Thursday, October 29, 2009

పొద్దు పొడిచె పొద్దు గ్రుంకె- ముద్దరాలి సద్దు లేదె
సుద్దులెన్నొ దాచి ఉంచా-నిద్దురనే కాచి వేచా
రాదేలా నాచెలి గారాల నెచ్చెలి
రాధేలా చేరరాగ తానే నా కౌగిలి
1. నడినెత్తికి సూరీడు-వడివడిగా చేరేడు
ఎవరిపైనొ అలిగాడు-నిప్పులే చెరిగాడు
శీతలపానీయమైన-తీర్చకుంది నా దాహము
మలయమారుతమ్మున్నా-తాళకుంది నా దేహము
రాదేలా నాచెలి గారాల నెచ్చెలి
రాధేలా చేరరాగ తానే నా కౌగిలి
2. సంధ్యకూడ సడిసేయక-రేయిబావ ఒడి చేరగ
నింగిలోన చుక్కలన్ని-చందమామ సొంతమవగ
వెన్నెలైన తీర్చకుంది-నా విరహ తాపము
మల్లికూడమాన్పకుంది-నా హృదయ గాయము
రాదేలా నాచెలి గారాల నెచ్చెలి
రాధేలా చేరరాగ తానే నా కౌగిలి
3. పగలు పోయి రేయి పోయి- రోజులెన్నొ మారిపోయి
వారాలు మాసాలు-ఋతువు లెన్నొ గడిచి పోయి
బ్రతుకు లోని ప్రతి హాయి-చెలియ తానైపోయి
ఎదకు తూపులు తగిలాయి-ఎదురు చూపులు మిగిలాయి
రాదేలా నాచెలి గారాల నెచ్చెలి
రాధేలా చేరరాగ తానే నా కౌగిలి

No comments: