Saturday, August 15, 2009

అష్టాదశ సోపానములే-భువినవి స్వర్గ సోపానములే
చేయూతనిచ్చుట కొరకై-అయ్యప్ప శబరిలొ ఉన్నాడు కొలువై
1. కారం లవణం మధురం-కామం క్రోధం మోహం
వగరు పులుపు చేదు-లోభం మదము మత్సరం
అరిషడ్వర్గపు అస్త్రాలు-అవియే కాదా షడ్రుచులు
2. కన్నూ ముక్కూ జిహ్వా-అగ్నీ గాలీ నీరూ
దేహ చర్మము చెవులు-పుడమీ ఆకాశములు
ప్అంచేంద్రియముల నిగ్రహము-పంచభూతముల అనుగ్రహము
3. గజముఖ షణ్ముఖులను కొలువు-అహము దర్పములను గెలువు
గుణత్రయమ్మును జయించవలెనా-దత్తాత్రేయుని కొలువు
గాయత్రి సాధనతోనే అవిద్య అన్నది తొలుగు
అయ్యప్ప శరణం కోరు బ్రహ్మ విద్య చేకూరు
ఎదవాకిలి నిర్దయగా –ఎందుకు మూసావు నేస్తం
మొహమ్మీదె కఠినంగా-తలుపులు వేసావు నేస్తం
జోలెతెఱచి నీ గుమ్మంలో- స్నేహార్తితొ నిలుచున్నా
ఏనాడైన కరుణిస్తావని-ఆశగ నే చూస్తున్నా
ఓ ప్రియ నేస్తమా –ఓనా సమస్తమా

1. రాయిలాగ ఉన్న నన్ను-సానబెట్టి రత్నం చేసావు
మోడులాగ బ్రతికే నన్ను-చిగురులు తొడిగింప జేసావు
అడుగులింక తడబడుతున్నా-నీ చేయి విదిలించేసావు
సంబర పడు నంతలోనే-ముఖం నువ్వు చాటేసావు
ఓ ప్రియ నేస్తమా –ఓనా సమస్తమా

2. మూలబడిన వీణను సైతం-ముచ్చటగా పలికించావు
చినుకులేని ఎడారిలోనా- సెలయేరులు పారించావు
కళ్లముందు విందు ఉన్నా- నా నోరు కుట్టేసావు
అంగలార్చి అర్థించినా-బధిరురాలి వై పోయావు
ఓ ప్రియ నేస్తమా –ఓనా సమస్తమా
దేవుడు నాయందుంటే బ్రతుకు పూలపానుపు
ఆతని దయ ఉంటే దేనికింక వెఱపు
జగన్నాటకంలో పాత్రధారి నేను
అడుగడుగున నను నడిపే సూత్రధారి తాను
1. అంతా నేననే అహంకారమెందులకు
అంతా నాదనే మమకారమెందులకు
చింతవీడి శ్రీకాంతుని చిత్తములో నిలిపితే
తానంతట తానుగానె సొంతమై పోతాడు
2. పుట్టినపుడు వెంటతెచ్చిన ఆస్తిపాస్తులేవి
గిట్టినపుడు కొనిపోవ అస్తికలూ మిగలవేవి
నట్టనడి జీవితాన లోభత్వమెందుకు
మూడునాళ్ళ ముచ్చటకే మిడిసిపడుట ఎందుకు
3. నౌకనెక్కి భారమంత తనపైన వేస్తెచాలు
ఆవలిదరి తానే అవలీలగ చేర్చుతాడు
ప్రతిఫలమాశించక నీ పని నువు చేస్తె చాలు
ప్రతి క్షణము కనురెప్పగ మనల కాపాడుతాడు