Sunday, November 19, 2023

 రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ


రాగం:నట భైరవి


ఇంటికి దీపం ఇల్లాలు అలనాడు

ఇలకే వెలుగిస్తోంది ఇంతి ఈనాడు

గృహమును చక్కదిద్దు ఒద్దిక-గృహిణికి ఆభరణం- ఒకనాడు

ఉద్యోగినిగానూ సవ్యసాచి సుదతికి నిత్యం- రణమూ గెలుపూ నేడు


1.లేచింది మొదలుగా పాచివదలగొడుతుంది

ఇంటిల్లి పాదికీ టీ టిఫిన్లు చేసి నోటికందిస్తుంది

వండి వార్చి లంచ్ బాక్స్ బ్యాగుల్లో సర్దిపెడుతుంది

అందరు వేళకేగులాగు పరుగిలిడి తను బస్సుపడుతుంది.


2.మగచూపులు తాకుళ్ళు వత్తిళ్ళు తట్టుకొంటుంది

ఆఫీసు బాసుకు అలుసవకుండా పనినెత్తుకుంటుంది

సహోద్యోగి అతిచొరవకు తప్పుకొంటు తిరిగుతుంది

నొప్పింపక తానొవ్వక నేర్పుగ ఓర్పుగ వృత్తి నెట్టుకొస్తుంది.


3.ఆర్థికంగ భర్తకెంతొ చేదోడు వాదోడౌతుంది

అత్తామామల మాటదాటక తల్లో నాలుకౌతుంది

సవాళ్ళెన్ని ఎదురైనా నవ్వుతు సగబెడుతుంది

షట్కర్మయుక్తను మరపించి సర్వకర్తగా అవతరించింది


4.కవన గాన కళారంగాలలో కలికి ప్రతిభ అపారము

కమ్ముకునే నిత్యాకృత్యాలతో అభిరుచికే అంధకారము

పాక్షికంగానో సమూలంగానో ప్రవృత్తి పట్ల నిర్వికారము

మగువా నీ మనుగడయే ఒడిదుడుకుల సమాహారము





No comments: