Wednesday, June 17, 2009

ఎరుగని ఓ నగ్న సత్యం ప్రేమా- ఎరిగిన గూఢ రహస్యం ప్రేమా
తెలిసితెలిసీ జనులు ఎందుకో ప్రేమిస్తారు
సాఫీగ సాగే నావను సుడిలోన ముంచేస్తారు
1. ప్రేమ పుట్టుకనే ఎరుగం-ప్రేమ గిట్టుటనే ఎరుగం
నట్టనడిమి సంద్రంలో కొట్టుమిట్టాడుతునే ఉంటాం
ప్రేమ ఒక గమ్మత్తు-అనురాగమే మత్తు
మనచిత్తమన్నది చేయిజారితే భవిష్యత్తే చిత్తు
బయటపడలేని ఉబి ప్రేమైనా-త్రెంచుకోలేని వల ప్రేమైనా
తెలిసి తెలిసీ జనులు ఎందుకో దిగబడతారు
ప్రేమకొరకై మూర్ఖులు వెర్రిగా ఎగబడతారు
2. అందాల హంగులు ఉంటాయి
పరువాల పొంగులు ఉంటాయి
మనసు వయసూ ఎపుడూ దొంగాటలాడుతు ఉంటాయి
విధి వేచి చూస్తుంది-గారడీలు చేస్తుంది
పొరపాటుచేసి ప్రేమిస్తే మన పనిపడుతుంది
ప్రేమ సాలెగూడైనా-ప్రేమే ఉరిత్రాడైనా
తెలిసితెలిసీ జనులు ఎందుకో చిక్కడతారు
భగ్నమైన హృదయంతో బేలగా తలపెడతారు
3. మజ్నూల గాథలు వింటారు
దేవదాసు కథనే వింటారు
అనార్కలిని సమాధిచేయడం-అందరూ ఎరిగే ఉంటారు
కావ్యాలు చదివేస్తారు-కన్నీరు కార్చేస్తారు
తమదాక వస్తేనే కథ మళ్ళీ మొదలెడతారు
ప్రేమ గరళమే ఐనా- ప్రేమ నరకమే ఐనా
తెలిసి తెలిసీ జనులు ఎందుకో తాగేస్తారు
ప్రేమకొరకై అందరు ఎందుకో పడిఛస్తారు
ఆనందమనుకొని తామే వేదనను కొనితెస్తారు................................!!!??
ఊగవే ఊయల-పాడవే కోయిల
మామిడీ కొమ్మాపై-హాయిగా తీయగా
1. నాదాలు నీ గొంతులో-అపురూపమై విరజిల్లగా
రాగాలు నీ పాటలో-రసరమ్యమై రవళించగా
2. అరుదెంచెలే ఆమని- నీ గానమే విందామని
కురిపించెలే ప్రేమని-నీ తోడుగా ఉందామని
3. దాచిందిలే నీ కోసమే-చిగురాకులా అందాలని
వేచిందిలే పలుకారులు- అందాలు నీకే అందాలని
శబరీ భావన మెదలగనే-ఎదలో మొదలగు పులకరము
స్వామిని చూడగ తలవగనే-కన్నులదాగిన కల వరము
1. కొండలైదెక్కి కూర్చొని-దాల్చెనభయ ముద్రని
నవ్వుతు మొరలను విని-నెరవేరుస్తాడు మనవిని
2. తల్లిదండ్రి తానే శబరీశుడు-సద్గురువు తానే దేవదేవుడు
తోడు నీడ తానే మణికంఠుడు-వీడని స్నేహితుడు భూతనాథుడు
3. ఇరుముడి ప్రియుడే అయ్యప్ప-అభిషేక ప్రియుడే అయ్యప్ప
ఓంకార రూపుడు అయ్యప్ప-జ్యోతి స్వరూపుడు అయ్యప్ప
నీ మహిమ పొగడతరమా-షిరిడీశ సాయిరామా
నీ మాయలెరుగ వశమా-జగమేలు సార్వభౌమా
మూఢమతిని-మోక్షార్థిని-జోలె తెఱచి నీ వాకిట
నిశ్చయముగ సుస్థిరముగ విశ్వాసముగ నిలిచితి
1. మనిషి మనిషిలో నిన్నే ఎంచి చూడమంటావు
జీవరాశులన్నీ నీ ప్రతిరూపాలంటావు
సహజీవన సమభావన నువు చాటిన బోధన
మది నిండానువు నిండితె మనిషికేది వేదన
2. దీర్ఘకాల వ్యాధులన్ని చిటికలోన మాన్పేవు
సారమున్న చదువులన్ని క్షణములోన నేర్పేవు
నిత్యబిచ్చగాడినైన కుబేరునిగ చేస్తావు
గుండెలోని భారమంత చిరునవ్వుతొ తీస్తావు
3. అద్భుతాలనెన్నొ జేసి అబ్బురాన ముంచేవు
గారడీలనెన్నొ జూపి వశీకరణ జేస్తావు
మాయా జగమిదియని మా భ్రమలను తొలగిస్తావు
విభూతినీ మాకొసగీ మర్మము నెరిగిస్తావు
జయహో విఘ్నరాజా జయహో మహాతేజ
జయ గిరిజాతనయ జయ మూషిక విజయ
1. మును మాతృమూర్తి కోరిక మీరగ
నిను పిండి బొమ్మలో మలచగ
బ్రహ్మదేవుడే ఆయువు పోయగ
వెలసిన దేవా మహానుభావ
2. తండ్రినెదుర్కొన తనయుడవీవె
భక్తగజాసుర శిరమందితివే
దేవ గణములకు నేతవు నీవై
వెలిగే దేవా గణాధిపా
3. నిండుసభలోన నిన్నుజూడగా
కొంటె చంద్రుడు పకపక మనెగా
చవితి జాబిలిని జూచిన వారికి
నీలినిందలను ఒసగుదువా
4. అఖిలజగమునకు యధిపతి నీవే
శుభముల మాకు కలుగజేయుమా
నీదు పాదముల నెప్పుడు కొలుతుము
విజయము నీయర వినాయకా
అనుక్షణం నా మదిలో- మెదులునులే నీతలపు
అదిపిలుపై మేలుకొలుపై- తెలుపునులే నావలపు
1. ఎదలోని ఊసులన్ని గాలితోటి కబురంపాను
నా ప్రణయ సందేశాలు మేఘాలకు అందించాను
అవి నిన్ను చేరులోగా -విరహాలు మదిలోరేగా
తాళలేక మానలేక మరిగిపోయాను-నేను
కన్నీరై కరిగిపోయాను
2. ఆకసాన నీవున్నావని -నింగికినే నిచ్చెన వేసా
నిన్ను చేరు ఆరాటంలో-విరిగిన నా రెక్కలు సాచా
స్వప్నాలు దూరమాయే-సత్యాలు భారమాయే
చావలేక బ్రతకలేక సతమతమై పోయా
నే జీవశ్చవమైనా
3. నీటిలోని ప్రతిబింబాలే -నిజమనినే భ్రమపడినాను
అందరాని సౌందర్యాలకు-అనవసరపు శ్రమపడినాను
కనుగీటితె మోసపోయా చిరునవ్వుకు బానిసనైన
ఇదే నేస్తం ప్రేమతత్వం బ్రతుకు సత్యం తెలుసుకున్నా
పొరపాటులు దిద్దుకున్నా
నా మది పాడిన ఈగీతం
వేసవిలోనా హిమపాతం
ఆశల శిఖరాల దూకిన జలపాతం
అమితానందపు శుభ సంకేతం
1. ఆకులు రాలే శిశిరములోనా
ఆమని పాడే ఋతుగీతం
విరహిణి చకోరి తృష్ణను తీర్చే
జాబిలి పాడే అమృతగీతం
2. మోడులనైనా చిగురింపజేసే
తొలకరి పాడే జీవన గీతం
యమునాతటిలో యెడబాటునోపక
రాధిక పాడే మోహన గీతం
3. ఏతోడులేని ఏకాకి కొరకే
కోకిల పాడే స్నేహ సంగీతం
స్పందన ఎరుగని కఠినపు శిలకే
ప్రణయము నేర్పిన పరవశ గీతం
మణికంఠ నీ దివ్య గీతార్చనం
స్వామీ మా మదిలోన దర్శింతుము
శబరీశ నీ భవ్య సంకీర్తనం
మైమరచి నోరార భజియింతుము
1. విఘ్నేశుడే నిన్ను రమ్మని ధ్యానించె
హిమవంతుడే హృదయాసనమందించె
అష్టదిక్పాలురే అర్ఘ్యపాద్యాలనిచ్చిరి
గంగమ్మ నిన్నింక జలకమ్ములాడించె
2. శ్రీలక్ష్మి వస్త్రాలు ధరియింపజేసే
గాయిత్రి యజ్ఞోపవీతమ్మునిచ్చె
గోవిందుడే నీకు చందనమ్ము పూసే
పరమేశుడే నీకు భస్మాన్ని రాసే
3. వాగ్దేవి కుసుమాల మాలలే వేసే
బ్రహ్మ-అగ్నిలు ధూపదీపాలు వెలిగించె
పార్వతీమాతయే నైవేద్య మందించె
నాగరాజు తాంబూలమిచ్చే-షణ్ముఖుడు హారతులు పట్టే
4. సప్తఋషులే వేద మంత్రాలు చదివిరి
నవగ్రహములు పాదసేవలు జేసిరి
నారదుడు తుంబురుడు గానాల తేల్చిరి
నందియూ భృంగియూ నాట్యాలు చేసిరి
ప్రేమ స్వరూప షిర్డీ బాబా
శాంతి ప్రదాతా హే సాయిబాబా
నీపదసేవ నిరతము జేసెద
కలలో ఇలలో నిను మది నమ్మెద
1. క్షణికానందము ఈ భవ బంధము
నీవే సత్యము నిత్యానందము
నీవే పావన గంగాతీర్థము
నీవే సాయి బ్రహ్మపదార్థము
2. పొరపాటుగను పొరబడనీయకు
అరిషడ్వర్గపు చెఱ బడవేయకు
పంచేంద్రియముల చంచల పఱచకు
మోహకూపమున నను ముంచేయకు
నిను నమ్మిచెడలేదు ఏనాడు
నిను అర్థించి నే భంగపడలేదు
వరదాభయ హస్త సిద్ధివినాయక
వేరెవరు నిను వినా దిక్కునాకిక
1. నీ మాయలే ఈ ఇహలోక సౌఖ్యాలు
నీ లీలలే కడు ఇడుములు బాధలు
చాలించవయ్యా ఈ వింత నాటకం
తెరిపించవయ్యా ప్రభో నా కనులు తక్షణం
2. నీ నామ గానాలు ముక్తి సోపానాలు
నీ అర్చనతొ సడలు భవబంధనాలు
అందుకోవయ్య నా హృదయాంజలి
ఆదుకోవయ్య నన్ను పరమ దయాంబుధి