Monday, July 23, 2012

తిప్పల రెప్పలు


చెప్పిన మాట వినవు-కనురెప్పలదెంత హఠము
వద్దని వారిస్తున్నా -నిద్దుర కొరకే..తగవు
కలనైనా..కననీవు-తలపులసలు రానీవు
మూయాలనుకొంటే..మూతలు పడవు
తెరవాలనుకొంటే..ఎ౦తకు విడివడవు

1. భువిభారం మోయునట్లుగా.. ధనగారం..దాయు నట్లుగా
కను స్వేచ్ఛను కాయునట్లుగా...తము ధర్మం తప్పనట్లుగా
సైనికులై పహారాలే..వేస్తుంటాయి..పాలకులై. కట్టడులే చేస్తుంటాయి
కలనైనా..కననీవు-తలపులసలు రానీవు
తెరవాలనుకొంటే..ఎ౦తకు విడివడవు||

2. అలసిన *కుడి సేదదీరగా..విచలిత మది విశ్రమించగా
వేదనలలో ఊరడిల్లగా..ఇహపరముల కతీతమ్ముగా
కోరుకున్న వారినీ..లేక్కచేయవు –వేడుకున్నా ఏమాత్రం చెవిని పెట్టవు
కలనైనా..కననీవు-తలపులసలు రానీవు
మూయాలనుకొంటే..మూతలు పడవు||

3. ప్రేమికులతొ పగలే బూను ..రోగులకూ..వైరుల తీరు
విద్యార్థుల కిల విరోధులే..రసికుల పాలిటి రిపులే
విద్యుక్త ధర్మాన్నీ విస్మరించ లేవు...సందర్భ సహితంగా ప్రవర్తించలేవు
కలనైనా..కననీవు-తలపులసలు రానీవు
మూయాలనుకొంటే..మూతలు పడవు
తెరవాలనుకొంటే..ఎ౦తకు విడివడవు

*కుడి = శరీరం..దేహము..