Sunday, January 21, 2024

 


https://youtu.be/ziotd5v8QzY?si=egN7nWmdyX74-_G4

రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ

రాగం:హిందోళం

స్వాగతాలు నీ కివే సంక్రాంతి లక్ష్మీ
ప్రణతులు గొనుమిదే పౌష్యలక్ష్మీ
నమస్సులు గైకొను మకర సంక్రమణాన కర్మసాక్షీ
ప్రశంసలనందుకో మా గృహలక్ష్మీ
భోగి సంక్రాంతి కనుమ పర్వదినములకు
శుభాకాంక్షలివిగో బంధుమిత్ర సాహితీజనములకు

1.మూల బడిన వస్తువులను బయట కుప్పవేసి-
మరపురాని పనితనాన్ని మననం చేసి-
సేవానిరతిని గుర్తించి పనిముట్లకు విముక్తి చేసి
శుద్ధి స్వచ్ఛతా స్వేచ్ఛల నిలుప బోగిమంటరాజేసి
హేమంతానికి వీడ్కోలు తెలుపగా
చలి గిలిగిలి ఇలనుండి సాగనంపగా
భోగి సంక్రాంతి కనుమ పర్వదినములకు
శుభాకాంక్షలివిగో బంధుమిత్ర సాహితీజనములకు

2. ఉత్తరాయణానికి లోకం ఆయత్త పడుచు
విత్తుల గాదెల నింపిన గిత్తల సాగిల పడుచు
వాకిళ్ళ కళ్ళాపి రంగవల్లి గొబ్బియలతో పల్లె పడుచు
పితృదేవతలకు భక్తిగా జనం తిలతర్పణాలిడుచు
కీర్తన జేసెడి హరిదాసుల హరిలొ రంగా
గాలిపటాలెగురవేయు పిల్లలు ఉత్సాహంగా
భోగి సంక్రాంతి కనుమ పర్వదినములకు
శుభాకాంక్షలివిగో బంధుమిత్ర సాహితీజనములకు

3.పట్టుచీరల రెపరెపలతొ ముత్తైదువలు
నోచుకున్న నోముల నొసగే చిరుకానుకలు
ఇంటింటా వచ్చిపోవు పేరంటాళ్ళ సందళ్ళు
విందులు వినోదాలు పందాలు అందాలు
గంగిరెద్దుల వారి ఆటల పాటలు కనుమ
కనుమ పండుగ వైభవం కనులారా కనుమ
భోగి సంక్రాంతి కనుమ పర్వదినములకు
శుభాకాంక్షలివిగో బంధుమిత్ర సాహితీజనములకు

No comments: