Saturday, May 23, 2020

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

నీ విలాసము కైలాసము
నీ విలాసము కైవల్యము
నీ లాసము వేదికే నా మానసం
నీ చిద్విలాసమే నా జీవితం

1.లింగమయ్యవు నీవు
జంగమయ్యవు నీవు
గంగనే తలదాల్చినావు
సంగరమె చేసావు నా బ్రతుకునీవు

2.కనురెప్ప మాటు మంట
నెత్తిన సెంద్రయ్య సలువంట
మితిమీర నేకోరితేనూ తంట
గతిలేక నిన్నే మరి నమ్ముకుంట

3.ఈ దేహమే నేనాయె
నా ప్రాణమే నీవాయె
మన మధ్య ఉన్నదే మిథ్య
నేను నువ్వైనపుడే సయోధ్య

https://youtu.be/e8NpEWAPHO4?si=maZVmCVd8uSNaThr

రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్(రాఖీ)

రాగం: పుష్పలతిక

తడిసి తడిసి ముద్దౌదాము
పున్నమి వెన్నెల జల్లులలో
సౌరభాల మత్తిలుదాము
వేసవి రాతిరి మల్లెలలో
రసమయం అయిపోనీ ఈ సమయం
మన ఇరువురి లోకమంత  ప్రేమమయం

1. గోదావరి ఇసుకతిన్నె మన పడక
గలగల పారునీరు తీర్చేను దప్పిక
మనోరథం సాగడమిక నల్లేరుమీద నడక
సాదిద్దాం భవసిద్ధిని ఏమాత్రం తడబడక
రసమయం అయిపోనీ ఈ సమయం
మన ఇరువురి లోకమంత  ప్రేమమయం

2.గుచ్చుతోంది మేనంతా ఇసుకరాపిడి
హెచ్చతోంది నరనరాన నెత్తుటి రువ్వడి
వింతైన అనుభూతి నిస్తోంది చెమటతడి
ఎవరమెవరొ తెలియకుంది బంధం ముడివడి
రసమయం అయిపోనీ ఈ సమయం
మన ఇరువురి లోకమంత  ప్రేమమయం


కరోనా కన్న మిన్న వైరస్ నీ కరమునందున్నది
సునామీ కన్న డేంజరస్ నీ ఇల్లు నల్లుకున్నది
విభజించి పాలించే యుక్తిగలది స్మార్ట్ ఫోన్
విశ్వమంత విస్తరించు నేర్పున్నది స్మార్ట్ ఫోన్

1.ఊపిరి ఆగునేమొ గానీ
దివారాత్రాలు బ్రౌజింగ్ ఆగకున్నది
నిద్రాహారాలు మానితేమి
స్మార్ట్ ఫోన్ వినా క్షణం సాగకున్నది
వ్యసనాలను మించిపోయింది సెల్లు ఫోను
ప్రాణంగా పరిణమించిందీ మొబైల్ ఫోను

2.ఏకై వచ్చింది లోకానికి
మేకై గుచ్చుకుంది గుండెలోనికి
కమ్యూనికేషన్ కై పుట్టింది
వామనుడే త్రివిక్రముడైనట్టుంది
అనుబంధాలన్నిటినీ బొందబెట్టింది
మంటే తెలియనట్లు తీయగా కుట్టింది
రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

ప్రశాంతతేది నాకు విజయం వరించీ
ప్రతిసారీ ప్రగతికై నేనో విరించి
ప్రతిభను కనబరచాలి అంతకుమించి
ప్రస్థానమిరుకౌతున్నా అధిగమించి

1.చూపించగలగాలి కొంగ్రొత్తదనమేదో
ఆకట్టకోవాలి  విషయ వైవిధ్యంతో
పునరుక్తి కాకుండా ప్రస్తావించాలి
ఎదుటివారి నాడేదో పట్టుకోగలగాలి

2.ఊరుతూనె ఉండాలి ఆర్ద్రత హృదయంలో
నిరంతరం  తరించాలి మేధోమథనంలో
మనసును హత్తుకునే మత్తేదో చల్లాలి
ఇదమిద్దం ప్రతీకలతొ అద్దమల్లె తెలపాలి

3.లోకోఃభిన్నరుచి అన్నది మరవొద్దు
అన్నీ అందరూ మెచ్చాలను భ్రమవద్దు
మహామహులకైనా తప్పలేదు ఆటుపోట్లు
పొరపాట్లు సహజమే కూడదు కప్పదాట్లు