Sunday, April 5, 2009

“చిరునవ్వుల ముసుగులు”

మాయా లోకం
-రాఖీ
చిరునవ్వుల ముసుగులు - ఎదలోతుల లొసుగులు
ఎవరికొరకు ఈ వింత నాటకాలు - మనుషులంతా ఎందుకు దొంగాటకాలు ||

1.) మొహమాటం మూయునెపుడు -హృదయ కవాటం
బిడియమెపుడు తెరవనీదు-మనసు గవాక్షం
కక్కలేని మ్రింగలేని-తీరే దయనీయం
పారదర్శకత్వమే-సదా హర్షణీయం || చిరునవ్వుల ముసుగులు ||

2.) డాంభీకం డాబుసరితొ – ఉన్నతులని కొలువబడం
భేషజాల ప్రకటనతో – భేషని కొనియాడబడం
పులిఎదురయ్యే వరకె – మేకపోతు గాంభీర్యం
దివాలయ్యి దిగాలయే- దుస్థితే అనివార్యం || చిరునవ్వుల ముసుగులు ||

3.) ఆత్మను వంచించుకుంటె-అవుతుందా అది లౌక్యం
కప్పదాటు మాటలేపుడు-కానేరవు నమ్మశక్యం
జీవితాన అవసరమా-ఇంతటి సంక్లిష్టం
నిన్ను నిన్నుగ చూపేదే-నిజమైన వ్యక్తిత్వం || చిరునవ్వుల ముసుగులు ||

“జన్మదినం కావాలి”

-రాఖీ
జన్మదినం కావాలి జగతికే సంబరం
జనుల జేజేధ్వనులే తాకాలీ అంబరం
తరాలెన్ని మారినా తరగనీకు నీ కీర్తి
కావాలి మహిలోన నీవే ఆదర్శమూర్తి
అందుకో ఆనంద అభినందనం
అందుకో అభిమానయుత చందనం
హ్యాప్పీబర్త్ డే టూయూ- హ్యాప్పీబర్త్ డే టూయూ. || జన్మదినం||

1.)పుట్టుకతో ఎవ్వరూ కాలేరు గొప్పవారు
బాల్యంలో అందరూ పెరిగేదీ ఒకేతీరు
క్రమశిక్షణ బ్రతుకైతే నీ భవితే పూలతేరు
లక్ష్యమొకటి తోడైతే నడకే నల్లేరు
అందుకో ఆనంద అభినందనం
అందుకో అభిమానయుత చందనం
హ్యాప్పీబర్త్ డే టూయూ- హ్యాప్పీబర్త్ డే టూయూ . . || జన్మదినం||

2.)గతమంతా ఒకసారి నెమరువేసుకోవాలి
భవిష్యత్తు ప్రణాళికలు సరిచూసు కోవాలి
పట్టుదలా కృషీ నీకు నేస్తాలు కావాలి
అంచెలంచెలుగా నీవే గమ్యాన్ని చేరాలి
అందుకో ఆనంద అభినందనం
అందుకో అభిమానయుత చందనం
హ్యాప్పీబర్త్ డే టూయూ- హ్యాప్పీబర్త్ డే టూయూ . || జన్మదినం||


3.)దయ క్షమ నీకెపుడూ దగ్గరే ఉండాలి
ఇవ్వడానికెప్పుడూ నీవే ముందుండాలి
ఫలితమన్నది ఎప్పుడూ విజయమే కాబోదు
పథమంతా ప్రతిక్షణం ఆనందం చవిచూడు
అందుకో ఆనంద అభినందనం
అందుకో అభిమానయుత చందనం
హ్యాప్పీబర్త్ డే టూయూ- హ్యాప్పీబర్త్ డే టూయూ . || జన్మదినం||

“పూలేల పూజకు”

పూలేల పూజకు నా కన్నులె కలువలు
పూలేల పూజకు నా నవ్వులె మల్లెలు
నీపదముల నిలిపేందుకు నా హృదయమె మందారం
నీ మెడలో వెలిగేందుకు నా మనసే సుమ హారం || పూలేల పూజకు||

అందమైన నాసికయే అదిఒక సంపెంగ
చక్కనైన చెక్కిళ్ళే రోజాల తీరుగ
మెరిసేటి దంతాలే ముత్యాల పేరుగ
అర్చింపగ వేరేల అవయవాలె చాలుగ || పూలేల పూజకు||


నా కరములె నిను కొలిచే కమలాలే అవగా
అవకరములు లేని తలపు మొగిలి రేకు కాగా
నా కంఠమె జేగంటై నీకు హారతీయగా
అర్పిస్తా నా బ్రతుకే నీకై నైవేద్యంగా || పూలేల పూజకు||

“సరిగమ పదనీ”

“రాఖీ గీతమాలిక”
సరిగమాపదమనీ పదముల
కొలిచితి పరిపరి విధముల
వేచితి నీకై యుగముల
వదలను నీ పద యుగముల
బాసరమాతా భారతి
చూపవె నాకిక సద్గతి సరిగమాపదమనీ
1.)ఎందరు నిను కీర్తించినా
ఏమని నిను వర్ణించినా
ఎంతైనా అది తక్కువే
ఎప్పటికీ నువు మక్కువే
స్వరముల నేతా శారదా
వరమొందక మది వేసారదా సరిగమాపదమనీ
2.)చిత్రాలెన్నో గీసినా
కవితలనెన్నో రాసినా
పాటకు ప్రాణం పోసినా
అద్భుత నృత్యం చేసినా
దయసేయవె నా వాణీ
దయసేయగ వీణాపాణీ సరిగమాపదమనీ
3.)విద్యలనెన్నో నేర్చినా
వైద్యము సరి చేకూర్చినా
పరిశోధనలే చేసినా
పరమార్థము సాధించినా
నీ కృప జ్ఞాన సరస్వతి
నీ రూపే మేధా సంపతి సరిగమాపదమనీ