Monday, October 19, 2015

చేరినంతనే స్వామీ -నీ –చరణాల చెంత
మనసుకెంత నిశ్చింత - మనసుకెంత నిశ్చింత
అర్పించినంతనే-స్వామీ నీకు -నా భార మంతా
ఎంత హాయి బ్రతుకంతా - ఎంత హాయి బ్రతుకంతా
1. ఎడారి దారిలోనా – ఒయాసిస్సు వౌతావు
అమావాస్య నిశిలోనా-పున్నమి శశి వౌతావు
ఆశలు అడుగంటిన వేళా- అదృష్టము నీవౌతావు
వేడినంతనే స్వామీ వెన్నుదన్ను వౌతావు
2. తుఫానులో చిక్కిన నావను – తీరానికి చేరుస్తావు
దారితప్పి తిరుగుతుంటే- మార్గదర్శి వౌతావు
ఆశలు అడుగంటిన వేళా- అదృష్టము నీవౌతావు
వేడినంతనే స్వామీ వెన్నుదన్ను వౌతావు
3. బీడుపడిన నేలకు నీవే-వాన చినుకు వౌతావు
మోడైన మ్రానును సైతం –చివురులు వేయిస్తావు
ఆశలు అడుగంటిన వేళా- అదృష్టము నీవౌతావు
వేడినంతనే స్వామీ వెన్నుదన్ను వౌతావు
4. నిర్లక్ష్యపు జీవన గతిలో-నా లక్ష్యం నీవే స్వామీ
చిక్కుబడిన భవ బంధాలకు-మోక్షమింక నీవే స్వామీ
ఆశలు అడుగంటిన వేళా- అదృష్టము నీవౌతావు
వేడినంతనే స్వామీ వెన్నుదన్ను వౌతావు

Saturday, October 3, 2015

తీయనిదొక్కటే....అమ్మ అన్న పదము..
తీరని దొక్కటే..కన్న తల్లి ఋణము..
అమ్మ ప్రేమ కేది లేదు కొలమానము..
అమ్మ త్యాగ ఫలితమే..దేహము ప్రాణము
అమ్మంటేనే...అనురాగము
అమ్మకు మారు పేరు త్యాగము....

1.      1.) జబ్బు పడినప్పుడల్లా..అమ్మేగా..డాక్టరు..
కునుకైనా తీయకుండ సేవచేయు సిస్టరు..
చిట్కా వైద్యాలు..దిష్టి తీయడాలు..
మెడలో తాయెత్తుకట్టి..నుదుటన విభూతి పెట్టి
జాతకాలు చూపెట్టి..గ్రహ శాంతులు చేపించి
ముక్కోటి దేవుళ్ళకు ముడుపుకట్టు...ఆరాటము
నయమయ్యే వరకు..అనునయించు..వైనము..
అమ్మంటేనే...అనురాగము
అమ్మకు మారు పేరు త్యాగము....

2.   2)    ఏ తప్పు నువ్వు చేసిన..తనపైన వేసుకొనే లయ్యరు
గుడ్డిగా నీ తరఫున వకాల్తా పుచ్చుకొననే లాయరు
పోపుల పెట్టెలోన దాపెట్టిన డబ్బులిచ్చి
నీ తండ్రి దండనకు అడ్డునిల్చి తా భరించి
అరికాలు నొవ్వకుండ-ఈగ వాలనివ్వకుండ
కంటికి రెప్పలాగ కాచిన..మమకారము
నోముల పంటగా..చేసిన ..గారాబము
అమ్మంటేనే...అనురాగము
అమ్మకు మారు పేరు త్యాగము....