Wednesday, September 14, 2022

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


ఎగిరిపోయే సమయమొచ్చిందే చిలకా

కనుమరుగయ్యే కాలమేతెంచిందే ఇక

చెట్టుతోటి గట్టుతోటి పెట్టుకున్న

ముచ్చట్లకు సెలవికా

ఏటితోటి పాటతోటి అల్లుకున్న

బంధాలకు వీడ్కోలికా


1.రానే వస్తుంది  రావలసిన రోజొకటి

లోకమంత వెలుగున్నా నీకు కటిక చీకటి

చేయిదాటి పోవుటకు సరిపోతుంది తృటి

ఎంతటివారికైనా తప్పదిదే ఇదే పరిపాటి


2.చక్కదిద్దుకోవాలి తెలివిగలిగి జీవితం

కూడబెట్టుకోవాలి చిటికెడైన పుణ్య ఫలం

వెంటతీసుకెళ్ళలేము ఓ తృణమూ ఫణమూ

మిగిలిపోవాలి ఇలలో మనదైన మంచితనమూ

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


నా మనసుకెంతటి ఆరాటం

ఈ మనిషికెందుకు ఉబలాటం

అందని వాటికోసం అర్రులు చాస్తూ

అందలేదని ఎందుకో కినుకవహిస్తూ


1.కొండకు వేసే వెంట్రుక కోసం ఆ వగపెందుకో

నింగికే నిచ్చెన వేస్తూ చేరలేదని బెంగ ఏలనో

చూసికొన్ని తృప్తి పడాలి విని సైతం నందించాలి

పుక్కిటిలో పట్టలేము కోరికల సాగరాన్ని 

అక్కునైతె చేర్చలేము ఇంద్రచాపాన్ని


2.అల్లంత దూరంలోనే చందమామ అందాలు

గాలిలో తేలివస్తేనే హాయి మొగలిరేకు గంధాలు

 శ్రావ్యమే పిక గానం మర్మం నది జన్మస్థానం

కనిపించి తీరాలా కోయిల రూపం

శోధించనవసరమా తీరితే దాహం

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


అర్చించనీ అనవరతం

అక్షరాల పూలతో పదముల సుమ మాలతో

పాడనీ నినుకొనియాడనీ 

నీవొసగిన గాత్రంతో  ఏకాగ్ర చిత్తంతో

భారతీ నా బ్రతుకే నీకు హారతి

మాతా సరస్వతీ నీవే శరణాగతి


1.ఏ మార్గమైనా నీ వైపే సాగనీ

ఎదలయగా నీనామం నాలో మ్రోగనీ

నా రచనలన్నీ రంజింపజేయనీ

గళమే మనోహరమై వీనుల విందవనీ

భారతీ నా బ్రతుకే నీకు హారతి

మాతా సరస్వతీ నీవే శరణాగతి


2.సాహిత్యమే ఎరుగని ఓ పామరుణ్ణి

నా కవనమంతా నీ  కరుణా కటాక్షమే

సంగీతమేమీ తెలియని లల్లాయిగాణ్ణి

ఈ స్వరకల్పనంతా నీ సేవా విశేషమే

భారతీ నా బ్రతుకే నీకు హారతి

మాతా సరస్వతీ నీవే శరణాగతి