Thursday, November 7, 2019

https://youtu.be/GnsxHqRIDbM?si=eWNyGmfw0pGtjLqi

రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్(రాఖీ)

రాగం : శివరంజని

"తెలుగదేల యన్న దేశంబు తెలుగేను
తెలుగు వల్లభుండ, తెలుగొకండ,
యెల్ల నృపులు గొలువ యెరుగవే బాసాడి,
దేశభాషలందు తెలుగు లెస్స."

తెగులు తగులుకున్నది తెలుగు తల్లికి
తెల్లబోయిచూస్తున్నది తన పిల్లల చేష్టలకి
తెలుగులు పరభాషా వ్యామోహపు పైత్యములో
తెలుగుభాష పరిస్థితులు చెప్పరాని దైన్యములో
మనతెలుగు భాష అనాథగా జగన్నాటకంలో
మన ఆంధ్రభాష సమాధిగా  అగాధమౌ జలధులలో

1.'అమ్మ'ను మమ్మీగా మార్చినపుడె తొలిగాయం
నాన్నను డాడీగా పిలిచినపుడె దయనీయం
అన్యపదము లాదరించు వైశాల్యము తెలుగుది
ఉన్నప్రథను విస్మరించు వైకల్యము తెలుగులది
మనతెలుగు భాష అనాథగా జగన్నాటకంలో
మన ఆంధ్రభాష సమాధిగా  అగాధమౌ జలధులలో

2.అందలాల నెక్కించి ఎందరికో పట్టం కడితే
ఎంతటి ధర్మమో ప్రజలతో ఆంగ్లం వాడ 'బడితె'
యథా రాజా తథా ప్రజా ఆనాటి మాట
ప్రజాశ్రేయమే కదా ప్రజాస్వామ్య ప్రగతి బాట
మనతెలుగు భాష అనాథగా జగన్నాటకంలో
మన ఆంధ్రభాష సమాధిగా  అగాధమౌ జలధులలో

No comments: