Thursday, May 30, 2013

||రాఖీ||వైద్య నాథం నమామ్యహం ||
||శ్లో||ఓం త్రయంబకం యజామహే- సుగంధిం పుష్టివర్ధన౦ |
ఉర్వారు కమివ బంధనాత్-మృత్యోర్ముక్షీయ మామృతాత్||

నీల కంధరా-జాలి చూపరా
బేలనైతిని –ఆదరించరా
వెన్నవంటి మనసు నీది-వెన్నెలంటి చూపు నీది
అన్యులను నే నెరుగకుంటి- నీవే నాకిక శరణమంటి

1.     ఈతిబాధల నోపకుంటి –ఈశ్వర దరిజేర్చుకోరా
వ్యాధిగ్రస్తుల పాలిటి –వైద్యనాథ వేగరారా
కాలకాల తాళ జాల-మృత్యుంజయ చేయ౦దుకోర

వెన్నవంటి మనసు నీది-వెన్నెలంటి చూపు నీది
అన్యులను నే నెరుగకుంటి- నీవే నాకిక శరణమంటి

2.     పోరిపోరి నీరసించితి –రుజల పీడన సైచితి
రుచిని వీడితి,తీపి మరచితి-పథ్యములతో జిహ్వ చంపితి
సూది పోట్లే దేహమంతా-బ్రతుకు నాకొక నిత్య చింత

వెన్నవంటి మనసు నీది-వెన్నెలంటి చూపు నీది
అన్యులను నే నెరుగకుంటి- నీవే నాకిక శరణమంటి

3.     భాగ్యమిమ్మని కోరలేదు-ఆరోగ్యమిస్తే చాలు నాకు
భోగమిమ్మని వేడలేదు –రోగముక్తే మేలు నాకు
నిధుల నిమ్మని అడుగలేదు-నలత నాకిక రూపుమాపు
వెన్నవంటి మనసు నీది-వెన్నెలంటి చూపు నీది
అన్యులను నే నెరుగకుంటి- నీవే నాకిక శరణమంటి

No comments: