Saturday, July 18, 2009

తెంచుకుంటె తెగిపోయే బంధం కాదు
పారిపోతె వదిలేసే పాశం కాదు
స్నేహ పాశము-అనురాగ బంధము
1. తెరవేస్తే మరుగయ్యే దృశ్యం కాదు
తెలివొస్తే కరిగేటి స్వప్నం కాదు
జీవ చిత్రము-ఇది నగ్న సత్యము
2. మందువేస్తె మానేటి గాయం కాదు
పంచుకుంటె తీరేటి వేదన కాదు
నా మనోవేదనా- ఈ నరక యాతన
3. నా మార్గమెన్నటికీ పూలబాట కాదు
నా పయనానికి గమ్యంలేదు
అంతులేని పయనం-ఆగిపోని గమనం
ఆశలు పూచే పూదోటలలో
తుమ్మెద పాడే ఆ పాటలలో
వినిపించును ఈ రాగం- కనిపించును ఈ భావం
అందాలొలికే విరి తావులలో
తుమ్మెదవాలే పువ్వుల ఎదలో
నినదించును ఈ భావం-కనిపించునులే జీవం
1. పొదల మాటున దాగిఉన్న నిన్ను చూసింది నేనే
ఎడద చాటున దాచుకొంటావనుకున్నానే
నే మొదటవాలింది నీపైనే-మధువు గ్రోలింది ఆపైనే
2. ఇటువంటి మాటలు విన్నవారు మోసపోయారు
అందుకేలే నేను కూడ ఆశ వీడాను
నే పూవుగ మారింది ఈ పూటనే-మొదటవిన్నది నీ పాటనే
3. ఆకతాయి తుమ్మెదనసలే కానునేను
ఎవ్వరు చూడని నిన్ను నేను చూసి వలచాను
రంగులువద్దు-అందం వద్దు-ఆమాటకొస్తే మకరందం వద్దు
4. నిన్ను నమ్మి నీ మాట నమ్మి నీదాననైనాను
నావారనువారందరినీ వీడి నీసొంతమైనాను
నాసొగసులన్నీ నీకోసము-దాచి ఉంచాను మకరందము
5. నేను నీవాడనైతే చాలు-నువ్వు ఊ( అంటె పదివేలు
ఆదర్శనీయము మనబంధము-మనజంట జగతికె ఒక అందము
నీ నామమే దివ్య మంత్రం
స్వామి అభిషేక ఆజ్యమె ఘన ఔషధం
దీక్షాను భూతియె ఒక అద్భుతం
జ్యోతి దర్శనం పరమాద్భుతం
1. కరములు మోడ్చెద అవకరము తొలగించు
శిరమును వంచెద అవసరములీడేర్చు
సాష్టాంగ ప్రణతులు ఇష్టంగజేసెద
కష్టాలు నష్టాలు కడతేర్చ మనెద
2. పాదములొత్తెద వ్యాధులు మాన్పించు
ప్రార్థనజేసెద బాధలు పరిమార్చు
స్వామియే శరణమని మనసార పలికెద
నీవే నాకిక దిక్కని మ్రొక్కెద
ఎంతగానో వేడుకున్నా
మనసించుకైనా కరుగదా
సాయినీవే నాకు దిక్కని
విలపించు నామొర నాలకించవ
1. సాయి నీ హృదయమే
దయా సాగరమ్మని జనులందురే
నేను చేసిన నేరమేదో
ఎరిగించరాదా ప్రేమ మూర్తీ
2. జపములెరుగను తపములెరుగను
పూజలూ ఏ భజనలెరుగను
సాయిరాం శ్రీ సాయిరామను
దివ్య నామము మదిని మరువను
3. వేదమెరుగని వెర్రివాడను
మోదముగ కరుణించరావా
రాగమౌ రసయోగమౌ పరభోగమౌ
నీ పాదమును దయసేయవా
ఎన్నెన్ని కుసుమాలు నేలరాలిపోయాయో
ఎన్నెన్ని మణిపూసలు చేయి జారి పోయాయో
ప్రభూ! ఒక్కటైన నీ పూజకు దక్కలేదు స్వామీ
ఒక్కటైన ఈ రోజుకు చిక్కలేదు స్వామీ
1. సూరీడు రాకమునుపె కలువలు కోద్దామని
కొలనుగట్టు కేసి నే తొరతొరగా తరలితిని
ప్రభూ!ఒక్క కలువ పూవైనా కనకపోతినే స్వామీ
చుక్కబొట్టు నీళ్ళైనా చూడనైతినే స్వామీ
2. తోటమాలి లేకమునుపె మల్లెలు తెద్దామని
తోటలోకి ఇందాకనె పొంచిపొంచి వెళ్ళితిని
ప్రభూ!మల్లెపొదలు ఎన్నెన్నో మాడిపోయినయి స్వామీ
మల్లెపూవులెన్నెన్నో వాడిపోయినవి స్వామీ
3. గుండెలోన నీకే గుడి ఒక్కటి కట్టినాను
అందులోన నిన్నే కూర్చుండబెట్టినాను
ప్రభూ! నాకన్నుల కలువపూల మాలలివిగొ స్వామీ
నా నవ్వుల మల్లెపూల జల్లులివిగొ స్వామీ
4. ఎన్నెన్ని రోజులిలా నిరుపయోగ మైనాయో
ఎన్నెన్ని క్షణాలిలా వృధాగ కరిగి పోయాయో
ప్రభూ!ఇకనైనా నీలో నను కలుపుకో స్వామీ
ఇపుడైనా నాలో నువు నిలిచిపోస్వామీ