Saturday, July 31, 2010

ప్రణయ ప్రాణం-హృదయ గానం

ఎంత చిన్నదీ...ఈ గుండె
విశ్వమంత దీనిలోనె దాగుండె
ఎంత మర్మమైనదీ ఈ మనసు
అంతు చిక్కలేకున్నది తన ఊసు

1. చూడబోతె ఎద చేసే ఆపని ఆ పనితీరు
తీరికే దొరకదని ఎవరైనా నమ్మితీరు
ఎడదే మారితె ఏమారితే చాలుక్షణాలు
హరీమంటాయి కదా మనిషి ప్రాణాలు
స్నే-హానికి ఎందుకు చేయిసాచునో మరి
బంధానికి తానెలా బంధీ యగునొగాని
ఉల్లమెల్ల తెలుసుకోగలమా మనము
గుంబ(న)మే ఎల్లరకు ఈ మనము

2. నిరంతరం డెందము చేస్తుంది ఘోరతపం
లబ్ డబ్ అనునదే తనుచేయు మంత్ర జపం
జరిగిపోతె ఎపుడైనా మదికి తపోభంగం
తక్షణమే అయిపోదా నీర్జీవమై దేహం
ప్రేమవైపు ఎప్పుడు దృష్టి సారించునో
అనురాగం అను రాగం ఎపుడు ఆలపించునో
ఎరుగలేము ఎవరము దీనిమాయ
చిత్రమే కదా సదా హృదయ లయ

Thursday, July 29, 2010

“త్రిశంకు స్వర్గం”

ఎందుకు కన్నెర చేస్తావో- ఎందుకు వరముల నిస్తావో
ఎరుగడు విధాత సైతం
ఎప్పుడు నవ్వులు పూస్తావో- ఎప్పుడు గుండెను కోస్తావో
తెలియదు పరమాత్మకేమాత్రం
1. ఏదైనా కోరానా-పరిచయాని కంటే క్రితము
తపస్సులే చేసానా-నువ్వెదురు కాక పూర్వం
దారిన పోయేవాడిని-దగ్గరగా తీసావ్
దగ్గరైపోగానే-నిర్దయగా నను తోసేసావ్
ఏమిబంధమో నీది-యమపాశం కన్నా గట్టిది
ఏమి తత్వమో నీది-పాదరసం కన్నా మెత్తది
2. నిజాయితీ అన్నపదం-నిఘంటువులొ లేకుంటే
విశ్వాసం అన్నమాట-అర్థరహితమని నువ్వంటే
నీ వాదనలౌతాయి-నిత్యసత్యాలు
నీ సిద్ధాంతాలన్నీ-స్వాతి ముత్యాలు
జీవిత పరమావధి-కాలక్షేపమా నీకు
విలవిలలాడే హృది-హస్యాస్పదమని అనుకోకు

Sunday, July 25, 2010

వందే జగద్గురుమ్ - గురుపౌర్ణమి శుభాకాంక్షలు!!.

వందే జగద్గురుమ్
గురుపౌర్ణమి శుభాకాంక్షలు!!
సాకి:
గురువులకు జగద్గురువీవనీ...
గురువారమ్మని పిలిచితి గురువా!... రమ్మనీ
పల్లవి:
ఓం సాయిరాం షిర్డీ సాయిరాం
ఓం సాయిరాం ద్వారకమాయి రాం
అనుపల్లవి:
మాయలు చేసి భ్రాంతిలొ ముంచీ
నీ నుంచి దూరముంచుతావేమయా...ఓ..ఓ..||ఓం సాయిరాం||
చరణం1.
చపలమైన చిత్తమూ-చేయనీదు ధ్యానము
వగలమారి నేత్రమూ-కనదు నిన్ను మాత్రము
పూర్వజన్మ పుణ్యమూ-ఎరుగనంది ప్రాణము
చేతనైన సాయమూ-చేయకుంది దేహము
నా మాటే వినకుందీ- నా ప్రతి ఇంద్రియము
నీ దీవెన లేకుంటే పొందను ఏ జయము
కరుణాంతరంగ పాహి పాహిమాం || ఓం సాయిరాం||
చరణం2.
నిన్నే నమ్ముకుంటినీ- నడవలేని కుంటినీ
చేయిపట్టి నడిపించమని-నిన్ను వేడుకుంటినీ
దారులన్ని మరిచాను-బేజారై నిలిచాను
అంధకార మార్గమంతా-ఆతృతగా వెతికాను
నీవే పరంజ్యోతివని-సత్యము నెఱిగితిని
దారే చూపించమని-నిత్యము కోరితిని
శరణాగతావనరావె-వేగమే || ఓం సాయిరాం||

Wednesday, July 21, 2010

“అప్రమేయం”

“అప్రమేయం”
జాబిలికీ..నేలమ్మకు..ఏ బంధం ఉందని... ఈ అనుబంధం
వెన్నెల అడవిగాచినా...గాని ..భ్రమణం ఆగిపోదు ఎందుకని..?
లహరికీ.. కడలికి యే చుట్టెరికం ఉన్నదని..ఈ మమకారం
తనరంగు రూపు రుచీ మారినగాని..లయమై కొనసాగుట దేనికని?
విధి వేసిన చిక్కుముడులు ఎవరు విప్పలేనివి..
కాలం పొడుపు కథలు..విప్పిచెప్పలేనివి..
1. కోరుకున్న వారిని అమ్మగా పొందగలమ
ప్రయత్నించి గొప్పింట్లో జన్మించగలమా
అనుకొన్నవన్నీ అయిపోతాయనుకొంటే
పెళ్ళిళ్ళు స్వర్గంలో జరుగుట యెందుకని?
తలచినవేజరిగే వెసులుబాటు మనిషికుంటే
ఇన్ని ఆత్మహత్యల ఆంతర్యమేమిటి?
విధి చేసే గారడీలు వింతయే కదా
కాలం ఇంద్రజాలం విడ్డూరమే సదా

2. జీవన యానంలో తారస పడునెవ్వరో
చితి చేరే ఈయాత్రలో కడదాకా తోడెవరో
ఎదురైన ప్రతివారితొ..కబురులాడ మనతరమా
మాటా-మంతి తో బంధాలు వేయగలమ
మాయజేసి అనుబంధం కొనసాగించగలమ
అవకాశమె లేనిదాన్ని అందిపుచ్చుకొనగలమా
విధి ఆడే నాటకాలు..చిత్రమే మరి..
కాలం ప్రవహ్లికలు కష్టమే మరి..