Sunday, August 29, 2010

“కృతి ఆకృతి”

సరిగమపదనీ సంగీతము
ఏడాదంతా వాసంతము
పంచమ స్వరమున కోయిలగానం
ఎడారి ఎదలో బృందావనం

1. వాణీవీణా తంత్రులలోనా-జనియించినదీ స్వరగంగా
నారదతుంబుర గాత్రములోనా- ధర దరి జేరెను సురగంగా

ఎంతగ్రోలినా తీరదు తపనా-అమృత సమమీ రసగంగా
ఆలపించినా ఆలకించినా-బ్రతుకే మారును స్వర్గంగా

2. శ్రమజీవి బడలిక కుపశమనమిచ్చె-దివ్యౌషధమీ గాంధర్వము
అలసిన మనసును అనునయించే-సరిలేని నేస్తమీ స్వరసప్తకము

దిక్కేతోచని దీనుల పాలిటి-మార్గదర్శి ఈ బయకారము
ఇహలొ రక్తికి పరములొ ముక్తికి-ఏకైక సాధనమీ సామగానము

Monday, August 23, 2010

“రాఖీ” పౌర్ణమి-రక్షా బంధన దినోత్సవ శుభాకాంక్షలతో.....

అన్నాచెల్లీ అనుబంధం-ఎన్నడువాడని సుమగంధం
అన్నాచెల్లీ అభిమానం-ఆత్మీయతకిల సంకేతం
కలకాలం నిలిచేది రాఖీ బంధం
కలనైన వీడనిదీ రక్తబంధం

1. స్వార్థమెరుగనిది-స్వఛ్ఛమైనది
పాపమెరుగనిది-పావనమైనది
కపటమెరుగనిది-సత్యమైనది
కాలంవలె ఇది-శాశ్వతమైనది
కలకాలం నిలిచేది రాఖీ బంధం
కలనైన వీడనిదీ ఆత్మబంధం

2. ఆపదలోనా ఆదుకుకునేది
వేదననంతా పంచుకునేది
అనురాగానికి ఆలయమైనది
త్యాగానికి ఇది అంకితమైనది
కలకాలం నిలిచేది రాఖీ బంధం
కలనైన వీడనిదీ రక్షాబంధం

Friday, August 20, 2010

గీటురాయి

కోహినూర్ కేమెరుకా-తన వెల యెంతో
తాజ్ మహల్ కేమెరుకా-తన విలువెంతో
కోయిల కేమెరుకా-తన పాట కమ్మదనం
విరుల కేలా తెలిసేను-మకరందపు తీయదనం

ప్రాజ్ఞులు మాత్రమే గుర్తింతురు ప్రతిభ
అభిరుచి గలవారే కీర్తింతురు ఘనత

1. మేఘమెపుడు గమనించునొ-బీడుల దాహార్తిని
వర్ష మెలా గుర్తించునొ-మోడు జీవితేఛ్ఛని
కరిగిపోవు కాలమెపుడు-హారతి కర్పూరం
తిరిగిరాని గతమెప్పుడు-చేజారిన మణిహారం

ప్రాజ్ఞులు మాత్రమే గుర్తింతురు ప్రతిభ
అభిరుచి గలవారే కీర్తింతురు ఘనత

2. ఎడారిలో బాటసారి-ఎండనెలా మెచ్చగలడు
హిమవన్నగ పరిసరాల-శిశిరమెలా ఓర్చగలడు
అనువైనపుడె కదా-ఆనందం సొంతం
అనుభూతుల అస్వాదనె-జీవిత పరమార్థం

ప్రాజ్ఞులు మాత్రమే గుర్తింతురు ప్రతిభ
అభిరుచి గలవారే కీర్తింతురు ఘనత

Thursday, August 19, 2010

సౌందర్య లహరి

చంద్ర వదన అందామా-మచ్చలేని అందమాయె
దేవకన్య అందామా-ఇలలో ప్రత్యక్షమాయె
పోలికే లేదు నీ అందానికి నాదృష్టిలొ
ఎవరికైన నీవేలే ఉపమానం ఈ సృష్టిలొ

1. ఎదుటనీవు కనబడితే-ప్రతి యెదలో ప్రమోదాలు
చూపు తిప్పుకోలేకా-దారంటా ప్రమాదాలు
నిన్నుచూస్తు బ్రతుకంతా హాయిగా గడపగలను
నీ చిన్ని నవ్వుకొరకు-ఏడు జన్మలెత్తగలను

పోలికే లేదు నీ అందానికి నాదృష్టిలొ
ఎవరికైన నీవేలే ఉపమానం ఈ సృష్టిలొ

2. కనులముందు నీవుంటే-వాల్చలేను రెప్పలైన
కలనైనా కలతువంటె-నిద్రిస్తా ఎప్పుడైన
క్రీగంటి నీచూపుకు-నూరేళ్లు ధారపోస్త
నువు చేయి అందిస్తే-చావునైన ఎదిరిస్తా

పోలికే లేదు నీ అందానికి నాదృష్టిలొ
ఎవరికైన నీవేలే ఉపమానం ఈ సృష్టిలొ

Wednesday, August 18, 2010

నవ్వుల నజరాన-నువ్వు నా జీవితాన

పాలనురుగు నీ నవ్వు-పసిడి మెరుగు నీ నవ్వు
పరవశాన నీ నవ్వు- పరిమళాలు రువ్వు

1. ముత్యాలు కోరుకొని –అగాధాల శోధనేల
నీ పెదవుల ముంగిలిలో-ఏరుకొంటె పోలా
రతనాల రాశులకై-గనులు త్రవ్వనేల
నీ వదన సీమలో-దొరుకుతాయి చాలా

సరిగమలే పలుకుతుంది- నీ నవ్వుల వీణ
నీ నవ్వులకేది సాటి- నువ్వే ప్రవీణ

పంచదార నీనవ్వు-తేనె ధార నీ నవ్వు
నీ నవ్వుల రుచి మరిగితె- నా నరాలు జివ్వు

2. విషాదాలు మరచుటకై-మత్తు మందు అవసరమా
నీ హర్ష మధువులో-ఓలలాడి పోమా
ఆహ్లాదం పొందుటకు-చందమామ ముఖ్యమా
నీ హాస చంద్రికలే-బ్రతుకంతా పరుచుకోవ

గలగలా పారుతుంది-నీ నవ్వుల గోదారి
నీ నవ్వుల సవ్వడికే-జేగంటలు రావు సరి

వరదాయిని నీ నవ్వు-మన్మోహనమీ నవ్వు
ఎప్పటికీ శరణ్యమే- నా కిక నువ్వు-నీ నవ్వు

Tuesday, August 17, 2010

ఊహా మోహిని

నువ్వే తోడుంటే –స్వర్గం నా వెంటే
నీతో నా బ్రతుకే- పువ్వుల పల్లకే
నీ...పలుకుల్లో-తేనెల వర్షాలే
నీతో అనుక్షణమూ- తరగని హర్షాలే

1. ఎప్పుడు కలిసామో-అదియే శుభలగ్నం
నీ సాన్నిధ్యమే-నందనవన చందం
ఏ జన్మలో –విడిపోని అనుబంధం
ఏనాడో దైవం-ముడివేసినదీ బంధం

2. కోయిల పాటలో- వినిపించును నీగానం
మేఘం మెరుపుల్లో- కనిపించును నీ రూపం
అందమైన ఓ..-ఊహవు నువు నేస్తం
వాస్తవ లోకం లో- ఎప్పుడు నువు ప్రాప్తం

Sunday, August 8, 2010

మనసారా....!

నీకు మామూలే- నాకు మనుగడ లే
నీకన్ని సరదాలే-నాకవి నరకాలే
మెరుపులా మాయమవుతావ్-ఉరుములా భయపెడతావ్
నట్టనడి సంద్రాన-పుట్టి ముంచ్ వేస్తుంటావ్

1. హాయిగా పాడుతున్న గీతాన్ని- అర్ధాంతరంగా ఆపేస్తావ్
సాఫీగా సాగుతున్న కథనాన్ని-ఊహించని మలుపు తిప్పుతావ్
జీవితాలెప్పుడూ ఆషామాషీలా
స్నేహితాలంటెనే-కాలక్షేపాలా
నీకు చెలగాటం-నాకుప్రాణసంకటం
నీకు అలవాటే-నాకు గ్రహపాటే

2. ఉన్నత శిఖరాలపైకి చేరడానికి-చేయూత నందజేస్తావ్
గమ్యాన్ని చేరునంతలోనే-చెయ్యొదిలి నను తోసేస్తావ్
నమ్మకాన్ని నువ్వెపుడూ-నమ్మనే నమ్మనంటావ్
దగాపడిన అనుభవాలే-గుణపాఠాలంటుంటావ్
షరా మామూలే-నాకెప్పుడు గుబులే
నీకు శతకోటే-నాకు నువ్వొకటే

Friday, August 6, 2010

స్నేహ మేఘం

దూదిపింజలా వస్తావు-గాలివాటుకే వెళతావు
చుట్టపు చూపుగ వస్తావు-చప్పున మాయ మవుతావు
ఓ మేఘమా - జీవన రాగమా
నా దాహమే- తీర్చే స్నేహమా

1. మనసైతే మాత్రము-ఓ చినుకై పలకరిస్తావు
అభిమానం వెల్లువైతే-తొలకరినే చిలకరిస్తావు
ఎదనదులకు జీవం నీవు-ప్రేమికులకు ఊతం నీవు
అంతరంగ గగనానా-అందమైన సుందరి నీవు
అనురాగ సీమలోనా-ఆరాధ్య దేవతవీవు

2. కాళిదాసు నిన్ను చూసి-కావ్యమే రాసాడు
తాన్ సేన్ తాళలేక-రాగమే తీసాడు
కవి కవితకు వస్తువు నీవు-గీతకర్త స్పూర్తివి నీవు
చిత్రమైన ఆకృతులెన్నో-సంతరించుకుంటావు
కొత్త కొత్త ఆ కృతులెన్నో-ఆవిష్కరిస్తుంటావు

Tuesday, August 3, 2010

నటన

అతికించుకున్న చిరునవ్వులెన్నో- పెదవులపై మెరిసినా....
నయనాలలోనా కదలాడుతున్నా- వేదనయే దాగునా...
మేలిముసుగు వేసుకున్నా జాలిమోము తెలియకుండునా
గుండెరాయి చేసుకున్నా గొంతు జీర పలుకకుండునా
1. వెంటాడే జ్ఞాపకాలే జోరీగల గోలవుతుంటే
వేధించే గతస్మృతులే కంట నలుసులవుతుంటే
పీడ కలలే నీడ లాగా వీడలేకుంటే
మానలేని వ్యాధిలాగ కబళిస్తుంటే
ఎంతగా .....ఎంతగా .......ఎంతగా||అతికించుకున్న||
2. మత్యాలుపగడాలు కడలికి నెలవనుకొంటే
గర్భాన దాగున్న బడబానలం తెలియదంటే
ఉప్పెన ముప్పు కప్పిపుచ్చి దబాయిస్తే
ప్రళయంచేసే విలయం గూర్చి బుకాయిస్తే
ఎంతగ ......ఎంతగా..... ఎంతగా.......