Wednesday, April 20, 2022

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


వీడికి మూడు నామాలు వాడికి మూడు నేత్రాలు

ఎంచిచూడబోతె సామ్యాలు ఇద్దరివొకటే సూత్రాలు గోత్రాలు

లీలామానుష వేషధారి ఒకడు

భోలా శంకర నటరాజు ఒకడు

మొక్కుతున్నా వాళ్ళనెపుడు లెక్కలేనన్ని మొక్కులు

తీర్చుకుంటె దిక్కులేదిక నాకున్న చిక్కులు


1.నది అంటే ఇష్టం వాడికి

కడలంటే ఇష్టం వీడికి 

నీరంటే ప్రీతే ఇద్దరికి

గిరులలో ఉనికి వాడికి

గిరులంటే తేలిక వీడికి

మొత్తానికి భూమే నచ్చును ఇరువురికి


2.కన్నులో నిప్పులు వాడికి

కడుపున జఠరాగ్ని వీడికి

అగ్గి ఎడల మొగ్గే ఇరువురికి

వాయువై లోనికి వీడు

ఆయువే తీయును వాడు

పంచ ప్రాణ వాయువులే ఉభయులు


3.విశ్వాకాశపు వ్యాపి వాడు

విశ్వాంతరాళ రూపి వీడు

శూన్యమంత ఆవరించిన శక్తి రూపులు

పంచభూతాలుగా వాడు

పంచప్రాణాలుగా వీడు

ద్వయతత్త్వాలూ ఒక్కడే ద్వయరూపీ అద్వైతుడే

No comments: