Saturday, November 13, 2010

మనసున మనసై...

మనసున మనసై...

గాలికిపెట్టిన ముద్దు-నీ చెంపను తాకిందే
నన్నే తాకిన నీరు- నీ వొంటిని తడిపిందే
నాపైవాలిన సీతాకోక చిలుక నీ చెక్కిలి నిమిరిందే
నే పట్టిచూసిన కొత్తకోక నీ తనువును చుట్టిందే
తప్పుఅనిఅనగలవా-తప్పుకొని మనగలవా
తప్పనిసరి తోడైనప్పుడు-తప్పించుకొనగలవా

1. కాటుకై మారినేను కంటికే అందమిస్తా
హారమై మెడలోచేరి మేనుకే వన్నె తెస్తా
శిరోజాల రోజాపూవై సొగసులే పెంచేస్తా
చెవులకే జూకాలై సోయగాల నందిస్తా
తప్పుఅనిఅనగలవా-తప్పుకొని మనగలవా
తప్పనిసరి తోడైనప్పుడు-తప్పించుకొనగలవా

2. చేతులకు గాజులుగా సొబగులే కలిగిస్తా
పాదాల మంజీరాలై నాదాలు పలికిస్తా
మనసులోమనసును నేనై నిన్నంత ఆక్రమిస్తా
మోవిపై చిలిపినవ్వునై కడదాక నివసిస్తా
తప్పుఅనిఅనగలవా-తప్పుకొని మనగలవా
తప్పనిసరి తోడైనప్పుడు-తప్పించుకొనగలవా

నిను వీడని నీడను

నిను వీడని నీడను

నువు వద్దని అంటూనే ఉన్నా- నీ వద్దనె నేనుంటున్నా
చీదరించుకొన్నాగాని-ఛీత్కరించు కొన్నగాని
చూరుపట్టుక వ్రేలాడుతున్నా-నీడ లాగ వెంటాడుతున్నా

1. అపోహలోనే బ్రతికేస్తున్నావు- అపార్థాలకే తావిస్తున్నావు
ఊహకు మాత్రమె పరిమితమన్నా
బంధం నమ్మకున్నావు-భయం పెంచుకున్నావు
నీ తప్పేం లేదులే చుట్టూ లోకం అలాంటిది
నీ యోచన అంతేలే-నీ వయసే ఎదిగీఎదగనిది

2. తాడు చూసి తత్తరపడకు-పామనుకొని బిత్తరపోకు
పసుపుతాడు కాబోదు ఉరితాడసలేకాదు
మనసిచ్చేస్తాడు కడదాకా-తోడొచ్చేస్తాడు
కంటికి రెప్పలా వీడు కాపాడుతాడు
ఎందుకో తెలియదులే పూర్వజన్మ బంధమేమో
ఎప్పటికిక తేలునొలే-బదుల్లేని ప్రశ్నేనేమో