Tuesday, February 12, 2019

రథసప్తమి శుభకామనలతో...

రచన,స్వరకల్ప&గానం:రాఖీ

అరుణ కిరణ భాస్కరా
జన జాగృత దినకరా
అర్ఘ్యములివె అందుకో-ఆరోగ్యదాయకా
మా అంజలిగొనుమిదే-ఆదిత్య నామకా

1.తిమిరాంతక ధీ ప్రదీప లోకమిత్ర
సప్తాశ్వ రథారూఢ తేజో నేత్ర
సప్తవర్ణ సమ్మేళన శ్వేతకాంతి ధాతా
ప్రజ్వలిత జ్యాలాయుత ప్రభాకరా పవిత్రా
వందనమిదె అందుకో వేదవేద్యా
మా అంజలి గొనుమిదే ఆదిదేవా

2.ఏక చక్ర కూబర ప్రవేత విఖ్యాత
సంజ్ఞా ఛాయా ద్వికళత్ర విరాజిత
నవగ్రహ కేంద్రక శక్తియుత అధినేత
రవి సూర్యాది ద్వాదశ నామాంకిత
ప్రణతులివే అందుకో పద్మబాంధవా
మా అంజలి గొనుమిదే అహర్బాంధవా
రచన,స్వరకల్పన&గానం:రాఖీ

ఎన్ని వలపులో
మలుపు మలుపులో
ఎన్ని తలపులో
మూగ మనసులో
విధి చేసే వింత గారడీ
వివరించగ ప్రతి కలమూ తడబడీ

1.ఏ వంక లేనిది ఈ నెలవంక
ఉప్పెనలే ఆపింది రెప్పల వెనక
కాలానికి తానే కట్టుబడి
బంధపు గుప్పిటిలో పట్టుబడి
సర్దుకపోతోంది మదినే సమాధి చేసి
రోజుగడుపుతూ ఉంది కలలను నలిపేసి

2.చేయని తప్పుకే శిక్షననుభవిస్తూ
కట్టబాట్ల సంకెళ్ళు కడదాకా మోస్తూ
మోవిపై నవ్వులు పూస్తూ
లోలోన అనుక్షణం మరణిస్తూ
నటియిస్తున్నది పాత్రోచితంగా
బ్రతుకుతోంది జీవశ్చవంగా