రాఖీ|| “విజయ” గీతి ||
నిత్య సాధన –నిశిత శోధన
ఎగురవేయగ ఆశయాల విజయ కేతన
విశ్రమించక అభ్యసించగ విక్రమించును చేతన
పాఠాలు నేర్చుకో ఒక పాటలా
బడిని భావించుకో అమ్మ ఒడిలా ||నిత్య||
1.
చెక్కుచెదరని ఆరోగ్యంతో –ఉక్కు మనిషిగ ఎదగాలి
చక్కనైన వ్యాయామంతో- ఆటలెన్నొ ఆడాలి
క్రీడాస్పూర్తి వీడబోకు-ఓటమి గుణపాఠం నీకు
నీది వజ్ర సంకల్పం –ఏకాగ్రత నీ నైపుణ్యం
మడమ నీవు తిప్పకుండా-మునుముందుకు సాగాలి
పట్టు సడలనీయకుండా-గెలుపు తలుపు తట్టాలి||నిత్య||
2.
నవభారత నిర్మాణంలో-పిడికిలెత్తి కదలాలి
మానవీయ విలువల సారం –ప్రపంచాన చాటాలి
వేద విజ్ఞాన మంతా-కాచి వడబోయాలి
మేధను అధునాతనంగా- తీర్చి దిద్దుకోవాలి
చేజార్చకు ఏ క్షణం- తిరిగిరాదు ఈ తరుణం
తీర్చుకో ఎప్పటికైనా –నీ మాతృభూమి ఋణం
3.
వివేకానందుడు-నీకు మార్గ దర్శకుడు
గాంధీ మహాత్ముడు –నీ దిశా నిర్దేశకుడు
సుబాస్ పోరాట పటిమ- నీ స్పూర్తి కావాలి
అల్లూరి ధైర్య గరిమ –నీకు కీర్తి తేవాలి
ఆత్మ విశ్వాసంతో –అధిగమించు శిఖరాలు
కృషి మరువని ఋషివే నీవై – సాధించు లక్ష్యాలు
4.
శీలమే నీకు –నిజమైన అగ్ని పరీక్ష
వినయమే నీకు- శ్రీ రామ రక్ష
సంస్కృతీ సంప్రదాయం- నీలొ వెల్లి విరియాలి
నీతీ నిజాయితీ-నీకు ఆయువవ్వాలి
తరతరాల భరతచరితకు వారధిగా మారాలి
యువతరాన్ని నడిపించే నవసారథి నువుకావాలి
19-04-2013
No comments:
Post a Comment