Sunday, June 7, 2009

హనుమాన్ చాలీసా పారాయణము
అది సుందరకాండతో సరిసమానము
పావనినిల సేవించగ బ్రతుకు పావనం
మారుతియే కరుణించగ జన్మసార్థకం
1. ఉదయించే సూర్యుని కని కమ్మని ఫలమని
భావించిన మారుతి మ్రింగె బాల భానుని
గురువుకన్న ఘనుడగునని శిశ్యునిగా గైకొని
నేర్పెను రవి పావనికి వేద వేదాంగములని
2. కిష్కింద కాండలో స్నేహానికి సారథి
సుందరకాండలో విరహానికి వారధి
యుద్ధకాండలో కలహానికి ప్రతినిధి
జీవనకాండలో భక్తి దాహానికి తియ్యని జలధి
3. సింధూర ధారణతో శ్రీరాముడు వశమగునని
తలపోసిన కపివరుడది ఒళ్ళంతా పులుముకొని
తెలిపె మనకు భక్తిలోని పరాకాష్ఠ వైనముని
ఎరిగిమసలుకొన్నవారు పొందగలరు ముక్తిని
హనుమంతుని ప్రతిమ లేని ఊరుఊరేకాదు
రామనామ భజన అనని నోరునోరేకాదు
కపివరునికి ప్రియమైనది ఒకటే అది రామకథా
అష్టాక్షరి పంచాక్షరి సంకలనమె రామ కదా
1. కలియుగాన ప్రత్యక్ష దైవమే హనుమంతుడు
కలికల్మష నాశకుడే వీరాంజనేయుడు
భక్తిమార్గ భోదకుడే భక్తాంజనేయుడు
భక్తసులభుడేకాదా ప్రసన్నాంజనేయుడు
2. భూతాలనుప్రేతాలను దునుమాడును మారుతి
రోగబాధ సత్వరమే తొలగించును పావని
దారిద్ర్యము బాపేటి కేసరీ నందనుడు
వేదనలో ఓదార్చే శ్రీ రాముని ప్రియ సఖుడు
ఇంకేమి కోరను స్వామీ
నినువినా నా మనమునా
ఇంకేమి కోరను స్వామీ
1. ఇచ్చితివి నాకిల సుందర దేహము
అంతోఇంతో విజ్ఞానము
కడుపు నిండుటకు సరిపడు అన్నము
తలదాచుకొనుటకు చక్కని గృహము
2. పలికే ప్రతి మాట నీనామ మవనీ
తలిచే ప్రతి తలపు నీ భావమవనీ
వేసే ప్రతి అడుగు నీవైపె సాగనీ
చూసే ప్రతిచూపు నీరూపు నిలపనీ

త్రిపురసుందరీ మాత దండకం

ఏ పాద మంజీర నాదాలలో
జగతి పులకించి మైమరచునో
ఏ దివ్యతేజః పుంజాలలో
జనులు జ్ఞాన చక్షులు తెరచి తిలకింతురో
ఏ తల్లి కరుణార్ద్ర దృక్కాంతి ప్రసరించగా
జన్మ చరితార్థమగునో
ఏ అమ్మ చనుబాలు మృతసంజీవినీలై
మనిషి మనుగడను కాపాడునో
ఏ వదన వీక్షణామాత్రంబు
సర్వజన దుఃఖ పరిహారమగునో
ఏ దేవి నర్చింప
సకల సౌభాగ్య భోగములు లభియించునో
అట్టి వనశంకరీ దేవి
సింహవాహిని
డోలాసుర భయంకరి
పద్మాసని
అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకి
వాగ్దేవి
నన్ను నిన్ను సకల మానవాళిని
సదా సర్వదా రక్షించుగాక!
ప్రమధ గణములు భక్తి ప్రణతులే నుతియింప
నందికేశుడు నమక చమకాల కీర్తింప
సుముఖ షణ్ముఖులు పక్కవాద్యాలు వాయింప
నారదాదులు మధుర గీతాలు పాడగా
సాగింది సాగింది శివతాండవం
ఊగిందిఊగింది హిమవన్నగం
1. పదునాల్గు భువనాలు పరవశమ్మొందగా
ముక్కోటిదేవతలు మురిపెముగ తిలకింప
మహర్షుల నయనాలు ముదముతో చెమరింప
భూతగణములు హస్త తాళముల భజియింప
సాగిందిసాగింది ఆనంద నర్తనం
తలవూచి ఆడింది వాసుకీ పన్నగం
2. తకఝణుత తఝ్ఝణుత యను మృదంగా రావం
ధిమిధిమిత ధిధ్ధిమిత ఢమరుకా నాదం
తధిగిణుత తకతోంత మృదు ఘట ధ్వానం
సరిగమా పదనిసల రాగ ప్రవాహం
దుష్టశక్తుల గుండెలదిరే లయతాండవం
ధూర్త రాక్షస మూక చెదిరే ప్రళయతాండవం
అమ్మా సరస్వతి నువ్వే నాగతి
నిన్నే నమ్మితి నిన్నే వేడితి
1. పుత్రుడైనందుకా నారదుణ్ని బ్రోచింది
ఆప్తుడైనందుకా తుంబురుణ్ని కరుణించింది
త్యాగరాజు నీకెలా బంధువో చెప్పవమ్మ
అన్నమయ్య నీకెలా అస్మదీయుడోనమ్మ
అందరూ నీకన్న బిడ్డలే కదమ్మా
నన్నింక చేరదీసి ఆదరించవేమమ్మ
2. వ్యాసుడే పూలతో పూజించె నిన్ను
వాల్మీకి నోచిన నోములేమిటందు
శంకరాచార్యుడెట్లు సేవించెనోగదమ్మ
పోతన్న పూర్వజన్మ పుణ్యమేమిటమ్మ
ఏరీతిగానిన్ను మెప్పించగలనమ్మ
చేజోతలర్పించి ధ్యానింతునమ్మా
3. కోరలేదు నిన్నునే కొండంత సిరులు
అడగలేదు నిన్నునే మేడలు మిద్దెలూ
అర్థించలేదులే పదవులు రాజ్యాలు
వాంఛించలేదమ్మ భోగభాగ్యాదులు
మేధలో గొంతులో నీవు కొలువుంటెచాలు
నీ పాద పద్మాల నందిస్తె కొదవే లేదు
ఇంతలోనే ఈ చింతలేల-వింతగా నీ కవ్వింతలేల
పులకింత-గిలిగింత దొరికాయని నీ చెంత
అనుకుంటే వెనువెంటే నా కంట నీరంట
ఇంతలోనే ఈ చింతలేల-ఇంతగా నీ పంతమేల
అలిసేంత ఆటంతా ఆడేది నావంతా
ఎపుడైనా ఎటులైనా-గెలిచేది నీవంటా
స్వామీ నీవె ఇక శరణం నాస్తి- స్వామీ నిన్నే మనసా స్మరిస్తి
1. ఎత్తుకోమని నిన్ను వేడుతుంటే-ఊబిలో దించేసి వెడుతుంటావు
ఎత్తునుంచి దించవయ్యా భయమని నేనంగలార్చినా
ఆనందం పొందే నీ మనసు మార్చునా
ఇంతలోనే ఈ బింకమేలా-అందుకేమైనా సుంకమియాలా
స్వామీ నీవె ఇక శరణం నాస్తి- స్వామీ నిన్నే మనసా స్మరిస్తి
2. గగనంలో జాబిల్లిని చూపిస్తావు-అద్దంలో చందమామనందిస్తావు
తాగేందుకు తగినన్ని నీళ్ళంటావు-
నడి సంద్రంలోన నన్ను వదిలేస్తావు
ఇంతగానీ పంతమేల-ఎంతకీదీనికంతు లేదా
స్వామీ నీవె ఇక శరణం నాస్తి- స్వామీ నిన్నే మనసా స్మరిస్తి
అంతలోనే వసంతమేలా-నీసొంతమైతే ఏ చింతలేల నాకు సాంత్వనేల
స్వామీ నీవె ఇక శరణం నాస్తి- స్వామీ నిన్నే మనసా స్మరిస్తి
వాయుపుత్రా నీకు వేయి దండాలు
లక్ష్మణప్రాణదాత నీకు లక్ష దండాలు
కొండగట్టు హనుమయ్యా కోటికోటి దండాలు
అంజనాదేవితనయ అనంతకోటి దండాలు
1. సంజీవరాయా నీకు సాష్టాంగ దండాలు
సీతాశోకనాశక చేతులెత్తి దండాలు
రామదూతా నీకు రాంగపోంగ దండాలు
కేసరీనందన నీకు పొర్లుడుదండాలు
2. పవనాత్మజానీకు పగడాల దండాలు
సుగ్రీవమిత్రా నీకు ముత్యాలదండాలు
చిరంజీవి హరీశుడా రత్నాల దండాలు
వాగధీశానీకివె వజ్రాల దండాలు
3. దినకరుని మ్రింగిన నీకు దినందినం దండాలు
ఘన సంద్రం దాటిన నీకు క్షణం క్షణం దండాలు
లంకగాల్చిన స్వామినీకు అడుగడుగు దండాలు
వనము కూల్చిన స్వామినీకు వంగి వంగి దండాలు
4. మనసెరిగిన మారుతీ మనసారా దండాలు
కరుణించే పావనీ తనివిదీర దండాలు
జితేంద్రియా నీకివే గొంతెత్తి దండాలు
పంచముఖీ ఆంజనేయ తలవంచి దండాలు
జయ కళ్యాణ గోపాల జయహారతి
జయ బృందా మనోహర శుభ హారతి
జయహే ముకుందా మంగళహారతి
జయ మురళికృష్ణయ్య కర్పూరహారతి
1. అష్టభార్యలను ఇష్టపడి
పరిణయ మాడిన వైనమునేగని
పదహారువేల గోప భామలను
ప్రాణప్రదముగ ప్రేమించావని
ఇచ్చితిమయ్యా మాఆడపడచుని
కళ్యాణమాడగ మాతులసిని
2. ఏటేట జరిపేము మీ కళ్యాణోత్సవం
కమనీయమిది బహు శుభదాయకం
కనులార దర్శించ మది పావనం
మనసార ప్రార్థించ అఘనాశకం
జయహే ముకుందా మంగళహారతి
జయ మురళికృష్ణయ్య కర్పూరహారతి

(గతంలో రాసినది-ప్రస్తుతానికి అప్రస్తుతమైనది)

(గతంలో రాసినది-ప్రస్తుతానికి అప్రస్తుతమైనది)
మరువకో మల్లన్న-ఒక మంచిమాట చెబుతున్నా
ఇనుకోయే రాజన్న-ఇవరమైన ముచట చెబుత
రాకరాక వచ్చెనట-సక్కనైన పథకమట
దక్కన్ గ్రామీణబ్యాంకుల-రైతన్నల కోసమట
నడిచిసూడు ఈ బాట-బతుకంతా పూదోట
ఈనెలతో ఆఖరంట-ఏగిర పడమంట
1. అప్పుడెప్పుడోనీవు అప్పులెన్నొదెచ్చావు
గ్రామీణబ్యాంకుకేమొ-బాకీ పడిపోయావు
వడ్డీమీద వడ్డీపడే-నడ్డిరిగీ మూలబడే
బాకీకట్టబ్యాంకుబోతె-కళ్లుదిరిగి కూలబడే
2. మనకోసమె వచ్చింది మామంచి పథకము
ఏడికో ఓకాడికి-తెగతెంపుల పథకము
వడ్డీలను మాఫిజేసి-ఖర్చులన్నిరద్దుజేసి
రెండుమూడుకిస్తుల్లైన-కట్టగలిగె పథకము
3. సన్నకారు చిన్నకారు రైతులకే ఈపథకము
స్వల్పకాలదీర్ఘకాల అప్పులకే ఈ పథకము
ఎగసాయఋణాలకే చెందినదీ ఈ పథకము
రైతన్నలనాదుకొనే-రంజైన పథకము
ఋణవిముక్తి పథకము
4. రెండువేలఒకటినాటి మొండిఅప్పుల వడ్డీ మాఫి
అటెనుక పెండింగైతె-వడ్డీలోన సగం మాఫి
ఎన్కబడ్డ బకాయిలకు-ఇతర ఖర్చులన్ని రద్దు
కడితె తీరు ఋణమిదే-మించి పోని తరుణమిదే
5. కోర్టుకెక్కిన బాకైనా-ఫరవాలేదంట
తాతల నాటి అప్పైనా-పథకానికి తగునంట
కన్వర్షన్ క్రాపులోను-కైనా వర్తించునట
పాతబాకి చెల్లిస్తే కొత్తబాకి దొరుకునంట

(ఒక సందర్భానికి మిత్రుల బలవంతం మీద కమర్శియల్ గా కూడ రాయగలననే పందెం మీద రాసిన పాట)

రాకరాక వచ్చెనేడు పండుగు- చిన్ననాటి దోస్తు కలిసినందుకు
ఆర్డరియ్యి వెంటనే మందుకు- గ్లాసులన్ని పెట్టవోయి ముందుకు
అందరం హాయిగా తాగెటందుకు-కమ్మనైన నేటి విందుకు
1. బాధలన్ని మరచిపోయె సమయమే ఇది
భాయిభాయి కలిసిపోయె తరుణమే ఇది
చిత్తుగా తాగవోయి చిందులేయగా మది
వూగిపోవాలిగా నా హృది-ఈ గది
2. ఎన్నడూ మరవలేని గురుతుగా మారనీ రాతిరి
ఎవ్వరూ జరుపుకోని రీతిగా సాగనీ పార్టీ
మందేమో గొంతులోకి వెళ్ళాలి- పాటలెన్నొ గొంతెత్తి పాడాలి
ఖుషీగా నషాగా వొళ్ళుతేలిపోవాలి –
మత్తుకే మత్తువచ్చి సొమ్మసిల్లిపోవాలి
3. సిగ్గులన్ని పక్కనెట్టి పెగ్గుమీద పెగ్గుకొట్టు
మధ్యమధ్య నాటుకోడి లెగ్గు కాస్త నోటబెట్టు
తుళ్ళితుళ్ళినవ్వుకొనే పచ్చిజోకులెన్నొజెప్పు
మళ్ళిమళ్ళినీ దోస్తుగ పుట్టకుంటె ఒట్టుపెట్టు
సర్వము తానైనవాడు శ్రీగురుడు- సృష్టి స్థితి లయ కారకుడు
ఘటనా ఘటన సమర్థుడు- అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు
దీనుల పాలిటి కల్పతరువుగ ఖ్యాతిని పొందినవాడు
అతడే అతడే సచ్చిదానంద సద్గురు దత్తుడు

1. మాయామయమౌ జగత్తులో సత్యము తానైనవాడు
అజ్ఞాన గాఢ తమస్సులో జ్యోతిగ వెలుగొందువాడు
అజరామయమైన ఆత్మకు తానే అమృతమైనవాడు
ఆదిమధ్యాంతరహిత ప్రణవ స్వరూపుడు
2. కంటికి దొరకక అంతట నిండిన సర్వాంతర్యామి
తోలుబొమ్మల ఆటలాడే జగన్నాటక సూత్రధారి
త్రిగుణాలు గలిగిన త్రిమూర్తి తానే దత్తాత్రేయుడు
ఆడించి ఓడించి లాలించిగెలిపించె పితృదేవుడు
3. గొడ్రాలికి బిడ్డలనిచ్చినవాడు
మృతుడికి ప్రాణము పోసినవాడు
రజకుని సైతం రాజుగ మార్చిన మహిమాన్వితుడే గురుడు
పతితపావనుడు బుధ వంద్యుడు శ్రీపాద వల్లభుడు
4. మోడును చిగురింప జేసినవాడు
మేడికి మహిమలు కూర్చినవాడు
వొట్టిపోయిన గేదెకు దండిగ పాడిని ఒసగినవాడు
గురువులగురుడు తానే జగత్పతి నృసింహ సరస్వతి
సంగీత సాధనయే సాయుజ్య సాధనము
గానామృతపానముతో
నరులజీవనము-పరమ పావనము

1. పాడుకున్నా పాటవిన్నా-పరవశించేను మనసు
రాగమన్నా అనురాగమన్నా-పులకరించేను తనువు
లయతో లయమై మది తన్మయమై ఊగిపోయేను శిరసు
పదమే పథమై పరమ పదమై నాట్యమాడేను పదము

2. శిశువులైనా పశువులైనా-వశులుకారా పాటకు
నాగులైనా వాగులైనా -ఆగిపోవా పాటకు
కవితాఝరికి నాట్యపురికి-వారధి కాదా గీతము
స్వరమేవరమై సాగేవారికి-సారథికాదా సంగీతము

3. నారద మహతి తుంబురకళావతి పలికిన వైనం
గీర్వాణి కఛ్ఛపి నటరాజ ఢమరు మ్రోగిన యోగం
మోహనబాలుని పిల్లనగ్రోవిన వినబడిన శ్రావ్యం
అనుభవించి భవముమించి తరియించగ జన్మధన్యం
ఆనందమైతే వేణుగానము
ఆవేదనైతే వాయులీనము
కళ్యాణమైతే మాణిక్యవీణ
కలచెదిరిపోతే సన్నాయి పాట
1. రోదనతో మొదలయ్యేను జీవన సంగీతము
అమ్మలాలి పాటయే అద్భుత సంగీతము
ఆలుమగల కలహాలే సంసారపు సరిగమలు
పసిపాప రువ్వేనవ్వులె ప్రతి ఇంట్లో పదనిసలు
2. కొండవాగు పాడుతుంది గలగలల సరాగము
కోకిలమ్మ పాడుతుంది కుహూకుహూ గీతము
గుండె గుండె నినదిస్తుంది తనకుతానె స్పందిస్తుంది
అలసిసొలసి అంతలోనే మౌనగీతి వినిపిస్తుంది
స్వాగతమయ్యా మహాశయా! సుస్వాగతమయ్యా మహోదయా
ఘనతవహించిన ఘనులే మీరు-గణుతికెక్కిన మహనీయులు
1. మీరాకతోనే ఈ సభనేడు -పరిపూర్ణత సంతరించికొనెను
మిము దర్శించగ మామనసీనాడు-ఆనందముతో డోలలూగెను
2. మా ఆహ్వానము మన్నించిమీరు-పెద్దమనసుతో ఇట కేతెంచినారు
క్షణమైన తీరిక చిక్కనివారు-దయతో సమయము కెటాయించినారు

3. అరుణ తివాచీలు పరువగ లేము -పన్నీటిజల్లులు చల్లించలేము
పుష్పవర్షమును కురిపించలేము-కనకాభిషేకము చేయించలేము

4. ఏరీతిగ మిము సమ్మానింపగలము-ఏపదముల మిము కీర్తించతరము
ఉడుతాభక్తిగ వందన మిడుదుము-మీ కీర్తి గురుతుగ జేజేలు కొదుదుము
మా బాబు బంగారు కొండ
మా తండ్రి వజ్రాల కొండ
మముగన్న పగడాల దండ
నీకు పరమాత్ముడే అండదండ

1. నవ్వుతేనే ముత్యాల వాన
ముద్దుమురిపాలె రతనాలకోన
ఆటపాటల్లె వరహాల మూట
నోటి మాటలే తేనేల ఊట

2. నడయాడు నీవేర మానోము పంట
సిరిలొలుకు నువ్వేర మాకలల పంట
నీరాకతోనిండె వెన్నెలే మాఇంట
వెయ్యేళ్ళు వర్ధిల్ల దీవింతునంట

3. ఎక్కెకి నీవెందు కేడ్చేవు నాన్నా
ఊరుకోఊరుకో చిన్నారి కన్నా
వేదనలు బాధలు నీకేలనయ్యా
ఆదమరచి హాయిగ నిదురపోవయ్యా
చేజేతులారా చేసుకోకు నేస్తం
పండంటి సంసారం ప్రత్యక్షమైన నరకం
ఏమరుపాటుగా చేజారనీకు నేస్తం
పగిలితే అతకదు అద్దం-పదిలంసుమా జీవితం
1. మలుచుకుంటె ప్రతి బ్రతుకు-మణిదీపమై వెలుగు
మనసుంటె ప్రతి మార్గం-చేర్చేనుగా స్వర్గం
పట్టుదలే ఉలిగా చేసి భావి శిలను దిద్దుకో
ఓరిమితో గాలంవేసి ఎద చేపను పట్టుకో

2. నీడ చూసి బెదిరావంటే- వెలుగైనా భయపెడుతుంది
అనుమానం ముదిరిందంటే- అనుబంధం చెడగొడుతుంది
అనురాగపు రాగం పాడితె- నీ గీతం రసగీతం
ఆనందపు గుళికలు వాడితె-నీ రోగం మటుమాయం
మల్లెలు పూసే నా మదిలో
అది ఏమాసమైనా మధుమాసమే
వెన్నెలకాసే నా తలపులలో
అమవసనిసిలోను ఆహ్లాదమే

1. లేనివెక్కడ లేమి వేదన
కార్చనిదెవరిల కన్నీరు
బాధే సుఖమను భావన కలిగిన
జీవనమే కదా బృందావనము

2. చిరునవ్వుమాటున బడబాగ్ని దాగద
హృదయాంతరాళాన ప్రళయ హేల
విశ్వజనీనము అనురాగమైన
రాగము ద్వేషము హాస్యాస్పదము

3. శాంతి సుఖము తృప్తియన్నవి
అనుభూతికే కదా అందునవి
అందగ రాని చందమామను
పొందగరాదా అద్దమునందున
వెళ్ళిరానేస్తం! వెళ్ళిరా వెళ్ళిరా(వీడ్కోలిదె వెళ్ళిరా)
నీ భవితన విరియాలి మురిపాలవెల్లిరా
మాయదారి ఈలోకం ఓ ఊసరవెల్లిరా
మనస్నేహం ఏనాటికీ వాడని సిరిమల్లిరా

1. బీరకాడ బీడీలు మావితోపు కబాడీలు
ఒకరిమీద ఒక్కరము చెప్పుకున్న చాడీలు
ఏటిలోన ఈతలు-కోతికొమ్మ ఆటలు
చిన్ననాటి మన చేతలు మధురమైన గాధలు

2. కోకిలమ్మ కూకూ అంటే నాపాటగ భావించుకో
పిల్లగాలి నిమిరిందంటే ఆలింగనమే అనుకో
వానచినుకు తాకిందంటే కరచాలనమని అనుకో
మేఘమాల మెరిసిందంటే నా కుశలం తెలుసుకో

3. ఏడాదికోమారైనా ఉగాదిలా కదిలిరా
జన్మకోశివరాత్రిగ మనమైత్రిని చేయకురా
ఏదేశమేగినగాని ఎందరెందరో నీకున్నగాని
మనచెలిమిని ఎన్నటికీ మరువనే మరువకురా

4. ఉత్తరాలు మోయలేవు గుండెలోని భావమంతా
ఉత్తమాటలెందుకులే మదినిండా నీవేనంటా
ప్రతికలయిక గమ్యము విడిపోవడమేనంటా
అనుభవానికొచ్చేవరకు చేదునిజమిది ఎరుగనంటా
మరణమా నీవింత దారుణమా
కారుణ్యమే ఎరుగని కాఠిన్యమా
కనురెప్పపాటులోనే కబళించు రక్కసివా
పండంటి బ్రతుకులనే బలిగొనే ఘోరకలివా
1. ఉప్పెనలూ భూకంపాలు నీసృష్టి కార్యాలు
రోగాలు ప్రమాదాలు నీ క్రౌర్య రూపాలు
క్షామాలు సంక్షోభాలు నీ కృపా కటాక్షాలు?
అనాధలూ అన్నార్తులూ నీదయావిశేషాలు
2. కన్నతల్లి గుండెకోత నీకద్భుత వినోదము
చిన్నిపాప కఠంశోషనీకమితమైన మోదము
పారాణి ఆరకముందే పతిని విడదీయుటనీనైజం
ముసలితల్లిదండ్రులదిక్కగు సుతుని ఎడబాపుట నీవైనం
3. కనులు విప్పిచూడని పాపను గొయ్యితీసి పూడుస్తావు
ఇపుడిపుడే ఎదిగే మొక్కను మొదలంటా పెరికేస్తావు
పడుచుజంట ఆశలనన్ని- చితిలోన కాలుస్తావు
అంతులేని వేదన మినహా నీవేమి మిగులుస్తావు
4. ఇపుడే మాటాడిన మిత్రుని-ఇట్టే నువు మాయంచేస్తావ్
చిరునవ్వుల మాలోగిలిని ఇంతలోనె నరకం చేస్తావ్
నూరేళ్ళ బంధాన్నిసైతం-నిమిషంలో నువు తెంచేస్తావ్
కన్నీటి వరదల్లోనా నిర్దయగా మము ముంచేస్తావ్
గమ్యమెరుగని ఓ బాటసారి
నువు పయనించే దారి ఎడారి
1. కనుచూపుమేరలొ కనిపించదేది
నీరు లేని సంద్రమురా అది
ఓపిక తగ్గి ఆశే ఉడిగి
ఏడ్వకముందే ఆలోచించర
2. ఎండమావులను నీటితావులని
భ్రమపడుతూ త్వరపడతావు
దప్పికగొన్ననీగొంతుకను
కన్నీటితోనే సరిపెడతావు
3. ఒంటెకాదురా నీ ఒంటరి బ్రతుకు
సాగలేదురా అది కడవరకు
ఎందుకురా ఈ రోదన నీకు
సరియగు దారి దొరుకును వెదకు
సంసార సంద్రాన మునిగేటి ఓ మానవా! దేవుడే శరణము
మనసేమొ అతి చంచలం-చేయర దేవుడికి మది అంకితం
నిన్ను నీవు తెలుసుకొనుటె నిజమైన తత్వము
1. సాటిమనిషికి సాయమునందించు
హరిసేవ అదియే సత్యము
మనిషిలొ దేవుని చూసినంతనె
కలుగును లేరా పరసౌఖ్యము
ఎందులకీ స్వార్థము-ఎరగర పరమార్థము
సర్వజనుల సౌఖ్యచింతనతొ సాఫల్యమొందేను నీ జన్మము
2. పరమాత్మ సన్నిదియె మానవుని పెన్నిధి అన్నది అద్వైతము
మట్టిమనిషిలో పిచ్చిప్రాణములొ-పరమాత్మ రూపము లభ్యము
మానవుని సేవలో- మహనీయుల త్రోవలో
చేరిపోర జీవన తీరము- చివర నీకు దేవుడె శరణము
జీవితమే పెద్ద హోరు
వయసే పారే సెలయేరు
ఎందులకీ బ్రతుపోరు
ఎపుడూ ఉంటుంది కన్నీరు
1. బాల్యమేమో బడిలోన మరిచేను
యవ్వనాన్ని చెలి ఒడిలోన విడిచేను
సంసార జీవనము చెరసాల సమము
వృద్ధాప్యమంతా వ్యధతోనె గడచును
2. ఏదో అందుకోవాలని ఆరాటం
తీరని కోర్కెల ఉబలాటం
దినదినము ఆకలి పోరాటం
అనుక్షణము మృత్యువు చెలగాటం
3. మంచిని త్రుంచి వంచన పెరిగెను
మనిషి మనసులో ఘర్షణ జరిగెను
నూరేళ్ళబ్రతుకున ఏమి ఒరిగెను
తత్వచింతనయె తరియింపజేయును
నీ ప్రేమ కోరిన జీవినేను
నీముందు నేను అల్పుడను
నీ దాసానుదాసుడను

1. శిలయైన మనసును శిల్పంగ మార్చేవు
శిల్పాన్నె చివరకు శిథిలాన్ని చేస్తావు
మనసుతోనే సయ్యాటలా ప్రభూ!
మనిషితోనే దొంగాటలా
2. అందనిఅందాలనెన్నో సృష్టిస్తావు
అందరికీ ఆశలు కలిగిస్తావు
భ్రమలనెన్నో కలిపిస్తావు ప్రభూ!
మాలోనిన్నే మరిపిస్తావు
గోదావరంటేనె నాకెంతొ ఇష్టం
మా వూరి(ధర్మపురి) గోదారి మరి ఎంతొ ఇష్టం
1. వాన చినుకే శైశవత్వంగా
పిల్లకాలువయే పసితనంగా
యవ్వనంతొ గోదారి ఎగురుతూ ఉరుకుతూ
కలిసిపోతుంది కదలిలో-రుచిని గతిని విడిచి
2. నిండుకుండవోలె గాంభీర్యముతో
అంతుతెలియని అంతరంగంతో
పదిమందికీ సాయపడుతుంది
ఫలితాన్నివారికే వదిలి వేస్తుంది
3. తనునర్పించి తానణిగి ఉంటుంది
ఆవేశమొచ్చెనా ఉప్పొంగి పోతుంది
మనిషి బ్రతుకునకు మచ్చుతునకలాగ
మహిలోనవెలుగును మణిపూసగా
4. గోదావరే నా జీవితానికి దారి
దానిహోరే నాకు జయభేరి
గోదావరే నాకు ఆదర్శనీయముర
వేదాలకన్నా పూజనీయమురా
నేనునేనని అంతా నాదని-ఎగురుటెందుకే మనసా
మూడునాళ్ళముచ్చట బ్రతుకని ఎరిగి మరతువే మనసా
1. శాంతి సుఖము తృప్తి యన్నవి ఎచటనొ లేవే మనసా
బ్రతుకుతోటి రాజీ పడుతూ-నందమొందవే మనసా
2. వెలుగువెలుగని వెతికేవు కాని-వెలుతురెందుకే మనసా
చీకటి వెలుగుల చిందులాటనే జీవితమన్నది మనసా
3. ప్రేమప్రేమనే పెనుగులాటలో రామునె మరతువె మనసా
చేసేది చేయక కూడనిది చేసి-చెడుదువెందుకే మనసా
4. గీతాబోధలు బ్రతుకు బాటలు-ఎరిగి ఎందుకే మనసా
ఆలోచనలతొ సతమత మయ్యి-హతమయ్యేవే మనసా
5. ఫలమును కోరక కృషిచేసిచూడు-విజయమునొందేవు మనసా
శ్రీవీరహనుమాన్ దయనీపైన-ఎప్పుడుయుండునె మనసా

ఈ లోకంలో నీ వొంటరివి

ఈ లోకంలో నీవొంటరివి
ఏనాడైనా ఏకాకివి
విశ్వమనంతం కాలమనంతం
అంతానేననే ఎందులకీ పిచ్చిపంతం
1. ఎవరెవరు నీవాళ్ళు ఎందాక స్నేహితాలు
ఎవరు హితులు- ఎవరు మిత్రులు
బెల్లముంటె సరి ఈగలు
నిజం మరచి నిదురోయేవు -ఏటిలోన మునిగేవు
లేనెలేదు స్నేహితత్వం-అసలులేదు మానవత్వం
సృష్టిలోని భ్రమలన్నిటికీ-ప్రతి మనిషీ బానిసత్వం

2. నేలవిడిచి సాములు- ఉత్త గాలిమేడలు
నూనెరాని గానుగలు-బ్రతికిన ఈ పీనుగలు
ఎవరురారు నీదారికి-నీకు నీవె మరి ఆఖరికి
భయపడకు ధైర్యం విడకు-ప్రతి క్షణము తొందర పడకు
ఎక్కరాని శిఖరాలైనా- చేరగలవు నీవే తుదకు