Friday, November 13, 2009

'మా తా’పాలకే పరితపించి పోతున్నా
'నీ రూ’పాలకే నే చిక్కిపోతున్నా
గుక్కపట్టి ఏడ్చినా లెక్క చేయవేమమ్మా
అక్కున నను చేర్చుకొని నా ఆకలితీర్చవమ్మ
1. సాహితి సంగీతములు చనుదోయె కదనీకు
స్తన్యమీయ వేమమ్మా కడుపారగ ఈ సుతునకు
అర్ధాంతరముగనే అరకొఱగా గ్రోలగనే
నోరుకట్టివేయగా నీకు న్యాయమా
మాటదాటవేయగా నీకు భావ్యమా
2. అమ్మవు నువు కాకపోతె నాకెవ్వరు దిక్కమ్మా
అమ్మా దయగనకపోతె అనాధనే నౌదునమ్మ
మారాముచేసినా గారాలుపోయినా
నీ వద్దనేగదా మన్నించవమ్మా
నీ చెంతకే నన్ను చేరదీయవమ్మా
3. కొందఱు నీ కరుణతో కవిపుంగవులైనారు
ఇంకొందఱు నీ కృపతో గానశ్రేష్ఠులైనారు-సంగీత స్రష్టలైనారు
వాగ్గేయకారులైన వారిదెంత భాగ్యమో
నీ పదములు సాధించగ చేసిరెంత పుణ్యమో
నీ వరములు ప్రాప్తించగ బ్రతుకెంత ధన్యమో
నా బ్రతుకెంత ధన్యమో