Saturday, July 29, 2017

వెన్నెలంతా ముద్దగజేసి
నింగి సింగిడి రంగులనద్ది
మంచుకొండను గుండెగజేసి
మమతలెన్నో మనసున కూర్చి
నిన్ను సృష్టి చేసినాడు ఆబ్రహ్మా
చేసిచేయగానె ధన్యుడాయె నోయమ్మా

1.మేఘాలే కురులుగ మారే
కమలాలే కన్నుల చేరే
ముక్కుజేరగ ముక్కెర కోరే
పగడాలే పెదవుల రాలే
రోజాలే చెంపలపూసే
చుబుకం తీరు లేతకొబ్బరే

నువ్వు నవ్వు నవ్వగానె ఓయమ్మా
మాయలేవొ కమ్ము నమ్ము నమ్మవమ్మా

2.కుంభరాశి ఎద తులతూగె
సింహరాశి కటిలో నిలిచే
కన్యారాశి నాభిలొ మెరిసె
మిథునరాశి మతిపోగొట్టె
వృషభమేమొ జఘనమ్మాయే
మేను మేను మీనమాయే

నీ నడకల హొయలేచూస్తె ఓ కొమ్మా
హంస ఘనత ధ్వంసమగునులే
ఓ గుమ్మా

Monday, July 24, 2017

నీవేలే నా జీవితమంతా
నీ అడుగులె నా జీవన పంథా
నిను తలవక నా మనుగడ మృగ్యం
నువు కలవక నా బ్రతుకే శూన్యం


కేవలం ఇక నీవేలే
నాలోకమే ఇక నీవేలే

నా ధ్యానము నా మౌనము
నా గానము మరి నీవేలే
నా దేహము నా హృదయము
నా ప్రాణము ఇక నీవేలే

1.నీ విరహం అహరహ నరకం
నీ సంగమమే నాకిల నాకం
నిను పొందక నే జీవశ్చవము
నీ సన్నిధియే నందనవనము
 .
నా శ్వాసయే నీ ఊపిరి
నా గుండెలో నీ సవ్వడి

నా ప్రణయము నా పరువము
నా పరవశం నీవేలే
అనుభూతులు మధురోహలు
రసజగత్తులు నీవేలే

2.జన్మలు దాటెను మన అనుబంధం
కాలపు అంచులు మీటిన చందం
నీ సహవాసం నిత్య వసంతం
నీతో గడిపే యుగమే క్షణము

కేవలం ఇక నీవేలే
నా లోకమే ఇక నీవేలే

నా వేదన నా సాధన
నా ప్రార్థన మరి నీవేలే
నా పంతము నా సొంతము
ఆసాంతము  ఇక నీవేలే

ప్రేమ(వ)లయం

ఎనలేని మిన్ను అనురాగం
మనలేని కడలి కడు మోహం
దరిచేరలేని ఆరాటం
నెరవేరలేని బులపాటం

1.కెరటాలు చేసె పోరాటం
ఎగిరేందుకెంత ఉబలాటం
అలరించునంత తామే
అలసె అలలంతలోనే

వగచిందిలే తరంగం
కలచేంత అంతరంగం
అశ్రుధారచేర్చె లవణం
సింధువాయె క్షారక్షీరం

2.రేగింది విరహ తాపం
ఎగసింది నింగి భాష్పం
చుంబించె దివిని మేఘం
తీరంగ నే'మో వి'యోగం

అంబరానికెంతొ హర్షం
కురిసింది ప్రణయ వర్షం
ప్రవహించి వాగునదులై
చేరేను జలధి ఎదలో

Monday, July 17, 2017

హాయి పంచుకుందాం
అనుక్షణం నేస్తం
రాగమందుకుందాం
సంగీతం మన సమస్తం

1.గాయకులమే గాని
కులమెంచబోము
అభిమతము ఏదైనా
మతము పట్టించుకోము

శ్రుతి లయమేళవించే
ఆహ్లాదం మా వేదం
గతి గమకాలనద్దే
ఆనందం మానాదం

2.కోయిలే మాకు గురువు
ప్రకృతే పాఠశాల
సరిగమలు మా భాష
పాటలే మాకు శ్వాస

అరమరికలు లేనివిమా
అనురాగ బంధాలు
అజరామర మైనవి ఈ
అపురూప స్నేహితాలు

Wednesday, July 5, 2017

అందమైన సుందరుడు
నేలమీది చందురుడు
నవ్వుల్లొ వెన్నెలలే రువ్వుతాడు
చూపుల్లొ వేకువలే చిమ్ముతాడు
చిన్నారి నా తనయుడు
గారాల మారాల వీరుడు

1.మాటల్లు తేనియ విందేలే
పాటల్లు కోయిలతొ పందాలే

పూలబాల మెత్తదనం
మేఘమాల జాలిగుణం
పిల్లగాలి హాయిగుణం
ఊటనీటి స్వచ్ఛదనం

అన్నీ సొంతం చేసుకున్నాడులే
అందరి ఎదలే దోచుకున్నాడులే

2.నడకల్లొ ఉట్టిపడే రాజసాలు
వెనకంజ వేయనీ సాహసాలు

అమ్మ లోని ప్రేమగుణం
చెట్టు చూపె స్నేహగుణం
వానకున్న త్యాగగుణం
మోడుకున్న మొండితనం

అన్నీ సంతరించుకున్నాడులే
అందరి మన్నన చూరగొన్నాడులే