Tuesday, December 17, 2013

“కళ్యాణ గీతం “


కళ్యాణ గీతం

దిగివచ్చిరి  దేవతలూ ఆత్మీయంగా
వధూవరుల మనసారా  దీవించంగా
కనీవినీ ఎరుగన౦త వైభవోపేతంగా
జరిగె ఈ పరిణయం  కమనీయంగా

జనులుమెచ్చేఈడూ జోడైనఈజంట
బంధుమిత్రులందరికీ కన్నుల పంట

        
1.    విశ్వకర్మ విస్తుపోయె మండపాన్ని నిర్మించ
రతీదేవి మతిపోయే పన్నీరు చిలరింప
కుబేరుడే ఆప్తుడిగా పెండ్లి పనులు నిర్వహించ
సాక్షాత్తు లక్ష్మీదేవి సాదరంగా ఆహ్వానించ

        కనీవినీ ఎరుగన౦త వైభవోపేతంగా
        అనువైన మనువుఎంతొ మనోహరంగా

2.     విధాతయే విధివిధాన లగ్న క్రతువు జరిపించ
వశిష్టుడే మంగళాష్ట కాలెన్నో పఠియి౦చ
సరస్వతీదేవియే సంగీత లహరి నోలలాడించ
అన్నపూర్ణమ్మనే కమ్మగా వండీ వడ్డించ

మంత్రాక్షరాలే అక్షతలై కురియ౦గా
తిలకించిన  నయనాలే  తాదాత్మ్యంగా

3.     రాధా కృష్ణుల అనురాగ రస ఝరియై
సీతారాముల అన్యోన్య కాపురమై
శివపార్వతుల అర్ధ నారీశ్వరమై
వర్దిల్లనీ వధూవరుల దాంపత్యం వరమై

శ్రుతీ లయ లయమైన భాజాలు మ్రోగంగా
శుభకరమౌ వివాహం శ్రవణపేయంగా
       
4.     అత్తవారింటికి వెలుగిచ్చే రమ్యదీపికగా
ఆడపడచులందరికీ తలలో నాలుకగా
శ్రీవారిమదిననెరిగి చేదోడు వాదోడుగా
ఖ్యాతి పొందు మా తనయ  పుట్టింటికి పేరు తేగ

        కనీవినీ ఎరుగన౦త వైభవోపేతంగా
        జరిగెఈ  కల్యాణం ఆహ్లాదకరంగా






Saturday, December 14, 2013

ఆనందో బ్రహ్మకు –శబ్దాంజలి

ఆనందో బ్రహ్మకు –శబ్దాంజలి ! హాస్య స్రష్ట కు శ్రద్దాంజలి !! రాఖీ-9849693324
సాకి:
పేలిన FUN BOMB వు-హ్యూమరసపు గంగ వు
వార్తల డింగ్ డాంగ్ వు-COMEDY కి కింగ్ వు
పల్లవి:
రాలిన ధ్రువతారవు-నవ్వుల నటరాజువు
కడిగిన ముత్యానివి-కరిగిన స్వప్నానివి
ఓ /మా ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారు-హాస్యరసం/అబిమానులు/చిత్రసీమ/ చేసుకున్న పుణ్యం మీరు
అనుక్షణం ఆనందో బ్రహ్మైన తీరు-గడిపిన మీ జీవనం ధన్యం మాష్టారు
1.      స్వచ్చమైన హాస్యానికి మీరేలే మచ్చుతునక
తోకలేనిపిట్ట సినిమా దర్శక
చతురోక్తులు విసురుటలో మీదేలే ఘనత
సృష్టించారు మీదైన ముద్రతో చరిత

చిరునవ్వుల వాసంతం - సదా మీకు సొంతం
వినోదాలె పంచారు మీ జీవితాంతం
మీతరహా అభినయం-చిత్ర జగతిలో శూన్యం
చెప్పినారు వెకిలి లేని హాస్యానికి bhaasభాష్యం

ఓ /మా ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారు-హాస్యావని మీ శైలి అనన్యం సారూ
టీవీ నాటక సినిమా రంగాలు-అర్పించెను తలవంచి మీ నటనకు జోహారు

2.      కొమ్మినేని వారి పాలెం మీ జన్మస్థలం
ఇంటిపేరు ధర్మవరం-మీరు అమ్మా నాన్న  తప:ఫలం
షట్కర్మాచారిణి  మీ ధర్మపత్ని కృష్ణజ
మీ  కీర్తి వారసులు  రోహన్ రవి   బ్రహ్మతేజ

ఆడపిల్లలంత  మీకు అభిమాన పాత్రులు
కవులు మాత్రమే కాదు -మీరు  మధుర గాత్రులు
వంచనే.... ఎరుగనిమంచి -రాజకీయ వేత్తవు
సాటి నటులు కొనియాడే ధీరోదాత్తుడవు

ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారు - మూర్తీభవించిన కారుణ్యం మీరు
ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారు పోతపోసిన  గాంభీర్యం మీరు

నవ్వూ నువ్వూ-నువ్వు నవ్వించే నవ్వు-ఆచంద్ర తారార్కం ఆనందాలు రువ్వు




Monday, September 9, 2013

విజయ గణపతి శుభ కామనలు...!!

రాఖీ||ఓం గం గణపతయే నమః||

ఆగజ తనయ –ఆది దేవా
ఇంద్రాది వందిత-ఈశ్వర నందన
ఉత్తమోత్తమ -ఊహా జనిత
ఋషి ముని వినుత ఋణ విమోచక...నమో నమః

1.       ఎలుక వాహన -ఏనుగు వదన
ఐహిక మోహ పాశ ఖండిత
ఒకడవు నీవే ఓ వికట రూప
 అజ్ఞాన రుగ్మతకు ఔషధమీవే
అంబా ప్రియహే నమో నమః

2.ఏక దంత –ద్వైమాతురా
త్రిగుణాతీత -త్రిలోక పూజిత
చతుర్వేద పరిపూర్ణ స్వరూపా
పంచేంద్రియ జయ హే పంచామృత ప్రియ
అగణిత గుణగణ గణ నాథ విఘ్నేశ

3.షడ్వర్గ అరి హర-సప్తవ్యసన దూర
అష్ట సిద్ది ప్రద అష్ట వినాయక
నవ రాత్ర్యోత్సవ నవనవోన్మేష
నవరస పోష దశ దిశ విఖ్యాత
లంబోదర హేరంబా సుముఖా  


09-09-2013

Friday, July 12, 2013

రాఖీ||మృతి లేని స్మ్రుతి..||


రాఖీ||మృతి లేని స్మ్రుతి..||

తప్పదింక వీడుకోలు...
తప్పవు ఎడబాటు సెగలు..
వదిలివెళ్ళు..మిత్రమా..జ్ఞాపకాలనైనా
మోసుకెళ్ళు నేస్తమా..తీపి గురుతులైనా..

1.     కలిసి ఉన్న ఇన్నాళ్ళు
విలువ తెలుసు కోలేదు..
మా మధ్యే తిరుగుతున్నా
మహిమను గుర్తించ లేదు
చే..జారి పో..యిన  మణిపూసవే నీవు
కన్నుమూసి తెరిచేలోగా కనుమరుగౌతున్నావు
       వదిలివెళ్ళు..మిత్రమా..జ్ఞాపకాలనైనా
       మోసుకెళ్ళు నేస్తమా..తీపి గురుతులైనా..

2.     పట్టు బట్టి వెంట బడ్డా
మేమూ పట్టించుకోలేదు
ఎగతాళిగ పరిహసించినా
నీ చిరునవ్వు మాయలేదు.
చేయనీయి నేస్తమా మా కన్నీటి సంతకాలు
మన్నించు  మిత్రమా మా పొరపాట్లు తప్పిదాలు
మిగుల్చుమా ..మిత్రమా..అనుభూతుల నైనా
తీసుకెళ్ళు ..నేస్తమా..అనుభవాల నైనా....

రాఖీ|| రెప్ప పాటే జీవితం ||


రాఖీ|| రెప్ప పాటే జీవితం ||
రెప్ప పాడెను జోల పాట
నిదుర పొమ్మని కలల కౌగిట
అలసి సొలసిన ఎదకు ఊరట
ఆవులింతకు తావు లేదిట
1.    హాయి కొరకు రేయి వరకు
తల్లడిల్లిన తనువు తపనకు
విశ్రాంతి కొరకు పడక చెంతకు
పరుగులెత్తే చిత్త చింతకు
ఆదమరువగ సేద తీరగ
బజ్జో బెట్టి జోజ్జో కొట్టగ
2.    తిరిగి రాని  గతము గతమే
రూపు లేనిది రేపే మాయే..
కరుగనీయకు మధుర క్షణము
కునుకు  గలిగిన కన్నులె వరము
అహము ఇహము మరువు దేహము
స్వర్గ ధామము స్వప్న లోకము


Thursday, May 30, 2013

||రాఖీ||వైద్య నాథం నమామ్యహం ||
||శ్లో||ఓం త్రయంబకం యజామహే- సుగంధిం పుష్టివర్ధన౦ |
ఉర్వారు కమివ బంధనాత్-మృత్యోర్ముక్షీయ మామృతాత్||

నీల కంధరా-జాలి చూపరా
బేలనైతిని –ఆదరించరా
వెన్నవంటి మనసు నీది-వెన్నెలంటి చూపు నీది
అన్యులను నే నెరుగకుంటి- నీవే నాకిక శరణమంటి

1.     ఈతిబాధల నోపకుంటి –ఈశ్వర దరిజేర్చుకోరా
వ్యాధిగ్రస్తుల పాలిటి –వైద్యనాథ వేగరారా
కాలకాల తాళ జాల-మృత్యుంజయ చేయ౦దుకోర

వెన్నవంటి మనసు నీది-వెన్నెలంటి చూపు నీది
అన్యులను నే నెరుగకుంటి- నీవే నాకిక శరణమంటి

2.     పోరిపోరి నీరసించితి –రుజల పీడన సైచితి
రుచిని వీడితి,తీపి మరచితి-పథ్యములతో జిహ్వ చంపితి
సూది పోట్లే దేహమంతా-బ్రతుకు నాకొక నిత్య చింత

వెన్నవంటి మనసు నీది-వెన్నెలంటి చూపు నీది
అన్యులను నే నెరుగకుంటి- నీవే నాకిక శరణమంటి

3.     భాగ్యమిమ్మని కోరలేదు-ఆరోగ్యమిస్తే చాలు నాకు
భోగమిమ్మని వేడలేదు –రోగముక్తే మేలు నాకు
నిధుల నిమ్మని అడుగలేదు-నలత నాకిక రూపుమాపు
వెన్నవంటి మనసు నీది-వెన్నెలంటి చూపు నీది
అన్యులను నే నెరుగకుంటి- నీవే నాకిక శరణమంటి