Tuesday, April 21, 2009

పలురంగులు వేసుకున్న రాజకీయమా
చిరునవ్వులు పులుముకున్న రాక్షసత్వమా
మసలుకో ఇకనైనా మనవతా రీతిలో
కలిసిపో ఇపుడైనా మా’నవతా’జాతిలో ||పలు రంగులు||

అధికారం నీ కోటకు రక్షిత ప్రాకారం
అవినీతే నీ కున్న ఆరవ ప్రాణం
స్వార్థం నీ ప్రధాన సలహాదారు
మకుటంలెకున్నా నువ్వే మహరాజు ||పలు రంగులు||

కంటితుడుపులెన్నడూ-మాగొంతులు తడుపవు
వొట్టిమాటలెప్పుడూ- మా పొట్టలు నింపవు
నీటిమీది రాతలకే- జీవితాలు మారవు
నోటి తుంపరలకే-గుండెమంటలారవు ||పలు రంగులు||

మెడక్రింది మేక చన్లు నీ ప్రగతి పథకాలు
నీ మాటలె నీ పాలిటి అపకీర్తి పతకాలు
ఏల్నాటి శనివీడని-ప్రజల జాతకాలు
నా సోదర పౌరులకివె సుప్రభాత గీతాలు ||పలు రంగులు||

No comments: