Wednesday, November 3, 2021



దీపాలు వెలిగించినావు సాయి

పేలికలే వత్తులయి నీరే చమురయి

గాలిలో శయనించినావు బహువిచిత్రమై

చెక్కబల్ల తల్పమయి ఇటుకనీకు తలగడయి

నీ మహిమలనన్యము నీ లీలలు కడురమ్యము

సచ్ఛరిత్ర పారాయణ పుణ్యము బ్రతుకు ధన్యము


1.పిల్లలతో గోళీల ఆటలాడినావు

బల్లి భాషలోని మర్మమెరిగినావు

పిండి జల్లి మశూచిని పారద్రోలినావు

లెండీ వనములో పూమొక్కలు పెంచినావు

నీ మహిమలనన్యము నీ లీలలు కడురమ్యము

సచ్ఛరిత్ర పారాయణ పుణ్యము బ్రతుకు ధన్యము


2.మహల్సాపతితో మైత్రిని సలిపినావు

హేమాద్పంతుతో స్నేహము చేసినావు

తాత్యాని నీవు మేనఅల్లుడని ఎంచినావు

ధునిమంటలొ చేయుంచి పసిబిడ్డని  కాచినావు

నీ మహిమలనన్యము నీ లీలలు కడురమ్యము

సచ్ఛరిత్ర పారాయణ పుణ్యము బ్రతుకు ధన్యము


రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ


ప్రణతులు నీకివే ప్రభో ధన్వంతరి

వినతులు గైకొనుమా సాక్షాత్తు శ్రీహరి

వైద్యశాస్త్రానికే ఆది మూల పురుషుడవు

వైద్యలోకమంతా కొలిచే భగవంతుడవు

మా రుగ్మతలోకార్చు మా రుజలనెడబాపు


1.పాలకడలి చిలికినపుడు పుట్టినావు

విష్ణుమూర్తి అంశతోటి జన్మించినావు

గౌతమినది తీరాన స్థిరముగా వెలసినావు

చింతలూరు గ్రామాన కొలువుదీరి యున్నావు

మా రుగ్మతలోకార్చు మా రుజలనెడబాపు


2.సుందర మూర్తిగా ప్రత్యక్షమౌతావు

చతుర్భుజాకారునిగా దర్శనమిస్తావు

శంఖ చక్రాలను  హస్తాల  ధరించినావు

అమృతకలశము జలగను పూనినావు

మా రుగ్మతలోకార్చు మా రుజలనెడబాపు


3.ఆయుర్వేదమును ఆవిష్కరించినావు

శుశ్రుత చరకాదులకు గురుదేవుని వైనావు

వేపా పసుపుల నొసగిన దివ్య వైద్య శ్రేష్టుడవు

మొండి వ్యాధులన్నింటిని  తొలగించే ఘనుడవు

మా రుగ్మతలోకార్చు మా రుజలనెడబాపు

 

ప్రత్యూష తొలి కిరణం 

నునువెచ్చగ నను తాకిన వైనం

పూరెక్కల పైని  తుషారం

నా కన్నుల మెరిసే ప్రతిబింబం

నిన్ను తలపిస్తుంటే మేను రోమాంచితం

నువు గుర్తుకొస్తుంటే హాయి వర్ణనాతీతం


1.పడమటి సంధ్యారాగం పలకరింపులు

గోదావరి ఇసుక తిన్నెల పరామర్శలు

మబ్బుచాటు జాబిలి దోబూచులాటలు

తళుకు తారలు మేలిముసుగుతొ వలపు పిలుపులు

నిన్ను తలపిస్తుంటే మేను రోమాంచితం

నువు గుర్తుకొస్తుంటే హాయి వర్ణనాతీతం


2.కోనేటి మెట్ల సాక్షిగా మధురానుభూతులు

నీటి అలలు నీ పదాల ముద్దాడిన స్మృతులు

ధ్వజస్తంభపు జేగంటల మంజుల శ్రుతులు

గోపురాన పావురాల జత పాడే ప్రేమకృతులు

నిన్ను తలపిస్తుంటే మేను రోమాంచితం

నువు గుర్తుకొస్తుంటే హాయి వర్ణనాతీతం