Thursday, June 24, 2021

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


శుక్రవార శుభలక్ష్మి

చక్రధారి గృహలక్ష్మి

స్వాగతమమ్మ నీకు ఆరోగ్యలక్ష్మి

వందనమమ్మ నీకు ఆనందలక్ష్మి


1.వక్ర బుద్ధి మాకెవరికి కలగనీయకమ్మా

అక్రమార్జన కెపుడు మాకు తావీయకమ్మా

తృణమో ఫణమో పంచే గుణమీయవమ్మా

ఉన్నంతలొ జీవించే తృప్తి నీయవమ్మా


2.చిరునవ్వును పెదవులపై చెరగనీయకమ్మా

బంధుమిత్రులే సిరులను భావమీయవమ్మా

ప్రకృతితో చెలిమి జేయు వరమీయవమ్మా

నీ ఆకృతి మా మదిలో చెదరనీయకమ్మా

 రచన,స్వరకల్పన&గానం:రాఖీ


రెప్పకు చూపుకు పోరాటం

తనువుకు మనసుకు తప్పని జగడం

రెప్పనిదుర పొమ్మంటుంది

చూపు ఆగమంటుంది

తనువు తప్పదంటుంది

మనసు గోడు వినమంటుంది


1.రెప్ప చెప్పి ఒప్పిస్తోంది

కలకు చెలిని రప్పిస్తానని

చూపు నమ్మనంటోంది

నిమిషమైన ఆపలేనని

నిదుర బెదిరి పోతోంది

కలత కుదరదంటోంది

గొడవ సద్దుమణిగే లోగా

వేకువ పొడసూపుతోంది


2.రెప్పమూసినా గాని

చెలి రూపు నిలిపింది

స్వప్నాల సౌధం లోకి

సఖిని సాగనంపింది

తనువుతో రాజీకొచ్చి

మనసు నెమ్మదించింది

చెలియ మనసుతో చేరి

ప్రణయ గీతి పాడింది

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


బంధించు  నీ హృదయంలో

సంధించు నీ ప్రణయంలో

సాధించు నన్ను సఖీ నీ సన్నిధిలో

ముంచిఉంచు ఎప్పటికీ ప్రేమాంబుధిలో

హక్కులన్ని చేసేసా నీ పరమే

నువు నాకు దక్కడమన్నది ఒక వరమే


1.ఊపిరాడనీయకూ నీ కౌగిలిలో

తేరుకోనీయకు ముద్దుల జడిలో

గాయపరచవే నన్ను నాలిక ఛూరికతో

దోచేయి సర్వస్వం మంత్రతంత్ర విద్యలతో

హక్కులన్ని చేసేసా నీ పరమే

నువు నాకు దక్కడమన్నది ఒక వరమే


2.బానిగా మార్చుకో వశీకరణ చేసి

దాసునిగా చేసుకొ దేవీ కోరికలే తీర్చేసి

నను కట్టడి చేసేయి కనికట్టు చేసేసి

నేన్నే లేకుండా చేయి నీవుగా మార్చేసి

హక్కులన్ని చేసేసా నీ పరమే

నువు నాకు దక్కడమన్నది ఒక వరమే

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


నువ్వు నవ్వితే రోజూ పున్నమి

నాకన్నుల నీవే నిండు జాబిలి

మేఘమాల మధ్యన చందమామ నీ మోము

ఒక నిమిషమైనా దృష్టి మరల మనలేము


1.పొందికలోనె ఉంది నీ ఎనలేని అందము

ఒద్దికనే తెలుపుతోంది  పొందిన ఆనందము

నిను గనినంతనే పరవశమౌ నా డెందము

కలయే నిజమై  కలవరమౌ చందము


2.హళేబీడు శిల్పాలు నినుగాంచి చెక్కినవే

అజంతా చిత్రాలకు అలనాడు ప్రేరణవే

ప్రబంధ నాయిక పాత్రలు నీ వల్ల వెలిసినవే

దేవీ మూర్తులన్ని నీ స్ఫూర్తితొ మలచినవే