Thursday, November 3, 2022

 

https://youtu.be/Xp_a5yBQVLI

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


రాగం: చంద్రకౌఁస్


కనకాభిషేకమా గండపెండేరమా

గజారోహణమా తులాభారమా

కళాకారులడిగే ఘన కానుక లేవని

కవులు ఆశపడే సత్కారాలేమిటని

చప్పట్లు కొడితెచాలు సంబరంతాకు అంబరం

బాగున్నదంటేనే కప్పినంత కాశ్మీరు అంబరం


1.మేధనెంతొ మధించి అనుభూతి రంగరించి

శబ్ధార్థ భావ సౌందర్య మొప్పగా అలంకరించి

కవన కృతిని కమనీయ మలర తీర్చిదిద్ది

హృద్యమౌ నైవేద్యము వాగ్దేవికి నివేదించి

అమ్మవారి ప్రసాదంగా పఠితులకందించగా…


2.రేయి పగలు శ్రమించి పాటవాన్ని మేళవించి

అనితర సాధ్యమౌ కఠిన సాధనతో సాధించి

సప్తస్వరాల నవరస సారాలు కళలోకుమ్మరించి

నటరాజు చరణాలకు నమ్రతగా సమర్పించి

కనువిందుగా మది పసందుగా  ప్రదర్శించగా…

 

https://youtu.be/W-hts27C7Cc

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


రాగం:హంసానంది


అత్రి అనసూయ పుత్రుడా

త్రిమూర్తి స్వరూపుడా

గురుదేవ దత్తుడా 

అష్టాంగయోగ సిద్దుడా

అభీష్ట వరదుడా సాష్టాంగ వందనం


1.త్రిగుణాతీతుడా పునీత చరితుడా

అవధూతా ఆరోగ్య దాతా వైద్యుడా

దిగంబరా దిగంబరా శ్రీపాద వల్లభుడా

భీమా నదీ తీర గాణుగాపుర వాసుడా

అభీష్ట వరదుడా సాష్టాంగ వందనం


2.శంఖ చక్ర శూలాయుధ ఢమరుధర

దండ కమండల మాలాయుత కర

కౌపీనధారి వనమాలి పరమ యోగీశ్వర

నరసింహసరస్వతీ దివ్యావతారుడా

అభీష్ట వరదుడా సాష్టాంగ వందనం

 

https://youtu.be/ONWSbju6wuk

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


అలకబూనితే అదో నవ్వులాట నీకు

కినుక వహిస్తే అసలు లెక్కచేయవెందుకు

గమనించవు నా మాటల మాటున గాంభీర్యం

పరికించవు నా మదిలో పేరుకునే నైరాశ్యము

ఈ చిత్రవధ కంటే చంపెయ్యి ఒక్కసారి

ఈ యాతన మనలేను వేచివేచి వేసారి


1.తోసిరాజంటూ బంధనాలు వేస్తావు

తల్లడిల్లి పోతుంటే తమాషాగ చూస్తావు

ఎందుకో మరి నీపై ఇంతటి ఆరాధన

ఎరుగవంటె నమ్మేనా నా ఎద ఆవేదన

ఈ చిత్రవధ కంటే చంపెయ్యి ఒక్కసారి

ఈ యాతన మనలేను వేచివేచి వేసారి


2.ఎందుకు వచ్చావో నా జీవితం లోకి

ఎలా నాలొ సొచ్చావో ఎరుగను ఏనాటికి

నా ఊపిరి గుండె సడి నీవేలే ముమ్మాటికి

చేరవే నా గూటికి కూడదంటే నే కాటికి

ఈ చిత్రవధ కంటే చంపెయ్యి ఒక్కసారి

ఈ యాతన మనలేను వేచివేచి వేసారి