉత్సవాలు ఆధ్యాత్మిక అనుభవాలు
నోములు వ్రతాలు దంపతీ సహితమైన ఆతిథ్యాలు
దానధర్మాలు ఆచార సంస్కృతీ సంప్రదాయాలు

(రాగం:సింధు భైరవి)

3.ఊరంతా బంధువులు పరమతాల స్నేహితులు
పెండ్లి పేరంటాలకు సకల జనులు ఆహూతులు
రుద్రాభిషేకాల వాడవాడ శివ పంచాయతనాలు
బతుకమ్మల ఆటలు  పీర్లు లాల్ సాబులు
జమ్మిపత్రాల దసరా ఆలింగనాలు అభివాదాలు
కడతేరాలి ధర్మపురిలో మాజీవితాలు జన్మజన్మలు
రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

కాళ్ళక్రింద ఉన్న నేల కదిలిపోతున్నప్పుడు
నీ అవయవాలేవీ సహకరించకున్నప్పుడు
జగమంతా నిండి ఉన్న గాలి నీకు అందనపుడు
ఉక్కిరిబిక్కిరేంటొ అనుభవానికొచ్చి నపుడు
కళ్ళుతెరుచుకున్నా అప్పుడేమి ప్రయోజనం
ముందస్తు జాగ్రత్తతొ బ్రతికి బట్ట కట్టు జనం

1.నెత్తినోరు మొత్తకొని చెప్పినా వినరాయే
ఎదుట జరుగు భీభత్సం ఏ మాత్రం కనరాయే
తమదాకా వస్తెగాని పట్టించుకోరాయే
తబ్బిబ్బైపోతె వినా తీవ్రతనెరుగరాయే
కళ్ళుతెరుచుకున్నా అప్పుడేమి ప్రయోజనం
ముందస్తు జాగ్రత్తతొ బ్రతికి బట్ట కట్టు జనం

2.తమ కాయమైనా సరె శ్రద్ధన్నదే మృగ్యం
కాసింత వ్యాయామం మెరుగు పరచు ఆరోగ్యం
రోగాలకు దూరముంటే అదే కదా సౌభాగ్యం
జీవించుటకై త్యజించుటే మనుజాళికి యోగ్యం
కళ్ళుతెరుచుకుంటేనే కలుగుతుంది ప్రయోజనం
ముందస్తు జాగ్రత్తతొ బ్రతికి బట్ట కట్టు జనం
నట్టింట తిరుగాడే మహలక్ష్మి మా చెల్లెమ్మ
కనురెప్పలాగా నను కాచు మా అన్నయ్య
సోదరిసోదరుల పండగే రక్షాబంధనం
అనురాగం యోగంగా నడిపించే ఇంధనం

1.హరివిల్లు విరిసేను నా చెల్లి నవ్వులలో
అమృతమే కురిసేను నా అన్న చూపులలో
చెదరనిది మరవనిది తోబుట్టుల అనుబంధం
సృష్టిలోన తీయనైనది ప్రేగు పంచుకున్న బంధం

2.యమద్వితీయ నాడు  భగిని నీ హస్త భోజనం
రాఖీ పున్నమి రోజు అన్నా నీకు నీరాజనం
రక్తసంబంధం మనది ఎన్నడు వీడిపోనిది
ఆత్మీయ గంధం మనది ఎన్నడు వాడిపోనిది