Monday, April 11, 2011

శ్రీరామ నవమి శుభాకాంక్షలతో------ గీత రామాయణం

శ్రీరామ నవమి శుభాకాంక్షలతో------
గీత రామాయణం
రామా అతులితము నీ ప్రేమా
శ్రీ రామా స్నేహానికి నీవే చిరునామా
కదలాడే జీవకారుణ్యమా-దరిజేర్చే పుష్పక విమానమా

1. మునివర్యుల యాగం కావగ-తాటకిని వధియించావు
మునిపత్నికి శాపం బాపగ-నీ పాదం తాకించావు
హరుని విల్లు విఱిచి వేసి-మైథిలినే వరియించావు
పరశురాము ప్రజ్వల తేజం-ప్రసన్నంగ హరియించావు

కమనీయం సీతారామ కళ్యాణం-జరిగింది జరిగింది లోకకళ్యాణం||

2. తండ్రిమాట దాటక నీవు-రాజ్యాలను త్యజియించావు
బ్రతుకునావ సరంగువైనా-గుహుడి పడవన పయనించావు
మాయలెరిగిఉన్నాగాని-లేడినడుగ మన్నించావు
మామూలు మనిషిలాగా-సీతకొఱకు విలపించావు

రామరామరామ సీతా రామరామ రాం-ప్రేమ మీరగ మమ్ముగాచే నీలమేఘశ్యాం||

3. జానకి జాడకోసం అవని అంత గాలించావు
జటాయువే కబురు తెలుపగా-కిష్కిందకు అఱుదెంచావు
సుగ్రీవుతొ మైత్రి చేసి-వారధినే నిర్మించావు
ఉడతనైన హనుమనైనా-ఆదరించి అక్కునచేర్చావ్

శ్రీరామ లక్ష్మణ జానకీ-జై బోలోహనుమాన్ కీ||

4. జలధిని లంఘింపజేసి-మారుతినే లంకకు పంపావ్
సీత జాడతెలిపిన హనుమకు-హృదయము లో చోటునిచ్చావ్
అల్పమైన వానరమూకతొ-రావణున్ని కాటికి పంపావ్
అరిసముడైనగాని-శరణంటే ఆదరించావ్

రఘుపతిరాఘవ రాజారాం-పతితపావన సీతారాం||