Thursday, January 2, 2020

కళ్ళతోనే ఆహ్వానం
చూపుతోనే ఆతిథ్యం
వలపులన్నీ వండివార్చి సిద్ధపరచు కంచం
అందించవే చెలీ పసందౌ విందుభోజనం

మనసుగదిలో పక్కసదిరా
సోయగాల మల్లెలు జల్లా
వేచి ఉన్నా వేగరారా వేగలేకపోతున్నా
ప్రియా విరహంతో కాగి కాగిపోతున్నా

1.తాంబూలం తాకకున్నా -అధరాలు అరుణిమలే
శ్రీగంధం పూయకున్నా-కపోలాలు మధురిమలే
జామురాతిరి గడిచిపాయే-జాగేలా నాసఖా జాగరణకు
ఆగలేని ఆత్రముంది - ఎదురుతెన్నులేల నా కలలకు
వేచి ఉన్నా వేగరారా వేగలేకపోతున్నా
ప్రియా విరహంతో కాగి కాగిపోతున్నా


2.నీ స్పర్శలోనా -విద్యుల్లత దాగుంది
తాకీ తాకగనే నా -ఒళ్ళుఝల్లుమంది
ఊహలోకి నువు రాగానే-చెలీ  చెలరేగుతోంది చలి
నెగడులోని సెగలాగా - ననుకాచుతోంది నీకౌగిలి
వలపులన్నీ వండివార్చి సిద్ధపరచు కంచం
అందించవే చెలీ పసందౌ విందుభోజనం


దైవోపహతులం -మండేటి చితులం
బంధువులందరున్న అనాథలం
ఎంతకు ఒడవనీ విషాధ గాథలం

1.సంపద ఉండికూడ దరిద్రులం
సంతతి కలిగియున్న వంధ్యులం
దైవభక్తి ఓలలాడె నాస్తికులం
బాహుబలితొ తులతూగు బలహీనులం

2.కన్నీరు కొలువున్న సంద్రాలం
చిరునవ్వు జలతారు పరదాలం
ఓటిమినెరిగిన పోరాట యోధులం
మనసుల్ని కప్పెట్టిన సమాధులం
ఏంచేస్తున్నావో వేంచేయమంటుంటే
ఓపలేకపోతున్నా తాత్సారం చేస్తుంటే
ఎంతగనం బంధించనూ నా తలపులనూ
మూసివేసినావేలా నీ మదిగది తలుపులను
రమ్మంటె రావూ రమ్మనీ అననే అనవు
ఎలావేగనే నీతో లలనామణీ
ఎలాసాగనే నీతో కలహంసగామినీ

1.పొద్దుపొద్దంతా వద్దు వద్దు అంటుంటావు
అద్దరాతిరయ్యాక నిద్దుర చెడగొడతావు
కలనైనా నోచనీవే ముద్దూ ముచ్చట
కల్పనలో జతకావేమే ముద్దుగుమ్మ ఏపూట
ఎలావేగనే నీతో నా ప్రణయ లతిక
ఎలాసాగనే నీతో నా మధుర గీతిక

2.గాలి మోసుకొస్తుంది జాలితో నీ పరిమళం
వాన తీసుకొస్తుంది నీ స్పర్శా పరవశం
నీరెండ తలపిస్తుంది నీ కౌగిటి వెచ్చదనం
సింగిడే చిత్రిస్తుంది నీ వర్ణ సౌందర్యం
ఎలావేగనే నీతో నవ మోహనాంగీ
ఎలాసాగనే నీతో ఎదలోన కృంగీ