Tuesday, December 17, 2013

“కళ్యాణ గీతం “


కళ్యాణ గీతం

దిగివచ్చిరి  దేవతలూ ఆత్మీయంగా
వధూవరుల మనసారా  దీవించంగా
కనీవినీ ఎరుగన౦త వైభవోపేతంగా
జరిగె ఈ పరిణయం  కమనీయంగా

జనులుమెచ్చేఈడూ జోడైనఈజంట
బంధుమిత్రులందరికీ కన్నుల పంట

        
1.    విశ్వకర్మ విస్తుపోయె మండపాన్ని నిర్మించ
రతీదేవి మతిపోయే పన్నీరు చిలరింప
కుబేరుడే ఆప్తుడిగా పెండ్లి పనులు నిర్వహించ
సాక్షాత్తు లక్ష్మీదేవి సాదరంగా ఆహ్వానించ

        కనీవినీ ఎరుగన౦త వైభవోపేతంగా
        అనువైన మనువుఎంతొ మనోహరంగా

2.     విధాతయే విధివిధాన లగ్న క్రతువు జరిపించ
వశిష్టుడే మంగళాష్ట కాలెన్నో పఠియి౦చ
సరస్వతీదేవియే సంగీత లహరి నోలలాడించ
అన్నపూర్ణమ్మనే కమ్మగా వండీ వడ్డించ

మంత్రాక్షరాలే అక్షతలై కురియ౦గా
తిలకించిన  నయనాలే  తాదాత్మ్యంగా

3.     రాధా కృష్ణుల అనురాగ రస ఝరియై
సీతారాముల అన్యోన్య కాపురమై
శివపార్వతుల అర్ధ నారీశ్వరమై
వర్దిల్లనీ వధూవరుల దాంపత్యం వరమై

శ్రుతీ లయ లయమైన భాజాలు మ్రోగంగా
శుభకరమౌ వివాహం శ్రవణపేయంగా
       
4.     అత్తవారింటికి వెలుగిచ్చే రమ్యదీపికగా
ఆడపడచులందరికీ తలలో నాలుకగా
శ్రీవారిమదిననెరిగి చేదోడు వాదోడుగా
ఖ్యాతి పొందు మా తనయ  పుట్టింటికి పేరు తేగ

        కనీవినీ ఎరుగన౦త వైభవోపేతంగా
        జరిగెఈ  కల్యాణం ఆహ్లాదకరంగా