Saturday, July 25, 2020

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

పిడికెడు మెతుకుల కోసమని
రెక్కల కష్టం నమ్ముకొని
ఒకరికి చేయి సాచకూడదని
ఎవరి పంచనో చేర బోమని
చిరువ్యాపారం చేసుకొని బ్రతికే అభాగ్యులెందరో
బేరసారాలు చూసుకొని జీవించే వ్యథార్థులెందరో

1.బుట్టెడు ఫలాలు మోసుకొని-తట్టెడు పండ్లే అమ్ముకొని
పొద్దంతా శ్రమకోర్చి వచ్చినదానితొ తృప్తి పడి
నిజాయితీగా నడుచుకొని బ్రతికే అభాగ్యులెందరో
ఎండావానల వీథిన బడుతూ జీవించే వ్యథార్థులెందరో

2.గీచిగీచి బేరమాడే గిరాకినైనా వదల లేక
ఆచితూచి చిల్లర కోరే పినాసినైనావెళ్ళగొట్టక
గిట్టుబాటే గిట్టకున్నా ఏదో ధరకు విక్రయించే అభాగ్యులెందరో
మామ్మూళ్ళెన్నో ఇచ్చుకొని గిరిగిరి వడ్డీ కట్టుకొనే వ్యథార్థులెందరో


రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

ప్రేమ మీర నను స్పృశించగా
నీ చేతి స్మార్ట్ ఫోనైనా కాకపోతి
నా హృదయ ధ్వనినే వినిపించగా
నువు వాడే హెడ్ ఫోనైనా అవకపోతి
వస్తువుకున్న విలువ ఆప్తులకూ కరువాయే
వాస్తవికత నొదిలివేయ మిథ్యా బ్రతుకాయే

1.చేదబావే లేక బోర్వెల్ కరెంటు బిచ్చమాయె
  వీచు గాలినోచక సీలింగ్ ఫ్యాన్లే దిక్కాయే
  సహజవనరులన్నీ తత్వాలను కోల్పోయే
  యాంత్రికత గుప్పిట ప్రకృతి  నీరుగారిపోయె
  వస్తువుకున్న విలువ ఆప్తులకూ కరువాయే
  వాస్తవికత నొదిలివేయ మిథ్యా బ్రతుకాయే

2.మనిషి మనిషి మధ్యలో అంతర్జాలమాయే
కాలక్రమేణా ఎన్నో పనిముట్లే మాయమాయే
అనుబంధం ఆత్మీయత మొక్కుబడిగ మారెనాయె
సాంప్రదాయమంటేనే పురావస్తు శిథిలమాయే
వస్తువుకున్న విలువ ఆప్తులకూ కరువాయే
వాస్తవికత నొదిలివేయ మిథ్యా బ్రతుకాయే
రచన,స్వరకల్పన & గానం:డా.రాఖీ

జడత్వమే ఆదరువు నియంత్రణే నాకు కరువు
శాఖోపశాఖలై విస్తరిల్లె నా కవన తరువు
నిమిషమైన మోయలేను నాలో భావాల బరువు
గీతమై వెలువరించ నా మనసే ఆపోవు
కవనమే నాకు జీవనం గీతమే ప్రియతమం

1.పగలు లేదు రాత్రి లేదు ఇపుడపుడని లెక్కలేదు
భక్తీ రక్తీ ముక్తీ దేశానురక్తిగా విషయమొక్కటని కాదు
అనుకోని అతిథిగా ఏదెపుడెద తడుతుందో
ఏ రూపుదిద్దుకొని ఎలా వెలుగు చూస్తుందో
కవనమే నాకు జీవనం గీతమే ప్రియతమం

2.ఊపిరాడని ఒత్తిడి ఎన్నెన్నో సవాళ్ళ  దాడి
రచనచేయ అడుగడుగున అవాంతరాల సుడి
దొరికిన సమయాన్ని లిప్తపాటు వదలను
అనుకున్న అనుభూతి వచ్చు వరకు వదలను
కవనమే నాకు జీవనం గీతమే ప్రియతమం

3.ప్రశంసలు విమర్శలు ఏవైతేం స్పందనలు
సత్కారం బహుమానం కావు తూచు తూనికలు
పాఠకుల ఎదలోన స్థిరపడాలి పదిలంగా
అభిమానుల మన్నలు పొందాలి ఘనంగా
కవనమే నాకు జీవనం గీతమే ప్రియతమం
రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

వేదాంత మెంతగ చెప్పితేనేం చట్టాలనెన్ని గుప్పితేనేం
తన్నుమాలిన ధర్మమేది ఉండబోదుర సోదరా
పనికిమాలిన సొల్లుకబురులు వాగడం తగదురా

ధర్మ పన్నాల్ వల్లించితేనేం మూల్యమే చెల్లించితేనేం
తన్నుమాలిన ధర్మమేది ఉండబోదుర సోదరా
వంచనల పంచన చేరగ మినహాయింపే లేదురా

నీతులే బోధించితేనేం న్యాయముగ వాదించితేనేం
తన్నుమాలిన ధర్మమేది ఉండబోదుర సోదరా
తమదాక వస్తే నియమాల మాటే చేదురా

బాసలెన్నైనను చేసితేనేం ఆశలే కల్పించితేనేం
తన్నుమాలిన ధర్మమేది ఉండబోదుర సోదరా
పదవి వరకే పలుకు విలువ నిజం చెబితె బాధరా

సాంత్వనలు కల్పింతేనేం ఉచితసలహాలిచ్చితేనేం
తన్నుమాలిన ధర్మమేది ఉండబోదుర సోదరా
నొప్పి తీవ్రత చెప్పతరమా రాఖీ లోకం వినదురా