Tuesday, January 9, 2018

రచన:రాఖీ॥సారస్వత సామ్రాజ్ఞి

నీ దాసుడనే నీ ధ్యాసుడనే
నిమిషము మరువని నీ భక్తుడనే అనురక్తుడనే
దయగను దేవీ హృదయముగనవే
కణకణమూ నీ భావనయే
అనుక్షణమునీ ఆరాధనయే

1.నీ పద సన్నధి నాకది పెన్నధి
నీ వీక్షణలో కరుణరసాంబుధి
నీ దరహాసము నిజ మధుమాసము
నీ సాన్నిధ్యము నిత్య కైవల్యం
దయగను దేవీ అనురాగము గనవే
అక్షరమౌ నీ భావనయే
సలక్షణమౌ నీ సాధనయే

2.నీ పూజకు నే చామంతిని
నీ ఆటకు నే పూబంతిని
నటనలు చాలించి అక్కున జేర్చవె
చరణము లందించి  గ్రక్కున బ్రోవవె
పలుకుల రాణీ నను చులకన జేయకు
శరణము నీవే శరదిందు వదన
ననునడిపించవె సవ్య పథమున.. నవ్య పథమున

Monday, January 8, 2018

రాఖీ॥విరహిణి

రాధిక రాదిక
గోపాలా...
కరిగే కల చేదిక
ఎద కలచే దిక
ఏవేళా...
నా జీవనమున బృందావనమున
కలువల కన్నుల
ఎదురు తెన్నులా...

1.అకులసడినీ రాకగ పొరబడి
కోకిలపాటని మురళీ రవమని
పొదలో కదిలే నెమలి నీ పింఛమని
ఆరాటపడితిని నేభంగపడతిని

2.పున్నమి వెన్నెల ఉసిబోవనేల
అన్నులమిన్నల ఊరించనేల
వెన్నలదొంగా బాసలు నీకేల
వన్నెలు మార్చే మోసములేల

Tuesday, January 2, 2018

అలాగేకాని ప్రభూ అలాగేకానీ
ఇలా వేధించడం నీకిష్టమైతే
అలాగేకానీ అలాగేకానీ
జాలిమానిన కర్కషుడిలా
కరుణనెరుగని రాక్షసుడిలా
ఇలా హింసించడం నీకిష్టమైతే
అలాగే కానీ అలాగే కానీ

1.దయగలిగి దాఖలాయే ఎరుకలోన లేనే లేదు
పసితనాన సైతం కనికరించిందిలేదు
పుట్టిబుద్దెరిగేనాడు సుఖపడ్డ రోజేలేదు
నీసృష్టిలోపాన్ని సవరించు సోయేలేదు
అలాగేకాని ప్రభూ అలాగేకానీ
ఇలావంచించడం నీకిష్టమైతే
అలాగే కానీ అలాగే కానీ

2.వింతవింత వ్యాధులన్ని అంటగట్టిఆనందిస్తావ్
భరించరాని వెతలలొ నెట్టి పదేపదే చోద్యం చూస్తావ్
సూదిపోట్లు గుచ్చిగుచ్చి వాయిదాల్లొ చంపేస్తావు
భూతలాన వెదికితె దొరకని కౄరమైన శిక్షలువేస్తావ్
అలాగే కాని ప్రభూ అలాగే కానీ
ఇలానే అఘోరంచడం నీ తత్వమైతే
అలాగే కానీ అలాగే కానీ

Friday, December 29, 2017

కవితా దినోత్సవ శుభాకాంక్షలతో

॥రాఖీ॥కవి సంగమం

కవి సంగమం-హృదయంగమం
బహుముఖ ప్రజ్ఞా పాటవ అపూర్వ మేళనం
కవితలపుల ఉదయించిన కవితల పుట్టిల్లు
భావుకతల చిరుజల్లు..అనుభూతుల హరివిల్లు

1.అక్షర శిల్పులు చెక్కిన రమ్య శిల్పారామం
పదపదమున ఎద కుదిపిన మానవతా ధామం
మల్లెలు మొల్లలు ముళ్ళున్న రోజాలు
పారిజాత మధూ’క ‘ వనాలు...మొగిలి పొదల ప’వనాలు
కవితలపుల ఉదయించిన కవితల పుట్టిల్లు
భావుకతల చిరుజల్లు..అనుభూతుల హరివిల్లు

2.మాటలు తూటాలుగ పేల్చే తుపాకులు
భావాలు బాంబులే సంధిచే శతఘ్నులు
గేయాలు గీతాలు నానీలు ఫెంటోలు హైకూలు
తీరైన కవితారీతులు తీరని కవిత్వ ఆర్తులు
కవితలపుల ఉదయించిన కవితల పుట్టిల్లు
భావుకతల చిరుజల్లు..అనుభూతుల హరివిల్లు

15/10/2017

("కవి సంగమం" ఒక ఫేస్ బుక్ గ్రూపు)
రాఖీ ॥"రమ్యస్మృతి"॥

నిదుర నేను పోదామంటే
ఎప్పుడు నువ్వొస్తావో
మెలకువగా ఉందామంటే
కలనైన కనిపిస్తావో

అశ్రు తర్పణం చేద్దామంటే
కనుల నుండి నువు జారేవో
హృదయ మర్పితం చేద్దామంటే
తెలియకుండ అది నిను చేరేనో

ఏమివ్వగలను నేను
ఏమవ్వగలను నేను
కవితయై నిన్నలరిస్తా
రమ్యస్మృతినై నీలొ నిలుస్తా