Tuesday, April 21, 2009

కులం కులం ఏకులం మీదే కులం
కార్మికులం కర్షకులం శ్రామికులం సైనికులం
మతం మతం ఏమతం మీదే మతం
ఐక్యతయే అభిమతం-మానవతే మా మతం

ఉలితో నాగలి తో గన్ తో మిషన్ తో
జాతినేలు నేతలం-శాంతి పంచు దాతలం
యుక్తితో స్వశక్తితో స్వేఛ్ఛగా యధేఛ్ఛగా
భుక్తిపొందు జీవులం పాడుకొనే గాయకులం

శ్వాసకు శ్వాసను పేర్చి భాషను పక్కకు చేర్చి
పనిచేసే పౌరులం ప్రాణమిచ్చె వీరులం
మట్టిలొ బంగారం- మర కర్మాగారం
సృష్టించే బ్రహ్మలం- దైవమనెడి భక్తులం

మబ్బున కోడికూత షిఫ్ట్ న సైరన్ మోత
మాకు సుప్రభాతం- మాప్రార్థన గీతం
సాటి మనిషి సౌభాగ్యం- సమైక్యతా సౌశీల్యం
మాగీతా గోవిందం- మాఖురాన్ గ్రంథం

తరతమ భేదాలు మాని-కులమత వాదాలు వీడి
కలిసి మెలిసి పనిచేస్తాం-ప్రగతి రథం నడిపిస్తాం
వసుధైక కుటుంబం-అన్నదె మా ధ్యేయం
క్రమ శిక్షణయే ముఖ్యం- జన రక్షణయే లక్ష్యం

No comments: