Sunday, June 7, 2009

Ok

మరణమా నీవింత దారుణమా
కారుణ్యమే ఎరుగని కాఠిన్యమా
కనురెప్పపాటులోనే కబళించు రక్కసివా
పండంటి బ్రతుకులనే బలిగొనే ఘోరకలివా
1. ఉప్పెనలూ భూకంపాలు నీసృష్టి కార్యాలు
రోగాలు ప్రమాదాలు నీ క్రౌర్య రూపాలు
క్షామాలు సంక్షోభాలు నీ కృపా కటాక్షాలు?
అనాధలూ అన్నార్తులూ నీదయావిశేషాలు
2. కన్నతల్లి గుండెకోత నీకద్భుత వినోదము
చిన్నిపాప కఠంశోషనీకమితమైన మోదము
పారాణి ఆరకముందే పతిని విడదీయుటనీనైజం
ముసలితల్లిదండ్రులదిక్కగు సుతుని ఎడబాపుట నీవైనం
3. కనులు విప్పిచూడని పాపను గొయ్యితీసి పూడుస్తావు
ఇపుడిపుడే ఎదిగే మొక్కను మొదలంటా పెరికేస్తావు
పడుచుజంట ఆశలనన్ని- చితిలోన కాలుస్తావు
అంతులేని వేదన మినహా నీవేమి మిగులుస్తావు
4. ఇపుడే మాటాడిన మిత్రుని-ఇట్టే నువు మాయంచేస్తావ్
చిరునవ్వుల మాలోగిలిని ఇంతలోనె నరకం చేస్తావ్
నూరేళ్ళ బంధాన్నిసైతం-నిమిషంలో నువు తెంచేస్తావ్
కన్నీటి వరదల్లోనా నిర్దయగా మము ముంచేస్తావ్

No comments: