Friday, August 30, 2019

రచన,స్వరకల్పన&గానం:రాఖీ
రాగం:వసంత

ఆత్మ రాధ పరమాత్మ కృష్ణ
తత్వమసి యే సంగమ తృష్ణ
బృందావనమే సకలభువనము
మురళీరవమే ఓంకార స్వనము
రాధామాధవీయం రమణీయం
రాసవినోదం కడుకమనీయం

1.నెరవేరని కలలు గోపికలు
తీరని కోర్కెలు అష్టభార్యలు
యమునా తీరము ఈ సంసారము
సాయంకాలము కర్మ పాకము
రాధామాధవీయం రమణీయం
రాసవినోదం కడుకమనీయం

2.తొలగించు వలువలు దేహచింతనలు
బిగికౌగిలులే ఆత్మైక్య సాధనలు
చుంబిత రసనలు సుధాసేవనలు
రమించు భావనలు పరసౌఖ్య యోగములు
రాధామాధవీయం రమణీయం
రాసవినోదం కడుకమనీయం

Thursday, August 29, 2019

రచన,స్వరకల్పన&గానం:రాఖీ

సాకి:కక్కలేడు మ్రింగలేడీ కలియుగ శివుడు కర్తవ్య గరళాన్ని
చేయలేడు మానలేడు మానవతామూర్తి నిర్వర్తిత కార్యాన్ని
రాత్రి లేదు పగలు లేదు అలుపెరుగని ఈరవికి
పోలికే దొరకదు  పోల్చేందుకు ఏకవికి

అన్నా నీకు వందనాలన్నా
పోలీసన్నా సలాము నీకన్నా
గులామునే నెరవేర్చే నీబాధ్యతకన్నా
ఫిదానైపోయాను నీ నియ్యతికన్నా

1.విందులు వినోదాలు లేకున్న మానె
పండగ పబ్బము నీకు ప్రజలతోనె
శాంతీ భద్రతల పరిరక్షణె నీకు తృప్తి
సజావుగా జనులెప్పుడు మనగలుగుటె అనురక్తి
అన్నా నీకు వందనాలన్నా
పోలీసన్నా సలాము నీకన్నా

2.ఎందుకో చిన్నచూపు ప్రజలకు నీవైపు
ఎంత ఆదరించినా బెదురే నీ దాపు
కలుపుతీయ గలిగితేనె కలల పంట పండు
నీతికిమారుపేరు కావాలి మీ దండు
అన్నా నీకు వందనాలన్నా
పోలీసన్నా సలాము నీకన్నా

3.వత్తిడులతో ఎంతగానొ నలిగిపోతుంటావు
వృత్తికీ ప్రవృత్తికీ  మధ్య కుములుతుంటావు
కుటుంబానికెంతగానొ దూరమౌతుంటావు
అనవరతం ప్రజాసేవ పరమార్థమంటావు
అన్నా నీకు వందనాలన్నా
పోలీసన్నా సలాము నీకన్నా

Wednesday, August 28, 2019

రచన,స్వరకల్పన&గానం:రాఖీ
రాగం: మధుకౌఁస్

తెలుగుకన్న వెలుగు పంచు భాషలేదు
తెలుగుకన్న తెగువ పెంచు వాక్కు లేదు
అజంతా సోయగాల అమరభాషరా ఇది
యుగాలెన్ని మారినా ఇగురదుఈ జీవనది
నా మాతృభాష తెలుగు - నా ఊపిరి హృదయ లయ తెలుగు

1.ముత్యాల దస్తూరి నాభాషకు ఆభరణం
నుడికారాల కస్తూరి నా భాషకు పరిమళం
పద్యసాహితీ ప్రబంధాను బంధం నాతెలుగు
హృద్యమైన అవధాన  సంధానం నా తెలుగు
పొగడగ చెఱకుగడే కటిక చేదు  నాభాష ముందు
వివరింపగ మీగడే సాటిరాదు నా భాషే పసందు
నా మాతృభాష తెలుగు - నా ఊపిరి హృదయ లయ తెలుగు

2.భువన విజయకొలువులో కవనమై చెలఁగింది
దేశభాషలన్నిటిలో దవనమల్లె  కీర్తిగొంది
పాల్కుర్కిసోమన్న ప్రభవించిన నా తెలుగు
బమ్మెర  పోతన్న ప్రవచించిన నా తెలుగు
జానపదుల గళ గర్జన నా భాష శ్రీకారం
అన్నమయ్య పదకీర్తన నా భాష ఓంకారం
నా మాతృభాష తెలుగు - నా ఊపిరి హృదయ లయ తెలుగు
రచన,స్వరకల్పన&గానం:రాఖీ
రాగం:మాల్కోస్

ఏం రాత రాసాడు నీ పెనిమిటి
నా బ్రతుకంత చేసాడు కడు చీకటి
నాలుగు తలలున్న బహునేర్పరి
నను బలిచేయగ వింతే మరి
పలుకుల పూబోడి నీ దాసుడి
అలజడి మాన్పవే బ్రహ్మక్రొత్తడి

1.ఉండనీయడమ్మా ఉన్నచోట
పండనీయడమ్మా ఏ పూట
దండగైపోయిందీ మనుజ జన్మ
అనుభవించి తీరాలి పూర్వ కర్మ
ఆమాత్రం నువ్వాదరించకుంటెనో
ఆగమై పోయేవాణ్ణి విద్దెలమ్మా

2. ఏ కొఱతాలేదనీ విర్రవీగనా
కొఱతవేసినందుకు నేనేడ్వనా
అడగకున్న ఇచ్చాడని నమ్మికొలువనా
ఉన్నదూడ్చివేసాడని దెప్పిపొడవనా
కన్నతండ్రి కుండకుంటె ఏ కనికరము
ఆ బిడ్డల మనుగడయే నిత్యనరకము

Monday, August 26, 2019

మోముదాచుకున్న ఓ మోహనాంగి
నీ మేని మెరుపు దబ్బనిమ్మపండుభంగి
మబ్బుచాటు చందమామ చూశాడు తొంగితొంగి
గులామయీ సలాముచేసె వంగి వంగి

1.నీ నవ్వులు సంతూరు సంగీతం
నీ పలుకులు కుంతాల జలపాతం
నీ అధరాల ఆస్వాదన అమృతం
నిను పొందితె నా బ్రతుకే సరసగీతం

ముట్టుకుంటె ముడుచుకునే కోమలాంగి
నీ మేని నునుపు లేత తమలపాకు భంగి
తుళ్ళిపడే నిన్నుతాకి  గులాబి రేకు
రాలిపడే తనకుతానే తాళలేక నీ సోకు

2.లోకాన అతి మధురం నీతో ఏకాంతం
గడిచేను క్షణమోలె యుగాలు సాంతం
ప్రత్యక్షమవవే  నాకై సఖీ అమాంతం
అంకితమైపోతానే నాజీవిత పర్యంతం

చిలిపి లిపితొ  చూపువిసురు చిత్రాంగి
నీకంటి భాష అంతుపట్టలేని భంగి
మతిచలించి పోయింది భారతిపతికి
నా మీద ప్రయోగిస్తే నే చేరేద నేగతికి
పోతపోసిన పసిడిబొమ్మా ఓముద్దుగుమ్మా
ఆశరేపకు మర్మమెరుగని వాడనమ్మా నే మోడునమ్మా
పరికిణీ ఓణీలతో ఇనుమడించెను నీ అందం
తెలుగుదనమే ఉట్టిపడగా చూసినంతనె ఆనందం

1. పొడుగాటి జడకు జడకుప్పెలు
తలనిండ తురిమిన సిరి మల్లెమాలలు
నర్తించి మురిసెడి చెవి బుట్టలు
పాదాల ఘలు ఘల్లనెడి పట్టీలు
బ్రహ్మ అచ్చెరువొందు శిల్పమే నీవు
బాపు కుంచెన చిందు చిత్రమే నీవు

2.క్రీగంటి నీ చూపులే మన్మథుడి తూపులు
సిగ్గులొలికెడి నగవులే ముత్యాల జల్లులు
నిదుర హరియించు నీ తలపులు
మధువులే చిలుకును నీ పలుకులు
అందబోకమ్మ నాకెపుడు ఓ చందమామా
ఆరాధించెదను సౌందర్యరాశిగ ఓ దివ్యభామ

శంభో  హరహరా
మనోహర హరా
త్రిపురాసుర సంహరా హరా
త్రిభువనైక ఈశ్వరా భవహరా
కరుణాకరా శంకరా
అంజలింతు నీకిదే శుభకరా

1.మురిపెము తోడ పార్వతమ్మ
నలుగుపిండితో చేసెగ బొమ్మ
ఆయువునొందే ఆ బాలకుడై
అమ్మ ఆనతిన కాచె ద్వారపాలకుడై
ఎరుగక నిన్నే నిరోధించగా
ఆగ్రహమును నువు తలను ద్రుంచగా
ఆలి దుఃఖమును బాపగబూని
కరిశిరమతికి కనికరించితివి గణపతిని

2.దేవగణముల  వినతి మేరకు
కుమారసంభవ శుభ కామనకు
చెఱకు వింటి వేలుపు
వేయగ నీపై సుమాల తూపు
తపోభంగముతొ సోకక నీచూపు
కాముని దహించె నీ కనునిప్పు
పరమేశ్వరా నా అరిషడ్వర్గము తెంపు
దోషము బాపి కలిగించ కనువిప్పు




Saturday, August 24, 2019

పన్నీటి వసంతం ఒక కంటిలో
కన్నీటి జలపాతం మరోకంటిలో
ఎన్నిసంచలనాలు నా ఒంటిలో
నందనవనాలూ స్మశానాలూ నా ఇంటిలో

1.జలతారు ముసుగుల్లో
దాగిఉన్న లొసుగులు ఎన్నో
దరహాస అధరాల వెనుక
మనసున ముసిరిన వెతలెన్నో
నోరు మాట్లాడుతుంది నొసలువెక్కిరించినా
తెగువ పోట్లాడుతుంది విధియే వక్రించినా

2.అన్ని పున్నమి రాత్రుల్లో
కారుమబ్బు కైనీడలెన్నో
గులాబీల రహదారుల్లో
గుచ్చుకునే వాడిముళ్ళెన్నో
వాస్తవాల గొంతునొక్కి మిథ్యరాజ్యమేలుతోంది
జీవించే హక్కుకొరకే బ్రతుకు ఈడ్వ బడుతోంది

రచన,స్వరకల్పన&గానం:రాఖీ

ఐదున్నర అడుగులున్న ఆడపిల్లవే
నీ హంస నడక చూడగానే మనసు గుల్లనే
వంపుసొంపులెన్నొ ఉన్న  కొండవాగువే
నీ మేని హొయలు కనగ నా గుండె ఆగునే
ఊరించి నను చంపకు ఉత్తుత్తిగా
వెర్రోణ్ణి చేయకూ నను బొత్తిగా

1.కారుమేఘాలె నీకు కురులైనవి
తారలెన్నొ నీ జడలో మల్లెలైనవి
మెరుపులెన్నొ నీ మెడలో నగలైనవి
హరివిల్లే నీ పెదవుల నగవైనది
ప్రకృతే పరవశించి నీవశమైనది
పసిడికాంతి నీ ఒంటి తళుకైనది
ఊరించి నను చంపకు ఉత్తుత్తిగా
వెర్రోణ్ణి చేయకూ నను బొత్తిగా

2.వరూధినే నీతో సరితూగనన్నది
దమయంతే నీకు దాసోహమన్నది
ఊర్వశే పోటీకి విరమించుకొన్నది
మేనకే తప్పుకొని నీ వెనకే నన్నది
విశ్వసుందరిగ నీవేకగ్రీవమే
జగన్మోహినిగ నీకగ్రాసనమే
ఊరించి నను చంపకు ఉత్తుత్తిగా
వెర్రోణ్ణి చేయకూ నను బొత్తిగా
రచన,స్వరకల్పన&గానం:రాఖీ
రాగం:మధ్యమావతి

కాలరుద్రుడా వీరభద్రుడా
కన్ను తెరవరా ఇకనైనా
గరళకంఠుడా హే నటేశుడా
తాండవించరా ఇపుడైనా
ఘోరకలికి తెఱదించు
నేరవృత్తినే తెగటార్చు
పునఃసృష్టియే జరుగునట్లుగా
విశ్వ లయమునే గావించు
మానవత్వమును స్థాపించు

1.అత్యాచారము మా గ్రహచారం
అతివకు లేదిట అభయము
విలువలు మరచిన మా సమాజం
విశృంఖలతయే మా నైజం
కాల భైరవా భూతనాయకా
అవధరించరా ఇకనైనా
విరూపాక్షుడా విశ్వనాథుడా
నిదుర లేవరా ఇపుడైనా

2.అవినీతియే  మాకతి సామాన్యం
జనజాగృతియే ఇట కడు శూన్యం
మోసగించడం మా మనస్తత్వం
హింసించడం మా కానందకృత్యం
జ్వాలనేత్రుడా శూలహస్తుడా
ఆగ్రహించరా ఇకనైనా
వైద్య నాథుడా మృత్యుంజయుడా
అనుగ్రహించరా ఇపుడైనా

Friday, August 23, 2019

"కృష్ణాష్టమి" సందర్భంగా

రచన,స్వరకల్పన&గానం:రాఖీ

రాగం:సింహేంద్ర మధ్యమం

కృష్ణం వందే జగద్గురుమ్
గ్రోలవె మనసా గీతాసారం
పరమాత్మ నుడివిన జీవనమార్గం
మానవాళికిలలో అనుసరణీయం

1.చేయగలిగితే వగచేది లేదు
చేతకానిది నీ చేతిలొ లేదు
బాధను కొలవగ కొలమానమే లేదు
చిరునగవు తోడను భరియించు చేదు
నిత్యానందమె నిజమైన వేదం
ఆత్మానందమె అసలు వినోదం

2.నమ్మితె సర్వం కృష్ణార్పణం
నాస్తికతయే ఆత్మవిశ్వాసం
మనిషికి మనుగడ తెగని యుధ్ధం
తలపడగ నీవిక తెగువతొ సిధ్ధం
స్వధర్మ కర్మయే శ్రేయోదాయకం
నిమిత్తమాత్రతయే భవ్య తాత్వికం
రచన,స్వరకల్పన&గానం:రాఖీ
రాగం:రీతి గౌళ

గుడిలో బండగ నువ్వు
గుండె బండబారి నేను
ఉండీ లేక మొండిగా గడిపేస్తున్నాము
ఉద్దండ దైవమా ఉద్ధరించవేమయ్యా
ఏడు కొండల వేలుపు,నీకిదే మేలుకొలుపు
ఇకనైనా స్వామీ నాకు  మేలుజరుపు 

1.మొక్కులకై ఆశపడి నన్ను లెఖ్ఖచేయవేల
ముడుపులపై చిత్తముంచి నన్ను ముంచనేల
దిక్కు నీవనీ స్వామీ నిన్నే నమ్ముకొన్నాను
దక్కనీయి నీపాదాలు నీవే శరణమంటున్నాను
వడ్డికాసులవాడా డబ్బుయావ నీకేల
శ్రీనివాసనీ ఎదలో  మాతల్లి సిరికొలువుండ

2.ఊహతెలిసినప్పుడే బ్రతుకు ముడుపు కట్టాను
ఊపిరిలో ఊపిరిగా నిన్ను మ్రొక్కుతున్నాను
చిక్కులలో నన్నేలా చిక్కుకొనగ చూస్తివి
చక్కనీ నా స్వామీ ఏమి రాత రాస్తివి
ఆపదమొక్కులవాడ నన్నాదుకోవయ్యా
సంసారకూపం నుండి నన్నుచేదుకోవయ్యా

FOR AUDIO ,plz contact my whatsapp no.9849693324

Wednesday, August 21, 2019

రచన,స్వరకల్పన&గానం:రాఖీ
రాగం:దేవగాంధారి

శ్రీ రాజరాజేశ్వరి కరుణామృత ఝరి
జయ జయ శ్రీ రాజ రాజేశ్వరి శాంకరి
తవసేవక భవదుఃఖ హారిణీ శార్వాణి
పాలయమాం కృపాకరి

1.లేంబాల పుర బాలత్రిపుర సుందరి
దర్శనమాత్రేణ జన్మ పావనకరి శ్రీగౌరి
నిఖిలలోక పాలనకరి పరాత్పరి కుమారి
పాలయమాం రిపుక్షయకరి

2.మణిద్వీప స్థిరవాసిని భవాని
స్మరణ మాత్రేణ సాక్షాత్కారిణి శ్రీవాణి
శ్రీచక్ర సంవర్ధిని శ్రీ విద్యా ప్రవర్ధిని
పాలయమాం అన్నపూర్ణేశ్వరి

3.కుండలినీ సంయుతే చండీ చాముండేశ్వరి
మూలాధారాన్వితే శ్రీ లలితే అష్టసిద్ధి వరదే
సహస్రార సంప్రాప్తితే సాయుజ్య దాయికే
పాలయమాం భువనేశ్వరి

Tuesday, August 20, 2019

అల్లసాని వారిని అర్థిస్తా నేర్పమని
కాళిదాస సత్కవినీ వేడెదను చెప్పమని
శ్రీనాథుని గురువుగా ఎంచెద బోధించమనీ
జయదేవుని ప్రార్థిస్తా ప్రణయ రసమునెరిగించమనీ
నా కావ్య నాయకీ నిను వర్ణించ సాహసించెద
నా స్వప్న సుందరీ నిను  ఆవిష్కరించ బూనెద

1.తనువేమొ మదనుని సదనం
వదనమేమొ అహరహ శరదం
నయనమైతె వికసిత కుముదం
నుదుటవెలుగు సింధూరం
తొలిపొద్దుకు ప్రతిరూపం
దోబూచులాడే ముంగురులు
తేలిపోయే  పయోధరాలు
నా కావ్య నాయకీ నిను వర్ణించ సాహసించెద
నా స్వప్న సుందరీ నిను  ఆవిష్కరించ బూనెద

2.అధరమే చుంబన రంగం
చుబుకమే కౌశిక శకలం
కసిని జాగృత పరచి
ఉసిగొలిపే రసనే అమృతం
మిసమిసల కెంపుల్లా
నిగారింపు చెంపల్లో నవనీతం
నా కావ్య నాయకీ నిను వర్ణించ సాహసించెద
నా స్వప్న సుందరీ నిను  ఆవిష్కరించ బూనెద


రచన,స్వరకల్పన&గానం:రాఖీ

అడగకనే వరమిచ్చే దేవత
కళ్ళముందు కదలాడే అప్సరస
అనునిత్యం తోడుండే  నీ నీడ
అర్ధాంగి ధర్మపత్మి గృహిణి ఇల్లాలు
ఏ పేరున పిలిచినా అన్నీ తానైన ఆవిడ
సరదాకైనా అపహాస్యం మానరా మానవుడా

1.ఆచితూచి తాను అడుగేస్తుంది
పతి తొందరపాటును సరిచేస్తుంది
న్యాయవాది పట్టా తనకు లేకున్నా
మన తరఫున వకాల్తా పుచ్చుకొంటుంది
సమాజాన మన స్థాయి ఏదైనా
సగర్వంగ మగని గౌరవిస్తుంది
భార్య కళత్రము  శాలిని మగనాలు
ఏ పేరున పిలిచినా అన్నీ తానైన ఆవిడ
పరాచికానికైనా పలుచన చేయకురా మానవుడా

2.సంపాదన నీదైనా తానే సగబెడుతుంది
ఇంటిపేరు నీదైనా తానే నిలబెడుతుంది
నీ ఆకలి తీర్చేటి కాశీ అన్నపూర్ణ తాను
నీ చింతను  బాపేటి చింతామణి తాను
నిన్నెంతో కట్టడి చేసైనా
నిను చక్కటి దారిలోన పెడుతుంది
పెండ్లాము దేవేరి ఇంతి ప్రాణేశ్వరి
ఏ పేరున పిలిచినా అన్నీ తానైన ఆవిడ
పొరబడికూడ కించపరచబోకురా  మానవుడా

Sunday, August 18, 2019

వినాయకా వినవేరా నా మొరా
నా మనవే మన్నించరా లంబోదరా దొరా
వినుతించెద మనసారా నీ ముందరా వరా
హారతిగొనరా మనోహర హర కుమారా

1.నమ్మితి నాడే కోరిక లీడేర్చెదవని
అడగకముందే అన్నీ అమరించెదవని
ఏల గణపతి జాగేలా నన్నేలగ త్వరగతి
సిద్ధిబుద్ధి విద్యాధిపతి స్వామీ నీ కిదె జాగృతి

2.మృత్తిక ప్రతిమగ నినుకొలిచెదము
ఆర్తితొ ప్రీతితొ ఆరాధించెదము
నవరాత్రులు నిను భజియించెదము
నవరసములలో  ఓలలాడెదము
భూగోళం తూచలేదు
ఆకాశం కొలవలేదు
అనురాగ మూర్తైన అమ్మ ప్రేమని
మహాకవులు రాయలేదు
పరులెవ్వరు  చూపలేదు
అమ్మకే సాధ్యమైన ఆ మమతని
తెగని ప్రేగు ముడి తాను అమ్మా
తరగని చెరగని అనుబంధం అమ్మా
అమ్మా నీకు  మనసారా  వందనమమ్మా॥

1. తన ఆకలి చంపుకొని
మన కడుపును నింపబూని
ఉపవాసాలనే చేకొంది ఆలంబన
కొసరికొసరి తినిపించిన దీవెన
ఏ నలత మనకున్నా
తనకు నిద్దురే సున్నా
ముక్కోటి దేవుళ్ళకు మొక్కుకొని
అనంద పడుతుంది మనం కోలుకొనుటగని
తెగని ప్రేగు ముడి తాను అమ్మా
తరగని చెరగని అను బంధం అమ్మా
అమ్మా నీకు  మనసారా  వందనమమ్మా॥

2.కడుపుతీపి విలువెంతో
అమ్మకే తెలియాలి
గుండెకోత బాధంటే
అమ్మనే అడగాలి
అమ్మకున్న ఏకైక లోకం మనమే
అమ్మకన్న ఏకైక స్వప్నం మనమే
మన సుఖము సంతోషమె
అనునిత్యం తన కోరిక
కనులముందు తిరుగాడితె
అదే తనకు వేడుక
తెగని ప్రేగు ముడి తాను అమ్మా
తరగని చెరగని అను బంధం అమ్మా
అమ్మా నీకు  మనసారా  వందనమమ్మా॥


నందీ భృంగీ నీకు నిత్య సేవకులు
సప్త ఋషులు నమకచమక గాయకులు
భూతగణములు ప్రమధగణములు
ఎంతోమంది వంధిమాగధులు భక్త శిఖామణులు
ఇందరు నీకుండగా నేనెక్కడ ఆనగలను నీకంటికి
పక్షపాతమే లేదందురు పరమశివా లోకాన ముక్కంటికి

1.మార్కండేయుడితో నీ మహిమతెలియవచ్చింది
భక్తశిరియాలుడితో నీ కరుణ మాకు ఎరుకైంది
అతిఘోర నియమాల అఘోరాలు అనుయాయులు
యోగనిష్ఠాగరిష్ట నాగసాధువులే నీకు ప్రియులు
ఇందరు నీకుండగా నేనెక్కడ ఆనగలను నీకంటికి
పక్షపాతమే లేదందురు పరమశివా లోకాన ముక్కంటికి

2.శ్రీకరినాగులు పశుపతీ నీ దయకు పాత్రులు
దానవాగ్రణి రావణుడూ నీపై స్థిర చిత్తుడు
వీర శైవులు జంగమదేవరలు నీవర పుత్రులు
లింగాయతులు జోగినిమాతలు నీకు ఆప్తులు
ఇందరు నీకుండగా నేనెక్కడ ఆనగలను నీకంటికి
పక్షపాతమే లేదందురు పరమశివా లోకాన ముక్కంటికి
అందలమెక్కితే నీ దయ ఉన్నట్టే
కీర్తినిగడియిస్తే నీ కృప ఉన్నట్టే
పదికాలాలూ ప్రశంసలే పొందుతూ
ప్రజలనోట నానేది నీ చలవ వల్లనే
ఇచ్చినట్టె అన్నీ ఇచ్చావు తల్లీ భారతీ
ఇఛ్చ తీర్చకున్నావు అమ్మా సరస్వతీ

1.ఏ లోపము చేసానో నీ పూజలో
ఏ పాపము చేసానో పూర్వజన్మలో
ఎవరిని నొప్పించితినో ఎరుకలేక
అపహాస్యము చేసితినో మిన్నకుండక
మన్నింపవె జననీ నను మన్నన చేసి
వరమీయవె కనికరముతొ కుమరునిగా నన్నెంచి

2.విర్రవీగినానేమో అహంకారమ్ముతో
కన్నుమిన్నుకానలేదొ విద్యాగర్వముతో
మరచినానేమో మాతా నిను సైతం
వ్యాపారం చేసానో పవిత్ర సంగీతం
మన్నింపవె జననీ నను మన్నన చేసి
వరమీయవె కనికరముతొ కుమరునిగా నన్నెంచి



రచన,స్వరకల్పన&గానం:రాఖీ
రాగం:శ్రీరాగం

శుక్రవార శ్రీ లక్ష్మీ-శ్రావణ వరలక్ష్మీ
అనునిత్యము సిరులొసగే-ఐశ్వర్య లక్ష్మీ
ఐదోతనము నిలిపె-సౌభాగ్య లక్ష్మీ
మంగళహారతి గొనవే-మహాలక్ష్మీ
సతతము మము బ్రోవవె-సీతాలక్ష్మీ

1.వెతలను కడతేర్చవె-వేంకట లక్ష్మీ
సంతోషమునీయవే-సంతాన లక్ష్మీ
అక్షయతృతీయ శుభద ఆది లక్ష్మీ
ధనత్రయోదశిన వెలసిన ధనలక్ష్మీ
మంగళహారతి గొనవే-మహాలక్ష్మీ
అనవరతము మము బ్రోవవె-ఆనంద లక్ష్మీ

 2.ధాన్యరాశులందించే ధాన్యలక్ష్మీ
సంకటములనెడబాపే ధైర్యలక్ష్మీ
విద్యాబుద్దులు గఱిపే విద్యా లక్ష్మీ
నిజకీర్తి ప్రసాదించు గజలక్ష్మీ
మంగళహారతి గొనవే-మహాలక్ష్మీ
నిరతము మము బ్రోవవె-విజయలక్ష్మీ
రచన,స్వరకల్పన:రాఖీ

మగధీరుడా రసశూరుడా
మగటిమికే నిజరూపుడా
రిపుతతికే భయకారుడా
కలి మదనుడా రతివరదుడా
నన్నే వరించరా నాతో రమించరా

1.ఆరడుగుల పొడుగున్న అందగాడివి
మెలితిరిగిన కండలున్నా యోధుడివి
నలిగిపోనీ నాదేహమే నీ బిగికౌగిలిలో
కరిగిపోనీ నాయవ్వనమే నీలోగిలిలో
కనిపించని సుడిఏదో ముంచుతున్నది
కవ్వించే నవ్వేమో కసి పెంచుతున్నది

2.అయస్కాంతమేదో లాగుతున్నది
నాగస్వరమేదో మ్రోగుతున్నది
గుప్పిటి మర్మాలే విచ్చుకున్నవి
ఎద అగ్ని పర్వతాలు ప్రేలుతున్నవి
చేరుకోనీ ఎవ్వరైన కలగనని లోకాల్ని
అనుభవించనీ నన్ను చిత్తయ్యే కొత్తదనాన్ని
రచన,స్వరకల్పన&గానం:రాఖీ

మధువే ఎందుకు వెతలను మరిచేటందుకు
మత్తే ఎందుకు గాలిలోన తేలేటందుకు
విధిశాపగ్రస్తుల్లారా దైవోపహతులైనారా
భగ్నప్రేమికుల్లారా దగాపడి బ్రతికేస్తున్నారా
నా పాటవింటే కలుగునెంతొ ఊరట
నా గాధ నెరిగారంటే మీకంట ఇంకదు ఊట

1.అందరూ ఉన్నాగాని అనాధనే నేను
ఏలోటు లేకున్నా వింతబాధనే నేను
ముప్పొద్దుల తిన్నాగాని తీరిపోదు ఆకలి
బస్తాలా ఉన్నాగాని నీరసంతొ నే బలి
యోగా చేయమనసున్నా ఆ యోగమే శూన్యం
ఉదయాన నడకైనా నడవలేని దైన్యం

2.అంతుబట్టలేని మనోవ్యాధి నాది
వైద్యమన్నదే లేని విచిత్రమైనదే అది
గుండె ఎప్పుడో చెలితో ఛిద్రమైనది
బండబారిపోయింది హృదయమన్నది
ఆత్మతృప్తి నోచనిదే ఎన్నున్నా వ్యర్థమే
మనశ్శాంతి పొందితే మనిషి జన్మ సార్థకమే
రచన,స్వరకల్పన&గానం:రాఖీ

నీ గుండె గూటిలో గువ్వనౌతా
నీ లేత పాదాన మువ్వనౌతా
నీ మందార అధరాన నవ్వునౌతా
అరవింద నయనాల ఆహ్వానమౌతా,ఆహ్లాదమౌతా
నిన్ను నాలో నిలుపుకుంటా
నేను నీలో ఐక్యమౌతా

1.నీ పాటకే నే పల్లవినౌతా
నీ బాటకే నే పూదోటనౌతా
నీ మాటలో నే మకరందమౌతా
నీ  బుగ్గకు సొంపైన సొట్టనౌతా,చెవికి పసిడి బుట్టనౌతా
నిన్ను నాలో నిలుపుకుంటా
నేను నీలో ఐక్యమౌతా

2.నీ శ్వాసలో నే శ్వాసనౌతా
నీమనసున అనుభూతినౌతా
చేరదీస్తె నూరేళ్ళ తోడునౌతా
మరచిపోలేని మధుర స్మృతినౌతా,నీకృతినౌతా
నిన్ను నాలో నిలుపుకుంటా
నేను నీలో ఐక్యమౌతా
రచన,స్వరకల్పన&గానం:రాఖీ

అందానికే నిలువెత్తు రూపం నువ్వు
ఆనందం పరిమళించె సుందరమౌ నీనవ్వు
నిన్ను చూసి ఈర్ష్య పడే సృష్టిలోని ప్రతి పువ్వు
నాకెలా దక్కేనో ఈజన్మకు నీ లవ్వు

1.తొలిచూపులోనే ఎద తొలిచేసావు
మునిమాపులోనే ఊహను బలిచేసావు
ఊరిస్తూ ఉడికిస్తూ నను నలిపేసావు
నూటొక్కమందిలో నన్నూ కలిపేసావు
నా ఆరాధన గుర్తించకున్నావు
నాకెలా దక్కేనో ఈజన్మకు నీ ప్రణయము

2.ఉబుసుపోక ప్రేమించలేదు నిన్ను
నవ్వులాటగా ఎంచబోకెపుడు నన్ను
నా మనసు నా బ్రతుకు నీకే అంకితము
వేచిఉంటా చెలియా నీకై జీవితాంతము
నా కెలా దక్కేనో ఈజన్మకు నీ అనురాగము
గులాబికెంతగానొ గుబులు
నీయంత సుకుమారి తాను కాననీ
కమలానికెంతగానొ కుళ్ళు
నీవదనమంత సుందరంగ తాను లేనని
ప్రకృతిలో ఏ పూవూ కాయలేదు
నీ అందంతో పందెం
చూస్తూండి పోతాను జీవితాంతం
రెప్పైనా వేయకుండ నీ సౌందర్యం

1.పోటీపడతాయి నీ పలువరుసతొ పోలిక కోసం
దానిమ్మ గింజలు ఆణి ముత్యాలు
ఆతృత పడతాయి నీ పెదాలతో సరితూగేందుకు
దొండపండ్లూ మందారపూలు
అమావాస్యనాడైనా వెన్నెల కురిపించేను
నీ చిరునవ్వులు
ఏ మోడునైనా చిగురులు వేయించేను
నీచూపులజల్లులు

2.నీలాల నీకురులకు సామ్యతకానేరవు
ఘన నీలి మేఘాలు తుమ్మెద వర్ణాలు
నీప్రశాంత తత్వానికి ఉపమానము కాబోవు
శ్వేతకపోతాలు హిమపర్వతాలు
పలుకుల ప్రవాహాల సుధపారును  నీ సన్నిధిలో
ఎడారులే వనాలై కడతేరును నీ సావాసములో


Wednesday, August 14, 2019


రచన,స్వరకల్పన&గానం:రాఖీ
రాగం:సరస్వతి

నా కలమున కొలువు దీరు - కలహంస వాహినీ
నా గళమున సుధలు చిలుకు- కళ్యాణీ శ్రీవాణీ
అనవరతము నినుకొలిచెద- కలలను నెరవేర్చవే
అక్షరముగ నా బ్రతుకును-కడతేర్చవే, నీదరి జేర్చవే

1.నా ప్రాణదీపమే నీరూపము
నాలో చైతన్యమెనీ అస్తిత్వము
నా ఊపిరి నీవీణా మృదునాదము
నా ఎదనినాదమే నీ స్మరణము
సప్తస్వర వరదాయిని సామగాన వినోదిని
సాష్టాంగవందనాలు సారస్వతపుర రాణీ.గీర్వాణీ

2.నా కవనము నీభావన
పదపదము నీకే నివేదన
ప్రతిగీతము నిను నుతించు కీర్తన
నా కావ్యమల్ల నీకే సమర్పణ
విద్యా విశారదా వినతులందుకో
మాతా సరస్వతి ప్రణతులందుకో


వెదకబోయిన తీగవీవే
ఎదను కదిలించిన  అనురాగ మీవే
విగతజీవికి బ్రతుకు నిచ్చే సుధవు నీవే
మోడువారిన జీవితానికి తొలకరివి నీవే,రసఝరివి నీవే

1.నా ఎడారి దారుల సరోవరానివే
నా శార్వర యామినిలో నిగారానివే
నా చింతను తీర్చెడి చింతామణివే
నా మనాది మాన్పెడి ఔషధానివే
నన్ను అలరించెడి అలివేణివే,పూబోణివే

2.నా తలపుల వెలిసేటి ఇంద్ర ధనుసువే
నా ఊహల వెలిగించే తొలి రుచస్సువే
నా స్వప్నలోకాల సౌందర్య దేవతవే
ఆనంద తీరం చేర్చే దిక్సూచి నీవే
నన్ను మురిపించెడి నవమోహినివే,ప్రియరాగిణివే
లఘు రూప కవిత
చెప్పగలిగితేనె ఘనత
సాంధ్రీకృత భావుకత
గుండె గుండెతో జత

1.పరిమాణం పిడికెడంత
అనుభూతులు విశ్వమంత
హృదయమే ఒకవింత
లఘురూప కవితకు
ఎదయే ప్రామాణికత

2.అర్థము అంతరార్థము
కదిలించెడి పరమార్థము
లఘుకవితకు మూలము
సూక్ష్మంలో మోక్షము
లఘుకవితా లక్ష్యము

3.ఏ పేరుతొ పిలిచినా
పద నిర్మితి ఏదైనా
పదిమించని పంక్తులు
మితిమీరని జటిలతలు
రసగుళికలు లఘుకవితలు

Monday, August 12, 2019

ఆకాశం నివ్వెరపోయింది-మన బంధం చూసి
భూలోకం విస్తుపోయింది-మన ప్రేమను చూసి
నింగిలోని చుక్కలన్ని బెంగపెట్టుకున్నాయి
చందమామ ఇంత ప్రేమ అందజేయలేదని
తోటలోని పువ్వులన్ని చిన్నబుచ్చుకున్నాయి
తేనెటీగ ఇంత ప్రేమ పంచనే పంచలేదని

1.చిలకా గోరింకలు సంభ్రమపడిపోయాయి
కనీవిని ఎన్నడెరుగని మన అనురాగం చూసి
కపోతాల జంట సైతం కన్నుకుట్టుకున్నది
నభూతోన భవిష్యతౌ మన అనుబంధం చూసి

2.రతీ మన్మథుల మతి పోయింది
అన్యోన్యం  తగు అర్థం మనలో చూసి
రాధాకృష్ణుల తృష్ణ పెరిగింది
పెనవేసుకున్న ప్రణయాభావం మనలోనేగని

3.సిరిహరి ఎరుగరు ప్రేమ తత్వమై
తమేవాహమై మనమున్నామని
హరుడు గౌరి గ్రహించలేరు అద్వైతత్వమె
పరమ తత్వముగ మనుతున్నామని

Sunday, August 11, 2019

రచన,స్వరకల్పన&గానం:రాఖీ

మూడు ప్రాంతాలలో కడువింతగా
వెలిసావు స్వామి శయన మూర్తిగా
శ్రీరంగ పట్టణాన ఆదిరంగస్వామిగా
తిరువనంతపురాన అనంత పద్మనాభునిగా
శ్రీరంగం పురమున రంగనాథ స్వామిగా
ఏకాదశి వ్రతమును నీమముతో పాటించగా
భక్తులనుద్ధరించి భవజలధిని దాటించగా

1.శ్రీ వైష్ణవ సాంప్రదాయమునకాలవాలమై
విశిష్టాద్వైత సిద్ధాంతమునకు మూలమై
వైజయంతిమాలతో అలంకారశోభితమై
తిరునామాలతో చిద్విలాస వదనుడవై
కొలువైనావు రంగశాయి సిరి పాదములొత్తగా
సేదదీరుతున్నావు స్వామీ కాసింత మత్తుగా

2.మార్గళివ్రతమునాచరించె గోదాదేవి
తిరుప్పావైని రచించె పాశురాల పద్ధతిని
మును ముందుగ తులసిమాల తానే ధరించి
పెరుమాళ్ళస్వామినీకు  సమర్పించె ఆండాళ్ళు
చేకొంటివి పత్నిగా ఆముక్త మాల్యదని
ధనుర్మాసమందున మా కనులవిందుగా
ఇల్లరికపుటల్లుళ్ళ వైభోగము
వింత ఏముంటుంది మామ ఇంట మకాము
ఒకరేమో జగన్నాథుడు మరొకరేమో విశ్వనాథుడు
ఒకరేమో శ్రీనివాసుడు మరొకరోమో అర్ధనారీశ్వడు

1.జలధిజ విభుడు జన్మరాహిత్య వరదుడు
కరుణాసాగరుడు సాగర శయనుడు
లోకపాలకుడు అలౌకికానందకారకుడు
అమందానంద కందళిత హృదయారవిందుడు గోవిందుడు

గిరిజావల్లభుడు కైవల్యదాయకుడు
పరమదయా హృదయుడు హిమవన్నగ వాసుడు
సకలలోకేశ్వరుడు సచ్చిదానందయోగిపుంగవుడు
నిత్యనిరంజన నిర్వికల్ప సంకల్పుడు శివశంకరుడు
జనార్ధనుడొకరు జంగమ దేవర ఒకరు
రమేశ్వరుడొకరు పరమేశ్వరుడొకరు

2.కపటనాటక సూత్రధారి గిరిధారి మురారి
దశావతారధారి  దనుజారి శ్రీ హరి
కరి ప్రాణ సంరక్షక  చక్రధారి గరుడవాహన శౌరి
భక్తమానస విహారీ భవ రోగ హారీ

కాలకాలుడు నీలకంఠుడు నేత్రత్రయుడు నర్తన ప్రియుడు
జంగమవేషధారి వృషభవాహన సంచారి పురహరి
మార్కండేయ ఆయుఃప్రసాది త్రిశూలధారీ
 భోలానాథ మదనారి త్రిగుణాతీత జటధారీ
నాగ తల్పుడొకరు నాగభూషణుడొకరు
పీతాంబరుడొకరు చర్మాంబరుడొకరు



Saturday, August 10, 2019

వాత్సాయనుడే వెలిసిన దేశం
కామసూత్ర వెలయించిన దేశం
ఖజురహో శిల్పాలకు నెలవైన దేశం
అజంతా చిత్రాలకు ఆలవాలమైన దేశం
ఎక్కడలేని బిడియం
పలికితేనె నేరంలా ఎందుకంత అయోమయం
శృంగారమంటేనే సృష్టికార్యం
ప్రణయం అంటేనే పవిత్ర భావం

1.నవరసాల్లొ ప్రప్రథమం
మానవ సృజనకు అంకురార్పణం
జీవజాలమంతటిలో అతిసహజం
ఎందుకంత ఉలికిపాటో సంగమమన్న పదం
శృంగారమంటేనే సృష్టికార్యం
ప్రణయం అంటేనే పవిత్ర భావం

2.ఆహార నిద్రా భయ మైథునాలు
ప్రాణులలో జన్మతః నైజాలు
పశుప్రవృత్తి అభ్యంతరమే
సరస సంయోగం ఆమోదయోగ్యమే
శృంగారమంటేనే సృష్టికార్యం
ప్రణయం అంటేనే పవిత్ర భావం

3.కాళిదాసు కావ్యాల్లో వర్ణించిన దేమిటి
శ్రీనాథుని ఘంటంలో కవనమైంది ఏమిటి
జయదేవుని అష్టపదుల్లో అర్థమేమిటి
అన్నమయ్య కృతుల్లో రమ్యత ఏమిటి
విచ్చలవిడి ఐతేనే వికృతమేదైనా
ధర్మ నిరతి రతికార్యం ఆచరణీయమే
త్రివర్ణ పతాక మెగిరింది
నీలి నింగిలో మెరిసింది
భారతీయతను జగతికి చాటగ
స్వేఛ్ఛగ రెపరెపలాడింది
వందే మాతరం వందేమాతరం

కృష్ణార్జునులే రథిసారథులుగ
భగవద్గీతను బోధించింది
సకల మతములకు సమత్వమిచ్చి
లౌకిక బాటన నడిచింది
స్వతంత్ర యోధుల బలిదానాలకి
ప్రతీకగా వెలుగొందింది
వందే మాతరం వందేమాతరం

రైతును రాజుగ మార్చే వరకు
కంకణబద్ధురాలయ్యింది
బడుగుల బ్రతుకులు బాగు పర్చగా
చిత్తశుద్ధితో మెలిగింది
ప్రజాక్షేమమే పరమార్థమ్మని
త్రికరణముల నెరనమ్మింది
వందే మాతరం వందేమాతరం

దేశదేశములకాదర్శముగా
విదేశాంగమే నెరపింది
దురాక్రమణల ఇరుగుపొరుగుల
గుణపాఠాలే నేర్పింది
జనగణమన అధినాయక గీతం
లోకమంతటికి మేల్కొపైంది
వందే మాతరం వందేమాతరం


Friday, August 9, 2019

కైలాసం వదలి రావొ శివయ్యా
సకుటుంబ సమేతంగ కదలిరావొ సదయ్యా
నా ఎదలో పదిలంగా కొలువుదీరవయ్యా
నా బ్రతుకును సారథివై నడిపించవయ్యా

1.గణనాథుడు దరినుండగ సంకటములు కలుగవు
గుహనాథుడు దయచూడగ ఏ భయములు చెలగవు
భాగీరథి కృపగనగ కరువులు నను చేరవు
పార్వతీమాత వల్ల దుష్కర్మలు గెలువవు
శంకరా ఇకనైనా నా వంక రా
నువుతోడుగా ఉంటే నాకింక ఏ వంక రా

2.గరళకంఠ నాలోని కల్మషాలు హరించరా
చంద్రచూడ నా చిత్తమునెప్పుడు స్థిరపరచరా
భస్మభూష నా మనసుకు శాంతిని చేకూర్చరా
రుద్రనేత్ర నాలోని అహమును దహియించరా
శంకరా నీ ఎడ లేదు నాకు ఏ శంక రా
వెంటనే నా వెంటనే ఉండవయ్య భక్త వశంకరా
నీ కోవెలలో వెలిగిస్తా నూనె దీపం
నా తలలో వెలిగించు జ్ఞానదీపం
నీగుడిలో వెలిగిస్తా నేతి దీపం
నా గుండెలొ వెలిగించు నీతి దీపం-నిజాయితి దీపం
తిరుమలవాసా ఎంచకు లోపం
తిరువేంకటేశా పరిమార్చర పాపం

1.పూమాల నీమెడలో వేసెద
కామాదులు కడతేర్చగ వేడెద
నామాలు నుదుటన దిద్దెద
ప్రేమానురాగాల నర్థించెద నర్తించెద
తిరుమలవాసా నీరూపం అపురూపం
తిరువేంకటేశా తీర్చర పరితాపం

2.నీ ఆకృతి తన్మయముగ వీక్షించెద
సంస్కృతీ ధర్మాలు సంరక్షించెద
నీమీద కృతులనే రచించెద
నీ గుణగానాల నాలపించెద నీకై తపించెద
తిరుమలవాసా నువు వర్ణనాతీతం
తిరువేంకటేశా నువు కరుణా జలపాతం


నా ప్రేమ కథలో నువ్వే మహరాణి
కాలక్షేపానికి నీకు నేనో పిచ్చివాణ్ణి
నా స్వప్నలోకంలో నీవేగా  దేవేరి
నీ వినోదానికై నే తోలుబొమ్మగ మారి
ఇదేనా ప్రేమంటే ...బ్రతుకు బుగ్గిచేసే మంటే..

1.వగలనొలక బోస్తావు
వలపు వలలు వేస్తావు
అందమైన దీపిక నీవు
నను శలభంగా మార్చావు
పరువాల సాలెగూటిలో
నను కీటకంగ చేర్చావు
ఇదేనా ప్రేమంటే ..మనుగడ ఇక కుంటే

2.నీ చూపులు తూపులు
ఎదలోన దించుతావు
నీ నవ్వులు సిరిమల్లెలు
మత్తులోన ముంచుతావు
నీ ప్రణయమే  మరీచిక
నీ స్నేహం మాయా పాచిక
ఇంతేనా ప్రేమంటే..జీవితమిక వేదన వెంటే
రచన,స్వరకల్పన&గానం:రాఖీ

ఎంతగా దృష్టి మరల్చుకున్నా
మరెంతగా నిగ్రహించుకొన్నా
వింత ఎక్కడున్నదో తెలియదుగాని
కవ్వింతవల్లనేకాబోలు ఎరుగముగాని
తరుణీ నీ అందానికి పురుషోత్తములైతేమి పాదాక్రాంతం
సుదతీ నీ సొగసుకు మునివర్యులు సైతం దాసోహం

1.అనిత్యమే బాహ్యసౌందర్యమన్నది సత్యమే
వయసు మీరితే వడలివక్కుతుందన్నది వాస్తవమే
వేదాంత వేత్తలైన వనిత ఎడల చపలచిత్తులు
సర్వసంగపరిత్యాగులైనా కాలేరు కాంతపట్ల నిమిత్తమాత్రులు
తరుణీ నీ అందానికి పురుషోత్తములైతేమి పాదాక్రాంతం
సుదతీ నీ సొగసుకు మునివర్యులు సైతం దాసోహం

2.రాజాధిరాజులు దేశాధినేతలు రమణులకిల గులాములు
యోధానుయోధులు మేధావులంతా పడతిముందు పిల్లులు
నీపరిష్వంగ ఖైదైనా సంతసమే నిత్యయవ్వనులకు
నీ పొందుకు ఉబలాటమె లోలోన గోముఖ వ్యాఘ్రాలకు
తరుణీ నీ అందానికి పురుషోత్తములైతేమి పాదాక్రాంతం
సుదతీ నీ సొగసుకు మునివర్యులు సైతం దాసోహం

Thursday, August 8, 2019

రచన,స్వరకల్పన&గానం:రాఖీ
రాగం:భీంపలాస్

శ్రావణ మాసమే అతి పవిత్రము
అత్యంత శ్రేష్టమైంది వరలక్ష్మీ వ్రతము
ఐదోతనమును తల్లి ఆదుకొంటుంది
పసుపు కుంకుమలను కాచి రక్షిస్తుంది
మంగళ హారతి నీకు మాతా వరలక్ష్మీ
నీరాజనమిదె గొనవే నీరజాక్షీ

1.సౌభాగ్యము నొసగేను కల్పవల్లి
సిరిసంపదలిచ్చేను కనకవల్లి
అష్టైశ్వర్యములందజేయు అనురాగవల్లి
ఇహపర సౌఖ్యదాయి ఆనందవల్లి
మంగళ హారతి నీకు మాతా వరలక్ష్మీ
నీరాజనమిదె గొనవే నీరజాక్షీ

2.నిష్ఠతొ పూజించిన కష్టములెడబాపుతుంది
భక్తిమీర నోమునోస్తె సంతతిని సాకుతుంది
భోజన తాంబూలమిస్తే ఇల్లు స్వర్గ మౌతుంది
ముత్తైదువులకు వాయనమిస్తె  ముచ్చట తీర్చుతుంది
మంగళ హారతి నీకు మాతా వరలక్ష్మీ
నీరాజనమిదె గొనవే నీరజాక్షీ

మొగ్గను నేను తల ఒగ్గను నేను
సిగ్గును నేను పదారువన్నె ముగ్ధను నేను
పరువాల వాకిలిలో  ముత్యాల ముగ్గును నేను
బిడియాల పొదలలో ఒదిగిన మొగిలి రేకును నేను
అద్దాన్ని పదేపదే ముద్దాడే అన్నుల మిన్ననూ

1.నవ్వుల పువ్వుల ప్రేమించే సీతాకోక చిలుకను
నెలరాజును కనగనే మురిసే చకోరి నేను
మబ్బుల అలికిడికే ఆడే మయూరి నేను
తొలిచినుకుకు తపియించే చాతకమే నేను
సుందరమౌ ప్రకృతిలో నింగికి సింగిడి నేను

2.బెదురుతు  అదురుతు ఉరికే కుందేలును
రెక్కలు సాచి స్వేఛ్ఛగ ఎగిరే గువ్వను నేను
చెంగున దుముకే చంచల హరిణేనేను
మానస సరోవరాన కలహంసను నేను
సరికొత్త అందాలు సంతరించుకొన్నదానను


Wednesday, August 7, 2019

భారతీయ మహిళకు నీవే  నిండైన రూపం
సాంప్రదాయ వనితకు నీవే  ప్రతిరూపం
సుష్మాస్వరాజ్ లేక పార్లమెంటు పరితాపం
ప్రజల గుండెల్లో నీవు ఎపుడూ వెలిగే దీపం

1.వాగ్ధాటి గలిగిన న్యాయవాదిగా
విజ్ఞత చూపించెడి రాజకీయవేత్తగా
ఉత్తమ పార్లమెంటేరియన్ గా
మంత్రాంగం నెరపిన కేంద్రమంత్రిగా
ప్రఖ్యాతి నందింతివి సుష్మాస్వరాజ్
జోహార్ జోహార్ నీకిదే సుష్మాస్వరాజ్

2.తెగువకు మారు పేరైన మగువగా
మంచికి మానవతకు తగిన నెలవుగా
తెలంగాణ జనులకు చిన్నమ్మగా
బారతీయ జనతా పార్టీ మణిపూసగా
ప్రఖ్యాతి నందింతివి సుష్మాస్వరాజ్
శ్రద్ధాంజలి నీకిదేనమ్మ సుష్మాస్వరాజ్



నా మనసే కాశ్మీరు షాలువ బాబా
నిన్నంటిపెట్టుకుంటేనే దానికి విలువ
నా తలపే సాయి  నీకు తలపాగా
నీ శిరసు చుట్టుకోవాలి నా జన్మ సార్థకమవగా

1. నా బ్రతుకే  చిరుగుల కఫ్నీ బాబా
నువు ధరించి ఉద్ధరించు ఇకనైనా
నా జీవితమే  భిక్షాపాత్ర సాయీ
అవధరించి స్వీకరించు ఇపుడైనా
నా ఆశలజోలె నీకు అంకితమోయీ
నీ భుజమున నన్నికపై మోయవోయి


2.నా అహమే కొబ్బరి కాయ బాబా
బ్రద్దలవని నీ ముందు యోగిరాజా
నా అరిషడ్వర్గములే సమిధలు సాయీ
భస్మమవగ ధునిలోన కాలనీయీ
పంచేద్రియాలను కట్టడిచేయవోయీ
అవి పంచహారతులై నీకడ వెలుగనీయీ



తెల్లారి పోయింది తెలంగాణ భవితవ్యం
చల్లారిపోయింది ఎగసి పడిన ఉద్యమం
అమ్ముడై పోయినారు అతిరథులెందరో
కొమ్ముకాస్తున్నారు ప్రత్యర్థుల కెందరో
ఎలా సంభవిస్తుంది నా తెలంగాణ
ఎప్పుడు నినదిస్తుందీ రతనాల వీణ

1. తాతలు తాగిన నేతుల సంగతి
నెమరు వేయుటెనా మన సంస్కృతి
బలిదానంచేసిన నేతల సంస్మృతి
వల్లించడమేనా తెలంగాణ ప్రకృతి
బీరాలు పలికినారు ఆరంభ శూరుల్లా
బీరువులై పోయినారు చచ్చు పిరికి పందల్లా
ఎలా సంభవిస్తుంది నా తెలంగాణ
ఎప్పుడు నినదిస్తుందీ రతనాల వీణ

2. చదరంగపు పావులుగా విద్యార్థులు బలైనారు
వైకుంఠపాళి కేళి విషనాగుల చిక్కినారు
ఎలాపోల్చుదామన్నా తక్కువౌను ఉపమానం
రాజకీయాల్లొ లేవు సిగ్గు లజ్జ అభిమానం
తోకముడిచినారు ఏజాతికి చెందనోళ్లై
సొల్లుకార్చుకొన్నారు ఏ నీతికి అందనోళ్లై
ఎలా సంభవిస్తుంది నా తెలంగాణ
ఎప్పుడు నినదిస్తుందీ రతనాల వీణ
కడుపుచించుకొని కన్నది-తెలంగాణ తల్లి
అందుకు చేయాలి -వందనాలు మోకరిల్లి
అమ్మచెఱను వదిలించే –దాకసాగాలి లొల్లి
రక్కైనా చంపుతుంది-ఎదురుతిరిగితే పిల్లి

1. ఉండటానికై గుండెలొ చోటిచ్చింది
బ్రతకడానికై నీకై -బ్రతుకు ధారపోసింది
తార్చకండి తమ్ములార అమ్మను కలనైన
తెగటార్చకండి నేతలార-విలువలనికనైనా

2. సిగ్గుచేటు మనకు మనమె సిగపట్లు పట్టుకుంటె
పండగే సీమాంధ్రకు మనలొ మనం కొట్టుకుంటె
తుమ్మితె ఊడే ముక్కులు మీకిచ్చిన పదవులు
నమ్మితె ప్రాణాలిస్తరు తెలంగాణ ప్రజలు

3. ఉద్యమాన్ని నీరుగార్చె కుట్రలు గమనించండి
తెలంగాణ ప్రజల మధ్య చిచ్చును రగిలించకండి
బెదిరింపులకెప్పుడూ జడిసి తోకముడవకండి
మీకుమీరె వెలకట్టి అమ్ముడై పోకండి

4. శ్రీకృష్ణ సందేశం తెలంగాణ ఇప్పించదు
సీమాంధ్ర మనకెప్పుడు వేర్పాటు తెప్పించదు
కలగన్న రోజొక్కటి మనముందుకు వస్తుంది
నాల్గుకోట్ల గుండెలసడి తెలంగాణ తెస్తుంది
మన నాల్గుకోట్ల గుండెలసడి తెలంగాణ తెస్తుంది

గీతోపదేశం-శ్రీకృష్ణ సందేశం
పోరునాప మనలేదు-వెన్నుచూప మనలేదు
సాగించు వీరుడా కడదాకా రణం
తెలంగాణ సాధన-దా-కా-రణం
జై తెలంగాణ! జైజై తెలంగాణా!!

1. తన పర ఎవరనేది ఎంచకు
యుద్ధంలో అడ్డొస్తే మన్నించకు
యాచించుటకిది కాదు ఒకరు వేయు భిక్షం
ప్రాణాలు ఫణం పెట్టి సాధించు నీ లక్ష్యం

2. మన పరిధిలొ ఉండదు ఏ ఫలితం
నిర్వహించు అనుక్షణం నీ కర్తవ్యం
పూరించు బిగబట్టి సమర శంఖం
ప్రత్యర్థుల గుండెల్లో సడలాలి బింకం

3. కుట్రలు కుతంత్రాలు సాధారణం
మాయోపాయాల వ్యూహాలే కదా రణం
యోధుడికిల ఎప్పుడూ ఉండబోదు మరణం
కోట్లమంది త్యాగమే మనకిక శరణం
తెలంగాణ రాష్ట్రమే విజయ తార్కాణం
మా నెత్తుటి చుక్కలనే విత్తనాలు పాతండి
మొలకెత్తే తెలంగాణ చెట్టు పళ్ల కెగబడండి
రాజకీయ పక్షాల నేతలారా
నరమాంస భక్షకుల దూతలారా
మా శవాలపై పేలాలేరుకొని తినగరండి
మీ పదవీ లాలసలో మనుషులనీ మరచిపొండి

1. పదవీ అధికారం ఇచ్చింది ఈ ప్రజలేగా
ఓటేసి ఎన్నుకుంది తెలంగాణ జనమేగా
ప్రజాభీష్టమే మీరు కాలరాస్తే
తాత్కాలిక హంగులకై ప్రాకులాడితే
ఇచ్చిన అధికారం తిరిగి తీసుకోనుగలరు
ఎక్కించిన మీ గద్దెను ఎలాగైన దించగలరు
కళ్ళిక తెఱవండి కపట నాయకులారా
రాజీనామా చేయండి చపల చిత్తులారా

2. రంగుల జండాలిక పక్కన బెట్టండి
తెలంగాణ సాధనకై తెగువ చూపి కదలండి
విద్యార్థుల పోరుబాట విధిగా ఇక సాగండి
ఉద్యమాన యువతతో చేయిచేయి కలపండి
తెలంగాణ గడ్డమీద నిజంగా పుట్టారా
అమ్మానాన్నలకైన తలకొరివి పెట్టేరా
కళ్ళిక తెఱవండి కపట నాయకులారా
రాజీనామా చేయండి చపల చిత్తులారా
కోట్లమంది కోర్కె తెలంగాణయని తెలుసుకో
పాతిపెడ్తె విప్లవాలు మొలుస్తాయి కాచుకో
తుఫాను ముందుశాంతిదని వెంటనే గ్రహించుకో
రాకూడని యుద్ధానికి రాయబారమిది యనుకో
జై తెలంగాణ!జైజై తెలంగాణా

1. కోట్లమంది ప్రాణాల బేరానికి సరే సరే
హైద్రాబాద్ వదలకుంటె ఎంతకైన తయారే
భాగ్యనగరు లేకుండా తెలంగాణ శవతుల్యం
కోరుకోండి కేంద్రాన్ని అందుకై తగు మూల్యం

2. వక్రభాష్యాలు చెబితె వినుటకెవరు లేరిక్కడ
దొంగలెక్క చిట్టాలు విప్పుటయే తగదిక్కడ
గతంలోని ఆంధ్ర రాష్ట్ర హద్దులకే సిద్ధపడి
అనుబంధం మిగలనీండి అందుకైన తృప్తిపడి
కుక్కతోక పట్టుకొని గోదారి దాటలేము
పిఱికిపంద నావికులతొ తీరాన్ని చేరలేము
స్వార్థపూరిత నేతలతో తెలంగణ తేలేము
నమ్మి వెంట నడిచామా శవాలై తేలేము
కళ్ళుతెరువు తమ్ముడా కుళ్ళుజోలి కెళ్లబోకు
బ్రతుకు తెఱువు లేదేమని కుళ్లికుళ్ళి ఏడ్వబోకు
తెలంగాణ రాదేమని నిన్ను నువ్వు చంపుకోకు

1.చిత్తశుద్ది అంటేనే అర్థమే తెలియదు
ఆడినమాటకు కట్టుబడుట తెలియదు
తీయనైన మాటలతో పబ్బాన్ని గడుపుతారు
అవకాశవాదంతో అందలమెక్కుతారు- మనసొమ్ము మెక్కుతారు
ఎఱిగిమెలుగు తమ్ముడా-ఎదురు నీకు లేదురా
దుష్టశక్తులెదురైనా- నీవు బెదర బోకురా

2.ఏ ఎండ కా గొడుగు- పట్టుటలో నేర్పరులు
రెండేసి పడవల్లో- కాళ్ళుంచు సమర్థులు
మాటమార్చు విద్యలో-వీరికెవరు సాటిరారు
వెన్నుపోటు పొడుచుటలో వీరికెవరు దీటురారు
తెగువ చూపు తమ్ముడా-తెలంగాణ నీదిరా
ప్రజలె నీకు తోడురా-భవితలోకి సాగరా
జై తెలంగాణా! జైజై తెలంగాణా!!
వధ్యశిలలపై వంచినాము తలలు- ఉరికొయ్యలకే తగిలించినాము మెడలు
కాలిబూడిదవుటకేన మా ఒడలు- ఎప్పటికిక కరుగుతాయి మీ యెదలు
అడ్డుతగలకండి సైంధవులారా!- అంతతనం చేయకండి ఆంధ్రులారా! సీమాంధ్రులారా!!

1.దేవుడు వరమిచ్చినా పెంచుతారు అంతరాలు- దేవత కరుణించినా కల్పించుతా రవాంతరాలు
నోటుముందటి మాకూటిని ఎత్తగొట్టుతారు- ఇంకాఏమ్మిగిలిందని ఇల్లు కొల్లగొట్టుతారు
దారి వదలిపెట్టండి దాయాదులారా- తలకొరివిగ మారకండి ఆంధ్రసోదరులార

2.కన్నతల్లుల కడుపుకోత కార్చిచ్చై కాల్చుతుంది- దీనార్తుల గుండె కోత తరతరాలు కూల్చుతుంది
తెలంగాణ యువతరక్తం ఉప్పెనై ముంచెత్తుతుంది- విద్యార్థుల ఆక్రోశం ఉరుమై మిన్నంటుతుంది
తెలంగాణ తథ్యమన్నది సత్యమే అయితే- తాత్సారం చేయ తగదు న్యాయమే ఇది అయితే

3.ఎంతమంది కావాలో తెలంగాణాకోరి బలి- ఎప్పటికిక తీరుతుందో (సోనియా ఆకలి) ఆగని ఈ ఘోరకలి
నరమేధం సాగుతోంది నాన్చే ధోరణిలో- అసంఖ్యాక శిరఛ్ఛేద చింతామణిలో
ప్ర్రాణాలతో బేరమాడినా ఫరవాలేదు- నాల్గుకోట్ల తెలంగాణ వెఱవబోదు

4.శ్రీకాంతులెంత మంది తగుల బడి పోవాలో- వేణుసువర్ణలెందరు మంటలపాలవ్వాలో
అమరవీరులారా ఆగదు మన సమరం- మీ బలిదానాలు వృధాకాని పోరాటం
తెలంగాణ ఒక్కటే మన లక్ష్యం- మీ ఆత్మల సాక్షిగా వెలుస్తుంది మన రాష్ట్రం
మన తెలంగాణ రాష్ట్రం జైతెలంగాణా! జై జై తెలంగాణా!!
నేలకొరిగిన వీరులారా!వందనం వందనం
తలలు తెగిన తమ్ములారా అందుకోండి మా సలాం
తెలంగాణా బిడ్డలారా! మీకు అశ్రుల తర్పణం
తెలంగాణా సాధించగ మేము సైతం అర్పణం

1.మీరు నడిచిన పోరు బాట వదలబోమయ్యా
మీరు చేసిన ఆత్మత్యాగం మరువ బోమయ్యా
తెలంగాణా తల్లికోసం వేల జన్మలు కోరుతాం
తెలంగాణా స్వేఛ్ఛకోసం కోట్లమందిమి పోరుతాం

అస్తమించిన అమరులారా! జోహార్ జోహార్
స్వర్గమేగిన యోధులారా అందుకోండి దిల్ సె ప్యార్

2.నూరేళ్ళ జీవితాలు తృణప్రాయం చేసినారు
ముక్కుపచ్చలారకుండగ మృత్యువొడిలో చేరినారు
కరుడుగట్టిన గుండె కూడ కరిగిపోతుంది
మీరు చేసిన ఆత్మబలికి విలువ వస్తుంది
మా కంటివెలుగై కదలినారు కదన రంగంలో
ఇంటింటి దివ్వెగ నిలువగలరు తెలంగాణా చరితలో

సమరానికి చరమగీతం- ప్రగతికి ఇక సుప్రభాతం
తెలంగాణ సాధించిన జనగీతం
చిరకాల స్వప్నాల సాకారగీతం
జయగీతం-విజయగీతం- తెలంగాణ తల్లికి-ప్రణమామ్యహం
జైతెలంగాణా! జయహో తెలంగాణా!!

1. కలిసిఉంటె-కలదు సుఖము-ఇది స్పష్టం
ఐకమత్యమే- బలమన్నది-అక్షర సత్యం
స్పర్దతే వర్దయా విద్యా అనుసూక్తీ ఒకటుంది
పోటీ ఒకటుంటేనే-మన పటిమను-చాటుతుంది

2. భారతీయులుగ మనం ఒకటిగానె ఉందాం
దాక్షిణాత్యులుగా మన ఐక్యత తెలుపుదాం
తెలుగువాణి ఎల్లప్పుడు గర్వంగా వినిపిద్దాం
తెలంగాణ ఆంధ్రా రాష్ట్రాల్లో జీవిద్దాం

3. మనుషులుగా మనమెప్పుడు- మానవతను బ్రతికిద్దాం
ప్రాణమున్నజాతిగా -జీవ కరుణ చూపుదాం
బుద్దిజీవులైనందుకు పర్యావరణం కాచుదాం
విశ్వజనీన మైనదైన -ప్రేమను కనబఱచుదాం
గొంగళిలో తింటూ-ఏరబోకు వెంట్రుకలు
మురుగుకాలవలో ఉంటూ-మూసుకోకు నాసికను
రాజకీయనాయకుడా!అమాయకుల మాయకుడా!!
పార్టీ ఏదైనా నీవే ఒక బూటకం-గమనిస్తున్నారు ప్రజలు నీ వింత నాటకం

1. నరంలేని నాలుకనీది-స్థిరమేది నీవెన్నెముకకి
మాట నిలకడేలేదు-ఎప్పటికీ కప్పదాటు
ఊసరవెల్లే నీకంటే ఎతెంతో నయం నయం
గుంటనక్కే ఎఱుగదు నీ మాయోపాయం

2. పదిమందితో తిరిగి –పతివ్రతల ఫోజులు
నిజాయితీ జాడలేని-నికృష్టపు రీతులు
ఎంచగలవు ఎప్పుడు-ఎదుటిపార్టీ తప్పులు
గ్రహించలేవు తొడిగావని-నీవవే చెప్పులు

3. తెలంగాణ కోరుకుంటె-పార్టీలు వదిలిపెట్టు
సభ్యునిగా సైతం-రాజీనామాను పెట్టు
ఉద్యమాన ముందునిలిచి త్యాగాలకు తలపడు
తల్లి ఋణం కాస్తైనా-తీర్చుకొనగ త్వరపడు
రాయబారాలు తగవు-బేరసారాలు తగవు
మీనమేషాలు తగవు-తక్షణ కర్తవ్యం ఒకటే తగవు
తెలంగాణ యువకుడా –తాత్సారాలు తగవు
విద్యార్థి తమ్ముడా-ఉద్యమాల చరిత్రలకు నీవేలే ఆద్యుడవు

1. చింతకాయలే రాలే మంత్రాలు వెయ్యాలి
దెయ్యాన్ని వదిలించగ చెప్పులనే వాడాలి
మంచిగ చెబితే వింటున్నార ఎవరైనా
గుణపాఠం నేర్పించగ నడుంకట్టు ఇకనైనా

2. అమ్మపాలు తాగి రొమ్ముగుద్దకూడదు
తిన్న ఇంటి వాసాలు లెక్కించకూడదు
ఆంధ్రవలసవారంతా జై కొట్టితీరాలి
తెలంగాణ తల్లికి తలలు వంచి మొక్కాలి

3. రోమ్ లో ఉండేవాళ్ళు రోమన్ లాకావాలి
క్షేమాన్ని కోరుకొని మనతొ మమేకమవ్వాలి
తమకోసం శ్రమవలదని ఆంధ్రులకి చెప్పాలి
తమకోసం భయమొద్దని ఆంధ్రులకి చెప్పాలి
సమైక్యవాదమింక సంక నాకి పోవాలి

4. స్థిరపడిన ప్రజలంతా ఆంధ్ర సంగతి మరవాలి
తెలంగాణ బిడ్డలమని కలలొకూడ తలవాలి
ఉద్యమాన పాల్గొని సంఘీభావం చాటాలి
జైతెలంగాణ అంటు గొంతెత్తీ పాడాలి
పుట్టుకతోనే ఉద్యమకారులు పుట్టుక రారయ్యా
తల్లి కడుపులోనుండే నడుములు బిగించి రారయ్యా
ఇల్లు తగలబడి ఒకరు-కడుపులొ కాలి ఇంకొకరు
ఎగబడతారు దిక్కు తోచక-తెగబడతారు ఆకలి తీరక
జై తెలంగాణ! జై జై తెలంగాణా!!

1. చలిచీమలనిఎంచి నలిపివేస్తుంటే-
తప్పదు చావు ఎంతటి సర్పానికైనా
నయవంచనలెప్పూడూ పెంచిపోషిస్తుంటే-
తిరబడి రక్కుతుంది సాదుకునే పిల్లైనా
తయారుచేయకు –సాధనాలనే-మారణాయుధాలుగా
మార్చివేయకూ-శాంతివనాలనే- స్మశానాలుగా

2. మానవత్వమంటూనే పెడుతున్న ఈ మంటలు-
ఎలా రేపకుంటాయి ఈర్ష్యాద్వేషాగ్నులు
సౌభ్రాతృత్వమనే ముసుగుతో దొపిడీలు-
చెప్పకనే చెబుతాయి ఎదలోని కల్మషాలు
కలిసిఉండి అనుక్షణం- కలహించ భావ్యమా
విడివిడిగా ఉండి కూడ-ఆత్మీయత పంచుకోమ

3. ఎదుటివాడి కడుపుకొట్టి-ఏం బావుకొంటారు-
పక్కవాడి నోరు నొక్కి-గొంతు చించు కొంటారు
కూడబెట్తుకున్న ఆస్తి కడదాకా వెంటరాదు-
మేడపైన మేడలేల ఆరడుగుల నేల చాల
ఇకనైనా కళ్ళు తెఱచి దారికాస్త వదలరాద-
తెలంగాణ సాధనకై చేయూత నీయరాద
రాష్ట్రం సాధించకుంటే –మననోట్లో మన్నేరా
పాలన మనదవకుంటే-బానిసోల్ల బతుకేరా
తెలంగాణ తమ్ముడా-తెగువజూపి పోరాడు
తెగేదాక లాగేద్దాం-చీకిపోయింది తాడు

1. ఎన్నాళ్ళని భరిస్తాము-దగాకోరు నాటకాలు
ఎన్నేళ్ళని సహిస్తాము-వంచనలు కుత్సితాలు
ఒకటారెండా ఎన్నెన్నని-వెంచగలము
దశాబ్దాలు గడచినా-ఎంతని మన్నించగలము
ఎన్నైనా చెప్పగలము సుస్పష్ట తార్కాణాలు
ఎన్నైనా చూపగలము నిర్దుష్ట నిదర్శనాలు

2. వద్దువద్దని నెహ్రూ –వాదించినాగాని
మాయచేసి కలిపారు ఆంధ్రులతో ఆనాడు
పడనినాడెప్పుదైన విడిపోవుట సబబని
తేల్చిచెప్పినాడు-క్రాంతదర్శి జవహరుడు
కలతలతోఎన్నాళ్ళు -చేయాలి కాపురాలు
కూలిపోకతప్పదుఇక –శిథిలమాయె గోపురాలు

3. పెద్దమనుషులొప్పందం-కాలరాచినారు
ముల్కీనిబంధనలు-తుంగలోతొక్కినారు
ప్రభుత ఉత్తర్వులన్ని-అటకలెక్కించినారు
సర్వోన్నత తీర్పులన్ని-బేఖాతరు చేసారు
ఇంతకన్న ఏముంటుంది-వివక్ష అంటే
పగలబడి నవ్వొస్తుంది-సమైక్యమంటే

4. ఎవరికేది లాభమో-దాన్నివారు కోరుతారు
అతితెలివిగ ఆంధ్రులెపుడు-మన యింట్లో చొర్రుతారు
ఎవరింట్లో వారుంటే-అందరికీ సంక్షేమం
కలోగంజోతాగినా-అదియేకద ఆనందం
మాటవేరు మనసువేరు-తినేతిండి తీరువేరు
దృష్టివేరు స్థాయివేరు-పండుగ పబ్బాలువేరు
అనుసరించు ఈ మార్గాలు-నిరసన ప్రకటనకు
పాటించు ఈ ధర్మాలు-శాంతియుత పోరుకు
అందరి గమ్యం తెలంగాణా-అంతిమ లక్ష్యం తెలంగాణా

1. లూఠీలు దహనాలు-కావు హర్షణీయాలు
రాస్తారోకొ బందులు-ముందరి కాళ్ల బంధాలు
దాడులు ధ్వంసాలెలా-సమర్థనీయాలు
ఆత్మహత్యలెప్పుడూ-తేవు పరిష్కారాలు

2. ప్రతి విధ్వంసం-ప్రజలకే బహు నష్టం
పన్నులు ధరలు-పెరిగేది సుస్పష్టం
కాకూడదెవ్వరికీ-కంటగింపు మన ఇష్టం
ఈ సంగతి మఱచి పోతె-ఎంతటి దురదృష్టం

3. సత్యాగ్రహములు-అహింసాధోరణులు
తెచ్చిపెట్టాయి-స్వేఛ్ఛాస్వాతంత్ర్యాలు
గాంధేయ వాదములు-సర్వులకామోదములు
తిరుగులేని శస్త్రాలవి-మనకు బ్రహ్మాస్త్రములు

4. నిరశన దీక్షలు-మౌనప్రకటనలు
మానవ హారాలు-నలుపురంగు ధారణలు
కలవుకలవుఎన్నెన్నో-కొంగ్రొత్త రీతులు
ఆవిష్కరించునీవు-విన్నూతన తెన్నులు

5. మన నినాదాల హోరు-దేశమంత మ్రోగాలి
గొంతులన్ని ఒక్కటవ్వ-ఢిల్లీయే వణకాలి
కదంత్రొక్కి అడుగులేయ-భూకంపం రావాలి
కోట్లమంది కోర్కె తెలంగాణయని తెలపాలి
పోరాట పటిమ నీదే- త్యాగాల ఘనత నీదే
ఓ ఉద్యమ కారుడా- తెలంగాణ వీరుడా
జై తెలంగాణా!జైజై తెలంగాణా

1. నివురు గప్పి ఉన్ననీవు-ఆరిపోని నిప్పేగా
అణిగిమణిగి ఉన్ననీవు-నిజమైన ఉప్పెన
నీగుండె బ్రద్దలైతె-పెల్లుబుకును లావా
గొంతెత్తి గర్జిస్తే-భూ కంపాలు రావా
గల్లీ నుండి డిల్లీవరకు-పీఠాలు కదిలి పోవా
జై తెలంగాణా!జైజై తెలంగాణా

2. ఆశయాల సాధనకై -అసువులైన తృణప్రాయం
కాలమెంత గడిచినా –మానకుంది నీ గాయం
ఇకనైనా తెలియజెప్పు-ప్రభుత కొక్క గుణపాఠం
తెలంగాణ తథ్యమన్న-తిరుగులేని నగ్నసత్యం
సత్వరంగ తెలంగాణ ఇవ్వాలన్న సందేశం
జై తెలంగాణా!జైజై తెలంగాణా
పదేపది జిల్లాలు తెలంగాణలో...మన తెలంగాణలో
పదేపదే ఉత్తేజాలు హృదయాలలో..మన హృదయాలలో
ఇదే అదను మేల్కొనగ గ్రామగ్రామం
మేధపదును పెట్టి నడుపు సంగ్రామం
తెలంగాణ వీరుడా!విద్యార్థి తమ్ముడా!!
జై తెలంగాణా!జై జై తెలంగాణా!!

1. తలపండిన భీష్ములను -శిఖండితో గెలవాలి
ద్రోణులనిర్వీర్యులజేయ-బొంకులైన పలకాలి
అలంబసులనెదిరించగ ఘటోత్కచులు కావాలి
కర్ణులను కడతేర్చగ కుట్రలైన చేయాలి

2. గీతోపదేశాన్ని -మరవబోకు ఎన్నడు
పరమశివుడె ఎదురైనా –వెన్నుచూపకెప్పుడు
అర్జునుడై గర్జించు..దుర్జనులను నిర్జించు
పద్మవ్యూహాలున్నా-వరుసబెట్టి ఛేదించు

3. పోరాటానికొకే లక్ష్యం-అదే కదా విజయం
అభిమన్యులకోల్పోయిన -సంయమనం పాటించు
తెలంగాణ సాధనే -ఈ భారతయుధ్ధం
చేయవోయి పార్థుడా-పాశుపతం సంసిధ్ధం
మా గుండె ఒక్కటే- మా మనసు ఒక్కటే
మా మాట ఒక్కటే- మా బాట ఒక్కటే
జై తెలంగాణ- జైతెలంగాణ

1. రంగురంగుల-అంగీలు తొడిగినా
రకరకమ్ముల- దుస్తులు వేసినా
పలువిధమ్ముల-పక్షాలు కలిగినా
వేరువేరుగ-మార్గాల సాగినా
మా కాంక్షఒక్కటే-తెలంగాణా
మా లక్ష్యమొక్కటే-తెలంగాణా

2. మాలొ మేముగా-వాదించుకొన్నను
వ్యక్తిగతంగా-భేదించుకొన్నను
భావసారూప్యత-లోపించి యున్నను
భిన్నమైన ధృవాలని-తలపించుచున్నను
మా వాదమొక్కటే-తెలంగాణా
నినాదమొక్కటే-తెలంగాణా
ఒక్కరు కాదు ఉద్యమమంటే ఉప్పెనరా అది
ఓటమికాదు ఓరిమి అంటే సునామి అవుతుంది
సమిధలు జ్వలియిస్తెనే యజ్ఞం ఫలమిస్తుంది
త్యాగాలకు తలపడితేనే తెలంగాణ వస్తుంది
జై తెలంగాణా జయహో తెలంగాణా

1. తరుణం మనకిది -తప్పని రణమిది -తగ్గకు వెనకడుగేసి
మనుగడ కోసం -చేసే రగడిది - మరలకు వెన్నుచూపి
పిడికిలి బిగియిస్తేనే సంసిద్ధత తెసిసేది
పిడుగులు కురిపిస్తేనే యోధత్వం గెలిచేది

2. మరణం మనిషికి- ఎప్పటికైనా- తప్పనిదే కదా
ప్రాణం పోరుకు -ధారపోస్తే –విలువొస్తుందిగా
ఆత్మహత్యలెన్నటికీ హర్షణీయమే కాదు
సమరంలో అమరులమైనా చిరంజీవులౌతాము

3. స్వాతంత్ర్యానికి చేసారెందరొ బలిదానాలు
స్వేఛ్చా వాయువు పీల్చుటకొఱకే ఊపిరులొదిలారు
ఒక్కమాట పైననే దేశీయులు నిలిచారు
చిత్తశుద్దితోడనే లక్ష్యం సాధించారు

4. గాంధీ మార్గం -అనితర సాధ్యం-తోకముడిచాడు తెల్లవాడు
సత్యాగ్రహమే-ఉద్యమ సూత్రం-వాడిగెలిచాడు మహాత్ముడు
స్పూర్తితో సాగించు చివరి పోరాటం
నేర్పుతో సాధించు తెలంగాణ రాష్ట్రం
ప్రజ్వలించె జ్వాలలకు -బాధ్యులెవ్వరు
రగులుతున్న గుండెలకు -కర్తలెవ్వరు
రేగుతున్న ఆశాంతికీ -నిర్ణేతలెవ్వరు
నోటి ముందటి బుక్కను-ఎత్తగొట్టిందెవ్వరు

1. దశాబ్దాలుగ తెలంగాణ-నణగద్రొక్కిందెవ్వరు
సమైక్యాంధ్ర పేరు చెప్పి- చిచ్చు పెట్టిందెవ్వరు
మాటతప్పి మడమతిప్పి-తోకముడిచిందెవ్వరు
కాలి బ్రతుకులు బూడిదైతె-చోద్యమును చూస్తున్నదెవ్వరు

2. రాజ్యాంగం స్పష్టపఱచినా-రచ్చకీడ్చిందెవ్వరు
ప్రజలు తెలంగాణమన్నా-దాటవేస్తున్నదెవ్వరు
ఆడలేక మద్దెల ఓడు- అంటున్నదెవ్వరు
ఏకాభిప్ర్రాయమెలికతో-చేతులెత్తేసిందెవ్వరు

3. వద్దన్న ఆలితో-సంసారం బలాత్కారమే
కాదన్న వారితో-మనుగడ ప్రశ్నార్థకమే
ఒళ్ళంతా కంపరమైతె-కలయిక కల ఇకనే
మనసులంటు విరిగిపోతే-చెలిమి యిక దుస్సాధ్యమే

4. పాలివారి ఆస్తిని-పంచిమా కిమ్మనలేదు
పక్కవారి నిధులేవి-దోచుకొంటామనలేదు
ఉన్నవారినెవ్వరినీ-వదిలి పొమ్మనలేదు
(మా)తెలంగాణ మాకిస్తే-మీ సొమ్ముపొయ్యేది లేదు
కౌటిల్యతుల్యులైన ఆంధ్రులారా
ధృతరాష్ట్ర ప్రేమచూపు దాయాదులారా
వద్దువద్దు మాకింకా మీతో సహజీవనం
మమ్ము మా మానాన-బ్రతకనిస్తె ముదావహం

1. జలగలై ఎన్నాళ్ళు పట్టి పీడిస్తారు
నల్లులవలె నెత్తురెంత కుట్టి పీలుస్తారు
పరాన్నబుక్కులై ఎంతకాలముంటారు
కల్లబొల్లిప్రేమలెలా-కనబర్చ గలుగుతారు

2. బంధమంటె ఇరుమనసులు ఒకటిగ కలవాలికదా
స్నేహాన్ని ఎదుటివారు ఒప్పుకోవాలికదా
ఏకపక్ష ప్రేమలు ఎంత హాస్యాస్పదాలు
వద్దన్న వనితనే వేధించు చందాలు

3. తెలంగాణీయులు-ఒకరైనా మిము కోరారా
పక్కలోన బళ్లెంలా - భావించకున్నారా
మీకుమీరె తీర్పులిస్తే - అమలుజరిగిపోతుందా
సమైక్యమని వల్లిస్తే - పబ్బం గడిచి పోతుందా
దున్నపోతు ఈనుతుంది మీ మాటల్లో
నోరు నొసలు వేరువేరు-మీ వ్యక్తీ కరణల్లో
పులుముకొన్న చిరునవ్వులు-మీ మొహాలలో
అణువణువు విషమేకద-మీ దేహాలలో

1. హైద్రాబాద్ లోనఎలా -తెలంగాణ ఆంధ్రలు
వస్తే గెలిపిస్తారా-ఆంధ్రకి మా నేతలు
విడ్డూరాలకైనా- ఉండవా హద్దులు
తెలంగాణ వాళ్ళు కాదు-గొర్రెలు ఎద్దులు

2. ఆస్తులిచట లేవంటూ -ఎందుకింత రాద్ధాంతం
అన్నదమ్ములంటూనే-ఎందుకు భీతావహం
నదీజలాలొదరనే-కదా మీ అనుమానం
మిగిలిన మా నీళ్ళన్నీ-మీకే మా బహుమానం

3. ఆంగ్లేయుల పాలనలో-ఆరితేరినారు మీరు
సావాసదోషంలో-తెల్లవారుగ మీరైనారు
కుటిలనీతులెన్నెన్నో-వొంటబట్టించినారు
కార్యాన్ని సాధించగ-ఎంతకైన దిగజారుతారు
ఇల్లేకద అలికినాము ఇప్పుడు
పండుగకై చేయాలి చడీ చప్పుడు-సందడి ఎప్పుడు
తెలంగాణయను ఢిల్లీ ఉన్నది బహుదూరంగా
వడివడిగా అడుగులేసి చేరాలీ సత్వరంగా

1. ఏప్రయోజనాలు -దెబ్బతినకుండ
ప్రజలమనో భావాలు-గాయపడకుండ
మధించాలి మేధావులు పాలకబంధం (కబంధం=కడలి)
అందించాలి తెలంగాణ అమృతభాండం

2. మోసినారు మంధరగిరి ఉద్యమకారులు
మ్రింగినారు హాలాహలం అమరవీరులు
కల్పవృక్షాదులకై ఎగబడతారసురులు
కంటకనిపెట్టాలి-కలరు రాహుకేతువులు

3. అడ్డు తగులుతుంటారు ఎందరో సైంధవులు
ముందడుగే వేయనీరు అడుగడుగున శిఖండులు
ఆరంభశూరత్వం కాకూడదు వీరత్వం
కలసాకారమైన అపుడేకద సంబరం-కడలేనీ సంబరం
నమ్మబోకు తమ్ముడ యే కల్లబొల్లి మాట
వెలువడాలి ప్రత్యేక తెలంగాణ ప్రకటన
పార్లమెంటు భవనమే ప్రత్యక్ష సాక్షిగ
ఉత్తర్వులు రావాలి ఉన్నఫళంగా

1. కసరత్తులు చురకత్తులు -కమిటీలు బూటకములు
వెన్నుపోట్లె అలవాట్లు-వంచనలే రివాజులు
అరచేతిలొ చూపగలరు వైకుంఠాలు
బొందితోనె చేర్చగలరు ...స్వర్గాలు

2. అందితే జుట్టు అందకుంటె కాళ్లు- అవకాశవాద రాజకీయాలు
ఏరుదాటగానే తెప్పను తగలెయ్యడాలు
కంటితుడుపు మాటలు-ఎదలొ కుటిల రీతులు
కబుర్లతోనే కాలం కరుగదియ్యడాలు
సమైక్యాంధ్ర వాదనలో –ఎక్కడుందినిజాయితి
కనబడుతూనే ఉన్నది ఊసరవెల్లుల సంగతి
ఒళ్లుకాలి ఒకడేడుస్తుంటే-ఇల్లుకూడ తగలబెట్టురీతి

1. ప్రత్యేక తెలంగాణ -మ్రింగుడు పడలేక
జై ఆంధ్రా రాయలసీమ అనిబయటకు అనలేక
పూటకో వ్యాఖ్యతో-గంటకో లక్ష్యంతో
తికమక పడుతున్నారు-కక్కలేక మ్రింగలేక

2. అసలుబాధ ఉన్నదంత హైదరాబాదేరా
అందుకే అవుతున్నారు గాబరగాబరా
ఇంతచిన్న సంగతి ఎవరైనా ఎరుగరా
ఎదుటివాడి గుండెకాయ అడిగితే తప్పురా

3. దేశమంతమనదేకద -ఎక్కడైన బ్రతకవచ్చు
ఉద్యోగవ్యాపారాలు-అందరు చేసు కోవచ్చు
వచ్చినోళ్ళు మెల్లెగా- చాపక్రింద నీళ్ళుతెచ్చు
అప్పుడే రేగుతుంది-స్థానికుల్లొ చిచ్చు

4. పార్టీలుమాయమై –ప్రాంతీయత వెల్లివిరిసె
సిసలైన రాజకీయ-మిపుడేకద మనకు తెలిసె
వద్దని వదిలించబోతె -గుదిబండగ ఉంటారట
అన్నమాటవినకుంటే- హానికితలబడతారట

Tuesday, August 6, 2019

కలిసి ఉంటే కలదా సుఖము
బతుకంతా కన్నీటి పర్యంతము
కలో గంజో తాగిన నయము
వేరు బడితె దక్కుతుంది ఆత్మ గౌరవం-తెలంగాణ ఆత్మగౌరవం

1. వేరెవరైనా తెలుగువాడి వైపు
వేలు చూపినా చేయిచేయి కలుపు
సాటి ఆంధ్రుడే నిన్ను మంటగలుపు
ఆ క్షణమే కదా వేర్పాటునుసిగొలుపు
ఇంటికే పెద్దన్న తమ్ముల వంచించ తగున
కంచే చేనుమేస్తే పంట ఇంక మిగులునా

2. ఎందుకు పాండవులు ఐదూళ్ళనడిగారు
మోచేతి నీళ్లు వాళ్ళు తాగలేక
పీడిత దేశాలెందుకు స్వాతంత్ర్యం కోరాయి
బానిస దుర్భర బ్రతుకులు మోసాయి గనక
అయిన వారికి ఆకుల్లోన కానివారికి కంచాల్లోన
వడ్డించేది మనోడేకద ఉంచాలెందుకు పస్తుల్లోన
వడ్డించినా అడుగులో బొడుగులో ఎంగిళ్ళేనా

3. నక్కలు వేదాలను వల్లిస్తే నమ్మాలా
తోడేళ్ళు ధర్మాలు చెబితె పాటించాలా
దొరికినంతదోచుకొంటు-భూకబ్జాల్జేసుకొంటు
తెల్లవాడి తరహాలో ఏకై వచ్చి మేకనిపిస్తు
అంటారు కలిసి ఉంటె కలదు సుఖమని
చెపుతారు విడిపోవుట అవసరమా అని
రగులుతోంది తెలంగాణా
ప్రతిగుండె ఆరిపోని రావణకాష్ఠంలా
పారుతోంది నెత్తురే వరదలా
నరనరాన ఉరకలెత్తె గంగాప్రవాహంలా
సాగుతోంది ఉద్యమం-సత్యాగ్రహాలతో
అంతిమపోరేయనే కనని వినని బాటలో

1. లాగివేయడానికి దిక్కులేని శవాలా
విద్యార్థులంటేనే అనాధలనుకోవాలా
న్యాయమైన ఆకాంక్షలు మానుకోవాలా
ఆటవికుల రాజ్యమని భావించాలా

2. వీలైతే సమర్థించు నిజాయితీగ ఉద్యమాన్ని
చేతనైతె ఎఱుక పఱచు నీ సంఘీభావాన్ని
నీచమైన యోచనతో నీరుగార్చబోకురా
కుటిలమైన రీతిలో కూల్చివేయబోకురా

3. నోటిముందు కూటిని త్రోసివేయ న్యాయమా
వెన్నుపోటుపొడుచుటకై కాలుదువ్వ ధర్మమా
ఇన్నాళ్ళు లేని బాధ ఇప్పుడె మీకనిపిస్తోంది
తెలంగాణ అన్నప్పుడె ఉలుకు మీకు పుడుతోంది
తెలంగాణ అన్నప్పుడె సమైక్య రాగమొస్తోంది
ఆంధ్రా కోస్తా రాయలసీమ ప్రత్యేకత నిన దిస్తోంది
హాస్యాస్పదంగా ప్రత్యేక హైద్రా బాధని వినిపిస్తోంది

కసాయి కఱకు పాలన
కబంధ హస్తాల్లొ తెలంగాణా
నైజాము రజాకార్ల జమాన
కళ్ళముందు కదులుతున్న భావన

1. ఏ రాజ్యాంగంలోనిదీ అధికరణ
ప్రజలమనోభావాల ధిక్కరణ
“ ప్రజలకొఱకు ప్రజలచే ప్రజలు ” అనే
మరిచారా ప్రజాస్వామ్య వివరణ

2. దిక్కులేనివయ్యాయి ప్రాథమిక హక్కులు
నడకసాగనీయకుండ ఎన్నెన్ని చిక్కులు
శాంతి స్వేఛ్చలకే కడితే సమాధులు
నిరంకుశత్వానికి ఉండవుగా పుట్టగతులు

3. తిరుగుబాట్లు కావుకదా ఈఉద్యమాలు
ప్రజాకాంక్ష తెలుపుకొనుటకీ సాధనాలు
గదిలొపెట్టినోరుకట్టి కొట్టె ఈ వైనాలు
పులిగమారి పిల్లైనా తీయదా ప్రాణాలు
ఒకే గానం అందరినోట-తెలంగాణం-తెలంగాణం
ఒకేప్రాణం అందరిలోనా-తెలంగాణం-తెలంగాణం
అణగారిన తెలంగాణ అన్నలారా!
మసిబారిన తెలంగాణ తమ్ములారా!!
ఒకటే వాదం తెలంగాణం-మనదొకటే నాదం తెలంగాణం
జైతెలంగాణా!-జైజై తెలంగాణా!!

1. చీకటి కుహరాలు చీల్చుకొని రారండి
ఆశల దీపాలు వెలిగించుకతెండి
మీ బిడియపు శృంఖలాలు ఇకనైనాత్రెంచుకొండి
నిర్లిప్తపు పంజరాలు ఛేదించుక రారండి

2. హీనంగా బాంఛన్ కాల్మొక్తమని అన్నారు
తరతరాలు ఏదో ఒక పీడనలో ఉన్నారు
పనిచాతకాదని తెలివసలే లేదని
అభాండాలనెన్నెన్నో తలమోసి ఉన్నారు

3. అసువులు బాసారు అమాయకులు ఎందరో
ఆత్మార్పణ చేసారు యువకులెందరెందరో
ఎవరికొఱకు సాగుతోంది ఈ దమన కాండ
ప్రతిఒక్కరు నిలవాలి ఉద్యమానికే అండ
తెలంగాణ ఉద్యమానికే అండ
జైతెలంగాణా!-జైజై తెలంగాణా!!
బందులతో ఇబ్బందులు ఒకనాటివేగా
చెఱసాలలు ఉరికొయ్యలు ఇట అలవాటేగా
నరమేధాల్లో నలిగిన చరితే తెలంగాణా
బలిదానాల్లో వెలిగిన ఘనతే తెలంగాణా

1. పోరాడితే పోయేదేమి ప్రాణం మినహా
సాగించరా సమరం నేడు సరికొత్త తరహా
నిరాహార దీక్షలతో నీ నిరసనలు
సత్యాగ్రహాలతో ఆక్షేపణలు
నీ మౌన దీక్షలతో అభ్యర్థనలు
సమ్మెలు,ధర్నాలతో ఆకాంక్షలు

2. అణగారిన భావం నీలో పాతాళ గంగ
దాహాలనే తీర్చేయగా తరుణమిదే ఉప్పొంగ
మేధావులందరూ చేయి చేయి కలుపంగ
యువకులంత ముందు నిలిచి ఉద్యమాలు నడపంగ
వచ్చితీరు తెలంగాణ ప్రత్యేకంగా
ఇచ్చితీరుతుంది ప్రభుత సాదరంగ
ఇనుప బూట్లు తుపాకి బానెట్లు
పొడవలేవు ఉద్యమాని కే తూట్లు
ఏ లాఠీలు గుండెచీల్చుతూటాలు
ఆపలేవు లేవు తెలంగాణ పోరాటాలు
జైతెలంగాణా-జైజై తెలంగాణా

1. దాయాదులమైనామా సొంత ఇంటిలోనే
బిచ్చమెత్తుకోవాలా-హక్కులున్నచోటనే
ప్రజాస్వామ్య భారతంలొ-రెండోజాతి పౌరులమా
తెలంగాణ ప్రజలమంటె-భారతీయిలం కాదా
ఎందుకీ వివక్షా-సహనానికేనా పరీక్షా

2. విద్యార్థులలో కూడ మీ పిల్లలు ఉన్నారు
విచక్షణారహితంగా ఎందుకు కొడుతున్నారు
వైద్యులూ రోగులూ మందొకటే కోరుతుంటె
తెలంగాణ ఇచ్చుటనే అందరుఆశించుతుంటె
ఎందుకీ రాజకీయం-ఎందుకుదొంగాటకీయం

3. నానబెడితె శనగలైన-ఉబ్బిపోవునని తెలియద
తాత్సారం చేస్తుంటే – రక్తమేరులైపారద
ప్రత్యేక తెలంగాణ – అనివార్యంఅనివార్యం
ప్రభుత కళ్లు తెఱవకుంటె-ఇది క్రౌర్యం కడు ఘోరం
ఎప్పుడాగిపోతుంది మారణహోమం
ఏంచేస్తె ఇస్తారో తెలంగాణం
జబ్బ చఱచి సాగరా తమ్ముడా!
ఇజ్జత్కే సవాలిది తమ్ముడా
మానమా ప్రాణమా తమ్ముడా
తెగవేసి తేల్చుకో తమ్ముడా

1. కదంతొక్కి కదలాడు- కదనంలా పోరాడు
గెలుపు నీ లక్ష్యంగా- కడదాకా కలబడు
విజయమో స్వర్గమో వీరుడా
నవోదయం నీదిరా సూర్యుడా

2. ఎన్నాళ్ళీ వివక్షలు-ఎందాక సమీక్షలు
గోటితొ పోయేదానికి-గొడ్డలితో శిక్షలు
సమరమా అమరమా ధీరుడా
చావోరేవో దాటరా నావికుడ

3. సాహసాలు ఉగ్గుపాలు- బలిదానాలోనమాలు
ఉద్యమాల బాటలే-నీకు లాలిపాటలు
తెలంగాణ సాధించర యోధుడా
మడమతిప్పబోకుర అభిమన్యుడా
అమ్మా తెలంగాణా! నీకు వందనం!!
అనాధవనుకోకమ్మా-ఉండగ నీ బిడ్డలం
కంటికి రెప్పలాగ కాచుకుంటాము
ఇంటికి అమ్మోరుగా కొలుచుకుంటాము

1. ఎన్నాళ్ళో నైజాము చెఱలోన మగ్గేవు
ఇంకెన్నాళ్ళో పాలోళ్ళ పాలనలో చిక్కేవు
సవితిపోరు అనాదిగా అనుభవించావమ్మా
బాంచనంటు బ్రతుకుతూ నరకం చవి చూసావమ్మా
ఆన తెలంగాణా..మా ప్రతిన తెలంగాణ
పోరు తెలంగాణా..మా గెలుపు తెలంగాణ ||అమ్మా తెలంగాణా||

2. ఆగమై పోయినాము నీ బిడ్డల మిన్నాళ్ళు
అర్భకులం కాదమ్మా అణగద్రొక్క బడినాము
ఒక్కతాటిపైన ఇప్పటికైన నిలిచాము
గొంతెత్తిజై తెలం గాణఅంటు అరిచాము
జై తెలంగాణా జాగో తమ్ములారా
జైజైతెలంగాణా లెండీ రుద్రమ్మలార ||అమ్మా తెలంగాణా|

3. నెత్తురు పారినా పోరాటం సాగిస్తాం
ప్రాణాలొడ్డైనా నిన్ను కాపాడుకొంటాం
నిక్కచ్చిగ మనకంటూ రాష్ట్రం సాధిస్తాము
తెలంగాణ కీర్తినంత జగమంతా చాటుతాము
జై తెలంగాణ జై శాత వాహనులార
జయహో తెలంగాణ జై కాకతీయులార
ఖని ఆమె హైమ కన వరం-
ఇదిమన తెలంగాణ జిల్లాల వివరం
కొత్తదేది మనలో చేరే అక్కరలేదు-
ఉన్న ఈ పదింటిని వదిలే ప్రసక్తిలేదు

1. గోదావరి ప్రాణహితలు మన జలనిధులు
మానేరు శ్రీరాంసాగర్ మన ప్రాజెక్టులు
ప్రత్తివరిపసుపుచెఱకు మనకు పసిడి పంటలు
కొదవలేదు మనకెప్పుడు పాడీపశుసంపదలు

2. సింగరేణి గనులు తెలంగాణ శిరోమణులు
ఎంత తోడినా తరగవు బంకమన్ను నిల్వలు
ఎన్టీపీసి థర్మల్ యునిట్ విద్యుత్ ప్రదాతలు
పేపర్ జిన్నింగ్ రైస్ మిల్సు మనపారి శ్రామికతలు

3. భేషజాలుఎరుగని మాండలీక తెలుగు మనది
రోషాలను ప్రతిఫలించె పోరాట చరిత మనది
వేదాలకు నిలయమిది-జనపదాల కాలయమిది
బతుకమ్మాయనికోరే ఉత్తమ సంస్కృతి మనది

4. భాగవతం రచియించిన పోతన్న పల్లె మనది
శతకాలు పలికిన శేషప్ప ఊరు మనది
జ్ఞానపీఠి గెలిచిన సినారె ఖ్యాతి మనది
ప్రగతి బాట పట్టించిన పీవీజన్మ భూమి మనది

5. రామయ్య వెలిసిన భద్రాద్రి మనది
రాజన్న వెలిగేటి లెములాడ మనది
చదువులమ్మ నెలకొన్న బాసరనే మనది
నర్సన్న కొలువున్న యాదగిరి మనది-ధర్మపురి మనది


6. కొయ్యనే బొమ్మగ మలిచే నిమ్మల మనది
అగ్గిపెట్టెలోపట్టే చీర నేసే సిరిసిల్ల మనది
ఫిలిగ్రీ కళాకృతుల కరినగరం మనది
తివాచీ ప్రసిద్దమైన ఓరుగల్లు మనది

7. శీతల రంజన్ల సృష్టి ఏదులపురి మనది
ఇత్తడి ప్రతిమల స్రష్ఠ పెంబర్తి మనది
ఖద్దరు చేనేతల విఖ్యాతజగతి మనది
బిర్యానంటె నోరూరే హైద్రాబాదు మనది

8. శతావధాని కృష్ణమాచార్య కోరుట్ల మనది
అభినవ పోతన వానమమలై చెన్నూరు మనది
రంగులకల నర్సింగరావు పుట్టిన మట్టిది
కత్తివీరుడు కాంతారావును కన్నపుడమిది

9. సింహమెక్కిన శాతవాహన సామ్రాట్టు దీ నేలనె
శత్రువులకె సింహ స్వప్నం రుద్రమాంబ దీ గడ్డనే
గోల్కొండమంత్రులు అక్కన్నమాదన్నతావిదె
గోండురాజులు కోయదొరలు కొమురంభీముదీమట్టే

10. ప్రజాగాయకు డైనగద్దర్ కదం త్రొక్కె భూమిదే
తెలంగాణ ఊపిరైన కేసియార్ సిద్దిపేటఇచటే
ఉద్యమాల పులిబిడ్డ-విప్లవాల పురిటిగడ్డ
శాంతికి రతనాల వీణ-ఫిరంగియే తెలంగాణ రణాన
రచన,స్వరకల్పన&గానం:రాఖీ

"భారత భారతి"

వేదభూమి నాదేశం  జ్ఞానసుధను పంచనీ
నాదభూమి నా దేశం ఓంకారం నినదించనీ
కాశ్మీరం భారతి నీ కిరీటమై
కన్యాకుమారి పదపీఠమై
సంగీత సాహిత్య సంస్కృతీ సంపదలు
నీదయా విశేషాన వికసించనీ
హైందవ సాంప్రదాయ ప్రభలే
నీ చలవతొ విలసిల్లనీ

1.దుండగుల దండయాత్రలెన్నో ఎదుర్కొని
తురుష్క ముష్కరుల అక్రమాలు తట్టుకొని
పాశ్చాత్య నాగరిత పోకడలను ఢీకొని
అజరామరమై వెలుగుతోంది భారతీయత
జగతికి ఆదర్శమైన తెగువచూపు నడత
సరస్వతీ నీ కృపతో విశ్వవ్యాప్తమవనీ అవని
శారదా నీ వరముతొ దిగంతాలు చేరనీ

2.నీవున్న ప్రతి తావు ఉచిత విద్యాలయము
నువు వెలసిన అణువణువు కళానిలయము
వాడలలో రతనాలు రాశులుగా కురియనీ
క్రీడలలో పథకాలు వేడుకగా అరయనీ
ప్రపంచాన భరతమాత అగ్రగామికానీ
వాగ్దేవీ నీవాక్కుతొ యోగవిద్య సిద్ధించని
శ్రీవాణీ నీదృక్కుల శాంతి కాంతి ప్రసరించనీ
కవితాను అపర బ్రహ్మరా
ప్రసవవేదనెరిగిన అమ్మరా
ఆత్మతో రమించి
అనుభూతిని మధించి
భావనతో సంగమించి
కంటాడు కావ్యకన్యను
కల్పనచేస్తాడు రస రమ్యను

1.అక్షరాలు సంధించే అభినవ గాండీవి
పదముల పథముల నడిపించే మార్గదర్శి
నిరంతరం పరుగుతీసె మనోరథం  సారథి
ఎదను  ఎదను ఒకటిగ కలిపే వారధి
కలమునే ఉలిచేసే కవి భావశిల్పి రా
వస్తువేదైనగాని పసిడిగమార్చివేయు పరసువేదిరా

2.ఆటంకములెదురైనా తన పని ఆపనివాడు
ఎవరుగేలి చేసినా అసలే లెఖ్ఖించని వాడు
తోచింది రాయడమే ఎరిగినవాడు వాడు
ప్రతి స్పందన అభినందన ఆశించనివాడు
కలము కుంచెగా ఎంచే చిత్రకారుడు
మనసువర్ణాలన్ని ప్రస్ఫుటింపజేసే కవి ఇంద్రధనసురా

Monday, August 5, 2019

భరతకేతనం ఎగిరింది హిమగిరి శిఖరాన
త్రివర్ణ పతాక పాడింది జనగణమన కాశ్మీరాన
ఉండీలేదను భావనవీడి నిండు దేశమే మురిసింది
కన్యాకుమారికి కాశ్మీరానికి అవిరళ మార్గం వెలిసింది
వందే మాతరం సుజలాం సుఫలాం మలయజశీతలాం

1.పొరుగు దేశపు పొగరణిగేలా ప్రభుత సత్తా చాటింది
ఉగ్రమూకల కలచెదిరేలా సింహ గర్జనే చేసింది
గజగజ వణికే భూతలస్వర్గం సహజాకృతినే పొందింది
స్వాతంత్ర్యానికి సరియగు అర్థం దేశమంతటికి తెలిసింది
సారే జహాఁసె అచ్ఛా హిందూస్తా హమార హమారా

2.తెగువకు ఎగువన ప్రాణాలొడ్డే వీరజవానులు
కంటికి రెప్పగ నిజ సరిహద్దును కాచే సైనికులు
నౌకా వాయు పదాదిదళముల యుద్ధ యోధులు
జగతే మెచ్చగ జనతను నడిపే పాలకవర్యులు
జయజయజయ ప్రియభారత జనయిత్రీ దివ్యధాత్రి
శివనామమెంత మధురము
శివపూజ ఎంత సులభము
హరుని హృదయమంతా కారుణ్యము
మరుని హరుని సేవిస్తే కైవల్యము,కైలాస వాసము
శివ శివ హరహర శంభో మహాదేవా-
ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ

1.కోవెల కనరాకుంటే నదితీరమైన చాలు
లింగము దరిలేకుంటె సైకతముదైన చాలు
పంచామృతాభిషేకమేల దోసిలి జలమైన మేలు
డంభాలంకారములేల చిటికెటుడువిభూతి చాలు
దిగంబరుడు శుభంకరుడు చిన్మయానందయోగి పుంగవుడు
శివ శివ హరహర శంభో మహాదేవా-
ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ

2.నమ్మికొలువ తమ్మిపూలె మెచ్చుతాడు
మనసార అర్పిస్తే మారేడు పత్రిచాలు
విమలబుద్ధి నర్చించగ కమలాలైన చాలు
పత్రంపుష్పంఫలంతోయం శివుని కైంకర్యాలు
గంగాధరుడు చంద్రచూడుడు రుద్రాక్ష మాలా ధారుడు
శివ శివ హరహర శంభో మహాదేవా-
ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ

Saturday, August 3, 2019

రచన,స్వరకల్పన&గానం:రాఖీ

"మహితం -మన స్నేహితం"

అహమెప్పుడు దహియిస్తుందో
స్నేహమపుడు ఉదయుస్తుంది
త్యాగమెచట యోగిస్తుందో
స్నేహమచట వికసిస్తుంది
అపురూపమైన బంధమే మన స్నేహితం
నేస్తమా నీతోటి మైత్రియే మహితం

1.ఎంతచిత్రమో మనపరిచయ ఘట్టం
చుట్టాలను సైతం మరిపించగ నీవే చుట్టం
విడదీయలేదు మనని లోకంలో ఏ చట్టం
కట్ట్యాముకదా నేస్తమా మనం చెలిమికి పట్టం
అపురూపమైన బంధమే మన స్నేహితం
నేస్తమా నీతోటి మైత్రియే మహితం

2.నిష్టూరాలకు మన మధ్యన లేదు తావు
కష్టాలు కన్నీళ్ళూ చేరవు మన రేవు
అపార్థాలు అలకలు రావెప్పుడు మన తెఱువు
కాలం మాయాజాలంలో మన కలయిక తాజా పువ్వు
అపురూపమైన బంధమే మన స్నేహితం
నేస్తమా నీతోటి మైత్రియే మహితం

Friday, August 2, 2019

నా మనసే మామిడి తోట
కోయిలమ్మా పాడవే ఒక పాట
నీ గానం తేనెల ఊట
గ్రోలనీవమ్మా కమ్మగా ఈపూట
పారిజాత పరిమళాలు  కుమ్మరించి
ఇంద్ర ధనుసు రంగులన్ని రంగరించి
అనురాగం ఆప్యాయత మేళవించి
పాడవే ప్రపంచమే పరవశించేలా
నీ పాటలొ మాధుర్యం ఎదను స్పృశించేలా

1.అమ్మలాలి పాటనే తలపించేలా
గొల్లవాడి పిల్లనగ్రోవే స్ఫురియించేలా
యాతమేసె రైతు గొంతుకు వంత పాడేలా
ఎలుగెత్తే నావికుడి గళమును మరిపించేలా
పాడవే ప్రపంచమే పరవశించేలా
నీ పాటలొ మాధుర్యం ఎదను స్పృశించేలా

2.విజయ శంఖమే పూరించిన చందంగా
సింహనాదమే నినదించిన వైనంగా
కవాతుకే సవాలునే విసిరే విధంగా
జలపాతపు హోరుజోరు ధ్వనించే దృశ్యంగా
పాడవే ప్రపంచమే పరవశించేలా
నీ పాటలొ మాధుర్యం ఎదను స్పృశించేలా


రచన.స్వరకల్పన,గానం:రాఖీ
 రాగం:ముఖారి

అల వైకుఠం ఇల తిరుపతి క్షేత్రం
కలియుగవాసుల కైవల్యధామం
వెలసినాడు వేంకటపతి దాటించగ భవజలధి
సుజనులార తరించగా
తరలిరండి గోవిందుని కృపనందగా
గోవిందా గోవిందా-గోవిందా గోవిందా
గోవిందా గోవిందా-గోవిందా గోవిందా

1.దూరభారమెంతైనా వ్యయప్రయాసలెన్నైనా
ఏడుకొండలెక్కగనే బడలిక ఎగిరి పోతుంది
బంగారు శిఖరాన్ని కనినంతనె మనసు కుదుట పడుతుంది స్వామిదివ్యమంగళ విగ్రహాన్ని దర్శిస్తే ఆనందం అలౌకికమౌతుంది
గోవిందా గోవిందా-గోవిందా గోవిందా
గోవిందా గోవిందా-గోవిందా గోవిందా

2.తలనీలాలిస్తె చాలు వెతలెడబాపుతాడు
కోనేటిలొ మునిగినంత కోరికలీడేర్చుతాడు
నీదను భావన తొలగించగ ముడుపులు గైకొంటాడు
రెప్పపాటు విలువతెలుప తృటిలొ మాయమౌతాడు గోవిందా గోవిందా-గోవిందా గోవిందా
గోవిందా గోవిందా-గోవిందా గోవిందా

3.ఆపదమొక్కులవాడు వాడనాథనాథుడు
సిరులొసగే సరిదేవుడు శ్రీ శ్రీనివాసుడు
వడ్డికాసులవాడు పద్మావతి విభుడు దొడ్డ దేవుడు
అలుమేలు మంగాపతి స్వామి శరణాగతవత్సలుడు
గోవిందా గోవిందా-గోవిందా గోవిందా
గోవిందా గోవిందా-గోవిందా గోవిందా
జాతిని గమనించలేదు రాముడు సుగ్రీవుడు
కులమునెంచలేదు కృష్ణుడూ కుచేలుడు
తాహతులను తలచలేదు సుయోధన కర్ణులు
కులమతాలకతీతమే ఎప్పుడూ స్నేహితము
గాఢత ఎంతో కలిగిన వింత బంధము మైత్రీ బంధము

1.రంగును రూపును అసలే లెఖ్ఖించదు
వయసును విద్వత్తును పరిగణించదు
మగనా మగువనా అనికూడా చూడదు
ఎవరెవరికి మధ్యన ఏర్పడునో స్నేహితము
గాఢత ఎంతో కలిగిన వింత బంధము మైత్రీ బంధము

2.ప్రయాణాల్లొ మొదలౌను ఒక స్నేహము
కలంతోనె కుదురుతుండె అలనాటి స్నేహము
గొడవతొ సైతం బలపడును మరొక స్నేహము
సామాజిక మాధ్యమాల దీనాటి స్నేహము
గాఢత ఎంతో కలిగిన వింత బంధము మైత్రీ బంధము

3.సాహిత్యం వారధిగా సాగేనొక స్నేహము
సంగీతం సారథిగా చెలఁగేనొక స్నేహము
అభిరుచులతొ వికసించేనొక స్నేహము
ఇవ్వడమే ఎరిగినది మధురస్నేహము
గాఢత ఎంతో కలిగిన వింత బంధము మైత్రీ బంధము

Thursday, August 1, 2019

రచన,స్వరకల్పన&గానం;రాఖీ

నీ యాదిలో ప్రతిసమయం
మనోవ్యాధితో అయోమయం
గడపలేక పోతున్నా జీవనం
ఏకాకిగానే నా భావనం
చెలీ రావేలనే నను చేర
అక్కునజేర్చుకో ప్రియమార

1.నీ నవ్వుల పువ్వులనే ఏరుకున్నా
నీ పలుకుల తేనెలనే జుర్రుకున్నా
నీ స్పర్శలో మధురిమలే మరువకున్నా
నీమేని పరిమళాల మత్తుకోరుతున్నా
చెలీ రావేలనే నను చేర
అక్కునజేర్చుకో ప్రియమార

2.రెక్కలు తెగిపోయిన పక్షినైనా
ఆలంబన కోల్పోయి బేలనైనా
నా గురించి యోచించు కొంచము
నాకైతే నువ్వేలే ప్రపంచము
చెలీ రావేలనే నను చేర
అక్కునజేర్చుకో ప్రియమార