Monday, October 31, 2011

https://youtu.be/ZH5HHnR3WcA?si=N3O5jFufjezv0mK3

నీ బిడ్డ సమ్మక్కను సూడ మేము పోతుంటిమి
సారక్క జంపన్నను కలువమేము బోతుంటిమి
నీ మాటగ జెప్పవయ్య రాజన్న రాజన్నా
సిఫారసే జెయ్యవయ్య రాజన్న రాజన్నా
మేడారం పోతుంటిమి తోడురావొ రాజన్న
జాతరలో భద్రంగా మమ్ముగావు రాజన్న

1. కోటొక్క మందిలో కోన్ కిస్క గాళ్లమని
కోసంత వరుసలో కొసలొమమ్ము నిలువుమని
దూరంగ తోసేసే దుస్థితి రాకూడదని
పుట్టింటి మర్యాదకు లోటు తేకూడదని
చెప్పవయ్య మాయమ్మకు పెద్దపీటవేయమని
ఒప్పించు మాతల్లిని ముందుగ వరమీయమని
నీ మాటగ జెప్పవయ్య రాజన్న రాజన్నా
సిఫారసే జెయ్యవయ్య రాజన్న రాజన్నా

2. దొంగాముచ్చు భయమింక మాకురాకుండ జూడు
పిల్లాపాపా మముతప్పిపోకుండ మరిజూడు
మా మొక్కులు తీర్చుకొనగ ఆసరాగ నీవుండు
జాతర సంబరాలు సంబరంగ జరిపించు
మాతోడు నీవుండగ మాకు ఇంక దిగులేది
మా అండ నీవుండగ మాకు గండమింకేది
రాజన్న రాజన్న మారాజువె రాజన్న
మమ్మేలు మాతండ్రి దండాలివె రాజన్న

Sunday, October 30, 2011

జన్మకో శివరాత్రి

జన్మకో శివరాత్రి

చూడుచూడు జాతర సూడసక్కని జాతర
సూడరారొ ఎములాడ రాజన్న జాతర
ఏడాది కోసారొచ్చే శివరాత్రి జాతర
ప్రతి మడిసీ జన్మకో శివరాత్రి జాతర

1. రోజంత నామ స్మరణ
రేయంత జాగరణ
ఉడత కూడ శివరాత్రి ఉపవాస ముంటదట
పిల్లలైన మసలోళ్ళైన మెతుకైన ముట్టరంట
మనసంతా శివుడె నిండ మైమరచిపోయేరు
జనమంతా కలలు పండ పులకించి పోయేరు

2. పొద్దుగాల నిద్దుర లేసి
గుండంలొ మునకలేసి
చెంబుతో లింగంపైన గంగదార పోసేసి
మారేడు పత్రిని పోసి రాజన్నకు పూజ చేసి
కొలుతురు రాజన్నను కోరికలీడేర్చమంటు
వేడేరు భీమన్నను వేదనలే తీర్చమంటు

Saturday, October 29, 2011

తెలంగాణం శివమయం

తెలంగాణం శివమయం

ఎములాడ రాజన్న కొమురెల్లి మల్లన్న
కొత్తకొండ ఈరభద్రన్నా-నీకు కోటికోటి దండాలోరన్నా
పిల్లామేకా సల్లగజూడు-పాడీపంటా పచ్చగ జూడు
రవ్వంతనీదయ ఉంటే రాజన్నా-రపరపలే ఉండవింక రాజన్న
జరంత కనికరిస్తెనూ మల్లన్నా-జనమంత జబర్దస్తెగా మల్లన్న

1. సేనుసెలకలల్ల నీళ్లబొట్టులేక-పంటమాడిపోయెరా రాజన్నా
మా కడుపుల్ల మంటాయె- కంటేమొ నీరాయెరా
బావుల్ల సెరువుల్ల ఊటైనలేక-గొంతెండిపోతోందిరా మల్లన్నా
తాగనీకి ఒకసుక్కలేదాయె-నాలికింక పోడిబారిపోయే
తలమీద గంగమ్మ తాలాపు గోదారి నీమాట ఇనకుందురా
నువ్వు తల్సుకొంటె నీకు లెక్కకాదురా
మా తప్పు మన్నించి మమ్మింక కావర గంగాధరా
సిరులెల్ల కురిపించి వరముల్ని -మాకిచ్చి మముబ్రోవర శంకరా

2. మారు మూలనుంచి దూరాలుపారొచ్చి నిను జేరమేమొస్తిమి రాజన్న
మారాజు నీవంటిమి మమ్మేలు దొరవంటిమి
కడగండ్లు తొలగించి కష్టాలు కడతేర్చి కాపాడమనియంటిమి మల్లన్నా
మనసారా నమ్మితిమి నిన్నింక మదిలొనకొల్చితిమి
సెరణంటు నినువేడ బాలుణ్ని బతికించిన కథమేము విన్నామురా
నీ మైమల్ని ఎరిగేమురా నీలీలలనికన్నామురా
దయగల మాతండ్రి నీవేనురా ధర్మప్రభువింక నువ్వేనురా
దీనులపాలిటి దిక్కు నువ్వేరా-పేదల పాలిటి పెన్నిధివేరా

వేములవాడ వైభవం

వేములవాడ వైభవం
అదిగదిగో వేములవాడ-అల్లదిగో మన రాజన్న జాడ
ఎదిరెదిరి చూసిన ఘడియ అంతలోనె వచ్చింది
ఎన్నాళ్లకోరికనో ఈడేరబోతోంది

1. తెలంగాణ నట్టనడిమిలో-కరినగరం జిల్లాలో
అలరారుతోంది రాజన్న వెలసిన క్షేత్రం
కాశీకైలాసం కన్నా ఇది ఎంతో పరమ పవిత్రం

2. అడుగడుగున ఆలయాలు-శివుడికి అవి నిలయాలు
ధూళిదుమ్ముసైతం రాజన్న పాదరేణువే
ఏరాయి తాకినా ఆసామి స్థాణువే

3. ధర్మగుండ స్నానాలు ముడుపుల తలనీలాలు
కోడె మొక్కు తీర్చడాలు-గండా దీపాలు
తులాభార బంగారాలు- దానాలు ధర్మాలు

4. ఇటుపక్కన సిద్దిగణపతి-కుడిపక్కన రాజేశ్వరి
ఇద్దరి మధ్యన నందికెదురుగా ఈశ్వరుడు
దర్శనమిచ్చును మన రాజరాజేశ్వరుడు

5. హరిహరులకు ఆలవాలము-కులమతముల లేదు భేదము
రామపద్మనాభులు కొలువున్న శైవమందిరం
మహ్మదీయ దర్గాసైతం కోవెలలో దర్శనీయం

6. చాళుక్యుల చెక్కణాలు –చెదరిపోని కుడ్యాలు
పంపకవి ప్రాభవాలు భీమకవి విభవాలు
సంగీత సాహితీ దురంధరుల చేవ్రాలు

7. రాజన్న గోపురాలు కాంతులీను శిఖరాలు
భీమేశ్వర నగరేశ్వర బద్దిపోచమ్మ గుళ్లు
వెములాడ చూడ చూడ చాలవింక రెండు కళ్ళు

Friday, October 21, 2011

నీరాజనాలు నీకు రాజన్న

నీరాజనాలు నీకు రాజన్న

రాజన్న రాజన్న రాజన్న ఎములాణ్ణ కొలువున్న రాజన్నా
దండాలు నీకింక రాజన్నా పేదోళ్ళపెన్నిధి నీవన్నా

దయగలసామివి నీవేనంటు నినుదర్శించ వొస్తిమి రాజన్నా
మా ఆశదీర్చేటి ఆసామి నీవని ముడుపింక దెస్తిమి రాజన్న

1. ఎంకన్న సామిని సూసొద్దమంటే ఏడేడు కొండలు ఎక్కాలంటా
రైళ్లు బస్సులెన్నొ మారాలంటా

అయ్యప్ప సామిని దర్సిద్దమంటే అల్లంత దూరాన ఉన్నాడంటా
నీమాల నోములు నోచాలంటా

కూతవేటులోన రాజన్న నువ్వు కొలువుంటివయ్య రాజన్నా
మనసున్న మారాజు నీవేనన్న మాకొంగు బంగారు సామివన్న

సాగిల దండాలు నీకన్నా-సాంబ శివుడవో రాజన్న
పొర్లుడు దండాలు నీకన్నా-పార్వతీశరాజరాజన్న

2. కాసిన్ని నీళ్లు తలమీద బోస్తే కనికరించె తండ్రివీవన్న-
గంగమ్మతల్లికి ప్రియుడవన్న

మారేడు పత్రి మనసార బెడ్తె-దయజూచే పెబువేనీవంట-
రాజేశ్వరమ్మకు పెన్మిటివన్న

ముందుగ మొక్కే గణపయ్య నీకు ముద్దులకొడుకేనంట
సూరుడు వీరుడు సుబ్బయ్య నీకు మోదమిచ్చెకుమరుడంట

కోడెమొక్కులింక నీకయ్యా-నందివాహన రాజ రాజన్న
మాతలనీలాలు నీకయ్యా-భీమలింగరూప రాజన్న

Saturday, October 15, 2011

గీతాగోవిందం-జీవిత మకరందం

గీతాగోవిందం-జీవిత మకరందం

నీ మేను వీణ - నే మీటు వేళ
రవళించు రసరమ్య రాగాల హేల
నీమోవి మురళి - మ్రోయించు వేళ
మకరంద సంద్రాల మాధుర్య లీల
గాలికి తావివ్వని మన తనువుల కలయిక
జ్వాలలు రగిలించగ చెలరేగిన మధుగీతిక

1. సుమశరముల నవమదనునికిది కదన కాహళి
బృందావన రాధిక ప్రియ మోహన కృత రాసకేళి
చుంబిత విజృంభిత అంగాంగ సంవిచలిత ఉధృతి
నాసిక పరితోషిత ఆఘ్రాణిత ఉన్మత్త వ్యావృతి
శ్రుతి చేయగనే నీ సమ్మతి- పోగొట్టెనులే నాకున్న మతి


2. వాత్సాయన విరచిత సురుచిర శృంగార సూచిక
జయదేవ కవిప్రోక్త అష్టపదాన్విత విరలి వీచిక
శ్రీనాథ సరసరాజ నైషధ సారాంశ జీవ చిత్రిక
సృజియించెద అసమాన వలరస కావ్య కన్యక
లయమొందగ నా పరిస్థితి-అద్వైత అనుభవైక నిర్వృతి

Thursday, October 13, 2011



అమ్మా నీకు జోహారు!అమ్మా నీ వెతలెప్పుడు తీరు?


అమ్మ మనసు-ఎవరికి తెలుసు
అమ్మంటె అందరికీ ఎందుకింత అలుసు
నవ్వుతునవమాసాలు మోస్తుందనా
నెత్తురునే దారబోసి పాలిస్తుందనా

1. కడలిలోతు సైతం కనుగొన్నారెందరో
విశ్వరచననైనా తెలుపగలిగిరెందరో
గగనాంతర సీమల మర్మమెరిగిరెందరో
అమ్మ ఆంతర్యమే అంతుచిక్క దవనిలో

2. గుండెలపై తన్నినా ఎదకు హత్తుకొంటుంది
ఆకలిపై అలకొద్దని బుజ్జగించి పెడుతుంది
తప్పులెన్నిచేసినా వెనకవేసుకొస్తుంది
తలతాకట్టుపెట్టి గండం గట్టెక్కిస్తుంది

3. కడుపున బుట్టిన బొట్టె పట్టించుకోకున్న
నట్టేట పుట్టి ముంచు మేబుట్టువులున్నా
లోకమంత ఒక్కటై తనకు ఎదురుతిరిగినా
సంతతె సర్వస్వమనే వెర్రిది అమ్మా