Friday, April 19, 2013

రాఖీ|| “విజయ” గీతి ||



రాఖీ|| “విజయ” గీతి ||

నిత్య సాధన –నిశిత శోధన
ఎగురవేయగ ఆశయాల విజయ కేతన
విశ్రమించక అభ్యసించగ విక్రమించును చేతన
పాఠాలు నేర్చుకో ఒక  పాటలా
బడిని  భావించుకో అమ్మ ఒడిలా  ||నిత్య||

1.   చెక్కుచెదరని ఆరోగ్యంతో –ఉక్కు మనిషిగ ఎదగాలి
చక్కనైన వ్యాయామంతో- ఆటలెన్నొ ఆడాలి
క్రీడాస్పూర్తి వీడబోకు-ఓటమి గుణపాఠం నీకు
నీది వజ్ర సంకల్పం –ఏకాగ్రత నీ నైపుణ్యం
మడమ నీవు తిప్పకుండా-మునుముందుకు సాగాలి
పట్టు సడలనీయకుండా-గెలుపు తలుపు తట్టాలి||నిత్య||

2.   నవభారత నిర్మాణంలో-పిడికిలెత్తి కదలాలి
మానవీయ విలువల సారం –ప్రపంచాన చాటాలి
వేద విజ్ఞాన మంతా-కాచి వడబోయాలి
మేధను అధునాతనంగా- తీర్చి దిద్దుకోవాలి
చేజార్చకు ఏ క్షణం- తిరిగిరాదు ఈ తరుణం
తీర్చుకో ఎప్పటికైనా –నీ మాతృభూమి ఋణం 

3.   వివేకానందుడు-నీకు మార్గ దర్శకుడు
గాంధీ మహాత్ముడు –నీ దిశా నిర్దేశకుడు
సుబాస్ పోరాట పటిమ- నీ స్పూర్తి కావాలి
అల్లూరి ధైర్య గరిమ –నీకు కీర్తి తేవాలి
ఆత్మ విశ్వాసంతో –అధిగమించు శిఖరాలు
కృషి మరువని ఋషివే నీవై  – సాధించు లక్ష్యాలు

4.   శీలమే నీకు –నిజమైన అగ్ని పరీక్ష
వినయమే నీకు- శ్రీ రామ రక్ష
సంస్కృతీ సంప్రదాయం- నీలొ వెల్లి విరియాలి
నీతీ నిజాయితీ-నీకు ఆయువవ్వాలి
తరతరాల భరతచరితకు వారధిగా  మారాలి
యువతరాన్ని నడిపించే నవసారథి నువుకావాలి

19-04-2013