పది అవతారాల పిదప పదకొండోది
సద్గురువుకు స్వరూపమౌ అవధూతది
సాయీ తత్వమాయె వివాదాస్పదము
వితండవాదనలా విశ్వాసమంటె హాస్యాస్పదము
సచ్చిదానంద సద్గురు సాయినాథ జయహో
అవధూత చింతన గురుదేవదత్త జయహో
1.రంధ్రాన్వేషకులకు తమ జన్మన్నా సందేహమే
నాస్తిక శ్రేష్టులకు తమ తండ్రి ఎడలసైతం సంశయమే
నమ్మకాన్ని నిర్వచించే వారెవరు సృష్టిలో
అనుభూతులన్ని అనుభవైకవేద్యాలే నా దృష్టిలో
సచ్చిదానంద సద్గురు సాయినాథ జయహో
అవధూత చింతన గురుదేవదత్త జయహో
2.గాలి కంటికి ఆనదు నిప్పు రుచికి అందదు
నీరు గంధమెరుగదు శూన్యాకాశం స్పృశించదు
సాధించే దిశలోనే మన శోధన సాగాలి
యోగించునంతవరకు యోగిని సేవించాలి
సచ్చిదానంద సద్గురు సాయినాథ జయహో
అవధూత చింతన గురుదేవదత్త జయహో