Friday, October 7, 2022

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


శ్రీధరా శ్రీకరా శ్రీనాథా

శ్రీహరి శ్రీపతి శ్రీవేంకటాచలపతి

సంకటముల కంటకములు 

నిను చేరే బాట పొడుగునా

ఆటంకములు అగచాట్లు 

తగునా నాకడుగు అడుగునా

పాహిమాం పాహిమాం పరంధామా

రక్షమాం రక్షమాం తిరుమల సార్వభౌమా


1.నీ సంకల్పము ఎరుగుట బ్రహ్మతరమా

నీవిచ్చే కర్మఫలము తెలియగ శివుని వశమా

లీలాలోలా శ్రితజనపాలా కథలో ఇన్ని మలుపులా

ఆపద్భాంధవా అనాథనాథా పథమంతా గతుకులా

పాహిమాం పాహిమాం పరంధామా

రక్షమాం రక్షమాం తిరుమల సార్వభౌమా


2.అల్లంత దూరానా  అగుపించును గమ్యము

చెంతకు చేరినంత ఎండమావితో సామ్యము

ఆశానిరాశల నడుమన  నాదెంతటి దైన్యము

నువు వినా అన్యమెవరు స్వామీ నీవే శరణ్యము

పాహిమాం పాహిమాం పరంధామా

రక్షమాం రక్షమాం తిరుమల సార్వభౌమా

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


రాగం: ఆనంద భైరవి


నిర్మలమై దీపించే నీ దివ్యనేత్రాలు

వక్రదృష్టినిల దహించు అగ్నిహోత్రాలు

చంద్రికలే కురిపించే నీ లోచనాలు

మనసును శాంతపరచు లేపనాలు

చూస్తుండి పోతాను మాతానిను మైకంగా

నను నేను మరచిపోయి నీవే లోకంగా


1.నీ కనులను వర్ణింపజాలవు నా కవనాలు

మీనాలు కమలాలు తూగవే ఉపమానాలు

కరుణామృత కాంతులతో దేదీప్యమానాలు

నిను నమ్మిన భక్తులకవి ఇహపర వరదానాలు

చూస్తుండి పోతాను మాతానిను మైకంగా

నను నేను మరచిపోయి నీవే లోకంగా


2.చతుర్వేద సారమంత తల్లీ నీ నయనాలలో

సాటిరావేవీ నీ చక్షులకు చతుర్దశ భువనాలలో

మూలాధారాది చక్రోద్దీపనకవి భవ్యసాధనాలు

ఏకాగ్రత కుదురగ ఆకర్షించు నీ అవలోకనాలు

చూస్తుండి పోతాను మాతానిను మైకంగా

నను నేను మరచిపోయి నీవే లోకంగా

 

https://youtu.be/9FYpYaCfLQU?si=wnHZ-jJmSEbO5I86

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


రాగం:నాటకురంజి


వైద్యనాథుడా మృత్యుంజయుడా

నువు నయం చేయలేని వ్యాధిలేదుగా

నూరేళ్ళ ఆయువీయ వింత కాదుగా

ఎందుకు మనిషి బ్రతుకు ఇంత విషాదం

చింతలు కలిగించుటేనా నీకు వినోదం

శంభోహరా శంకరా నమో గౌరీవరా అభయంకరా


1.మధుమేహాలూ మాకు రక్తపోటు పాట్లు

మనోవ్యాధులూ మరి గుండెపోటు అగచాట్లు

ఆనారోగ్యగ్రస్తులమై అడుగడుగున ఇక్కట్లు

నీకృపలేనిదే శివా ఈ గండాలు గట్టెక్కుటెట్లు

శంభోహరా శంకరా నమో గౌరీవరా అభయంకరా


2.నవనాడులపై పలు వ్యసనాల దాడులు

పండంటి జీవితాలపై రాచపుండు కైనీడలు

చిత్రమైన రోగాలతో మనుగడలో గడబిడలు

గాడితప్పి సుడుల చిక్కే విలాసీ విను మా గోడులు

శంభోహరా శంకరా నమో గౌరీవరా అభయంకరా