Wednesday, April 13, 2016

OK



ఎలా కూర్చి ఉంచావయ-అంతులేని ప్రేమలని
మనసు అంతరాలలోన ..........మమకారాలని
కమ్ముకున్న మబ్బువెనక-జాలి జాబిలీ
గ్రహణ మింక విడివడితే-ప్రభలుచిమ్ము కరుణ రవీ

1.    పెంచుకున్న పూలమొక్క –మమత నింక తెలుపదా
సాదుకున్న బొచ్చుకుక్క –భూతదయను చూపదా
పంచుకున్న బన్నుముక్క –మైత్రి విలువ నెరుగదా
మనిషి మసల  మనిషి లెక్క -మానవతను నిలుపదా
           కమ్ముకున్న మబ్బువెనక-జాలి జాబిలీ
           గ్రహణ మింక విడివడితే-ప్రభలుచిమ్ము కరుణ రవీ

2. జాతి మరచి పాలు కుడుప-మాతృత్వం వెలుగదా
విభేదాలు విస్మరింప-సౌభ్రాతృత్వం విరియద
ఉన్నంతలొ సాయపడగ-లేమి తోకముడవదా
హృదయ మెంతొ విస్తరింప-దయాగుణం గెలువదా
           కమ్ముకున్న మబ్బువెనక-జాలి జాబిలీ
           గ్రహణ మింక విడివడితే-ప్రభలుచిమ్ము కరుణ రవీ

3.       బ్రతుకు రైలు పయనంలో-చోటులోన సర్దుబాటు
గుణపాఠపు బడిలోనా- నడవడికల దిద్దుబాటు
దాంపత్యపు సుడిలోనా-అన్యోన్యపు తోడ్పాటు
వసుధైక కుటుంబమనగ-తిరుగులేని  జరుగుబాటు

           కమ్ముకున్న మబ్బువెనక-జాలి జాబిలీ
           గ్రహణ మింక విడివడితే-ప్రభలుచిమ్ము కరుణ రవీ

http://www.4shared.com/mp3/AG_smnJ0ba/___online.html







Sunday, April 10, 2016

జనం జలం

https://youtu.be/04UhmvjCEDg?si=0PMA-ejYv8RvhSfB

రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ

చినుకు చినుకు ఒడిసి పట్టు
కరువునింక తరిమికొట్టు
ఎనలేనిది కొనలేది ప్రతినీటిబొట్టు
ఒక్కబొట్టైన వృధాచేస్తే దైవం మీద ఒట్టు

1.మొక్కవొని తలంపుతో
లెక్కలేని తపములతొ
పరమశివుని మెప్పించి
భువికి గంగనే దింపి
చరిత్రార్థుడైనాడు భగీరథుడు
ఆదర్శప్రాయుడు మనకా మహనీయుడు

2.కొదవలేని వనరులతో
జీవనదుల జలనిధులతొ
సుజలాం సుఫలాం
సస్యశ్యామలాముగా
అలరారే భరతావని
ఇల తలమానికం
అలమటించ నేల నేడు
దాహార్తితో జనం

3.ఇంటింట చెట్లు నాటి
ఇంకుడుగుంతలే పెట్టి
ప్లాస్టిక్కుని వాడనట్టి
కాలుష్యరహిత సృష్టి
అత్యంత ప్రాధాన్యం మనకీనాడు
మనిషిమనుగడికనైనా మనసుపెట్టి కాపాడు

Friday, February 5, 2016

https://youtu.be/QUSMB-GctMs

షిరిడీ శ్రీకరా.,కరుణా సాగరా..
వరదా కావరా వేగమే ప్రేమ మీరా,.

1.మాయలెరుగలేము సాయి..మమతలోబడి,
అడుగులింక వేయలేము..నడక తడబడి,

నీ గుడివైపుకే.. వడివడి..సాగనీ
మే పసిపాపలమై నీ ఒడిన ఊగనీ


2.భవబంధాలలో బంధీలమైతిమి,
దేహపంజరాన సాయి-చిక్కుబడితిమి,

చెర విడిపించరా,..మము నడిపించరా,
ముదముతోడ..పరమ పదము నందనీయరా...

Thursday, November 12, 2015

OK



వృక్షమే లక్ష్యంగా -జీ’వనాన’ పయనిద్దాం
మానుయే గమ్యంగా -మనుగడను సాగిద్దాం
మొక్కలనే పాపలుగా –మన అక్కున చేర్చుకుందాం
చెట్టపట్టాలు కట్టి –చెట్టు జట్టు చేరిపోదాం

“బ్రతుకు తెరువు నేర్పేటి –గురువేగా ప్రతి తరువు
బ్రతుకు పరమార్థం తెలిపే-నిఘంటువే హరిద్రువు”

1.   పుడమి కడుపు చీల్చుకొని-తనకు తానే పుడుతుంది
ఆలన పాలన లేకున్నా-మొండిగా బ్రతికేస్తుంది
మోడుగా మారిన కూడా-చినుకు తాక చిగురిస్తుంది
దైన్యమన్నదే లేక-ధైర్యంగా నిలబడుతుంది

“బ్రతుకు తెరువు నేర్పేటి –గురువేగా ప్రతి తరువు
బ్రతుకు పరమార్థం తెలిపే-నిఘంటువే హరిద్రువు”

2.   పంచలేనిదేదీ లేదు-తరువు తనువులో
వినియో గించ దగినవే అణువణువూ-మాను మేనులో
విత్తు వేరు బెరడు పసరు-ఔషదాలె వ్యాధులకు
ఆకు కాయ పండు దుంప –అమృతాలె ఆహారానికి

“బ్రతుకు తెరువు నేర్పేటి –గురువేగా ప్రతి తరువు
బ్రతుకు పరమార్థం తెలిపే-నిఘంటువే హరిద్రువు”

3.   ఆకులూ తీగలతో-ఇంటికంద మిస్తుంది
పూవులూ ఫలములతో-పూజకు పనికొస్తుంది
ఎండా వాన పడకుండా-నీడ నిచ్చి అండవుతుంది
జీవనాధారమైన-ప్రాణవాయువిస్తుంది

“బ్రతుకు తెరువు నేర్పేటి –గురువేగా ప్రతి తరువు
బ్రతుకు పరమార్థం తెలిపే-నిఘంటువే హరిద్రువు”

4.   రాయబోతే చెట్టు చరితయే-రామాయణ మౌతుంది
విప్పి చెబితె వృక్ష నీతియే-కృష్ణ గీత అవుతుంది
కూడు గూడు నీరందించే-విశ్వ స్రష్ట యే కుజము
చావు పుటుకలన్నిటిలో-చెట్టు మనిషి నేస్తము

“బ్రతుకు తెరువు నేర్పేటి –గురువేగా ప్రతి తరువు
బ్రతుకు పరమార్థం తెలిపే-నిఘంటువే హరిద్రువు”









Monday, October 19, 2015

చేరినంతనే స్వామీ -నీ –చరణాల చెంత
మనసుకెంత నిశ్చింత - మనసుకెంత నిశ్చింత
అర్పించినంతనే-స్వామీ నీకు -నా భార మంతా
ఎంత హాయి బ్రతుకంతా - ఎంత హాయి బ్రతుకంతా
1. ఎడారి దారిలోనా – ఒయాసిస్సు వౌతావు
అమావాస్య నిశిలోనా-పున్నమి శశి వౌతావు
ఆశలు అడుగంటిన వేళా- అదృష్టము నీవౌతావు
వేడినంతనే స్వామీ వెన్నుదన్ను వౌతావు
2. తుఫానులో చిక్కిన నావను – తీరానికి చేరుస్తావు
దారితప్పి తిరుగుతుంటే- మార్గదర్శి వౌతావు
ఆశలు అడుగంటిన వేళా- అదృష్టము నీవౌతావు
వేడినంతనే స్వామీ వెన్నుదన్ను వౌతావు
3. బీడుపడిన నేలకు నీవే-వాన చినుకు వౌతావు
మోడైన మ్రానును సైతం –చివురులు వేయిస్తావు
ఆశలు అడుగంటిన వేళా- అదృష్టము నీవౌతావు
వేడినంతనే స్వామీ వెన్నుదన్ను వౌతావు
4. నిర్లక్ష్యపు జీవన గతిలో-నా లక్ష్యం నీవే స్వామీ
చిక్కుబడిన భవ బంధాలకు-మోక్షమింక నీవే స్వామీ
ఆశలు అడుగంటిన వేళా- అదృష్టము నీవౌతావు
వేడినంతనే స్వామీ వెన్నుదన్ను వౌతావు

Saturday, October 3, 2015

తీయనిదొక్కటే....అమ్మ అన్న పదము..
తీరని దొక్కటే..కన్న తల్లి ఋణము..
అమ్మ ప్రేమ కేది లేదు కొలమానము..
అమ్మ త్యాగ ఫలితమే..దేహము ప్రాణము
అమ్మంటేనే...అనురాగము
అమ్మకు మారు పేరు త్యాగము....

1.      1.) జబ్బు పడినప్పుడల్లా..అమ్మేగా..డాక్టరు..
కునుకైనా తీయకుండ సేవచేయు సిస్టరు..
చిట్కా వైద్యాలు..దిష్టి తీయడాలు..
మెడలో తాయెత్తుకట్టి..నుదుటన విభూతి పెట్టి
జాతకాలు చూపెట్టి..గ్రహ శాంతులు చేపించి
ముక్కోటి దేవుళ్ళకు ముడుపుకట్టు...ఆరాటము
నయమయ్యే వరకు..అనునయించు..వైనము..
అమ్మంటేనే...అనురాగము
అమ్మకు మారు పేరు త్యాగము....

2.   2)    ఏ తప్పు నువ్వు చేసిన..తనపైన వేసుకొనే లయ్యరు
గుడ్డిగా నీ తరఫున వకాల్తా పుచ్చుకొననే లాయరు
పోపుల పెట్టెలోన దాపెట్టిన డబ్బులిచ్చి
నీ తండ్రి దండనకు అడ్డునిల్చి తా భరించి
అరికాలు నొవ్వకుండ-ఈగ వాలనివ్వకుండ
కంటికి రెప్పలాగ కాచిన..మమకారము
నోముల పంటగా..చేసిన ..గారాబము
అమ్మంటేనే...అనురాగము
అమ్మకు మారు పేరు త్యాగము....











Tuesday, September 29, 2015

నువ్వలా.. నువ్వలా..నువ్వలా


గుండెలో ఉండిపో గువ్వలా
పెదవిపై ఒదిగిపో నవ్వులా
ఎన్నడూ..వాడనీ పువ్వులా..
ఘల్ఘల్లని మ్రోగే మువ్వలా
వెలుగులు పంచే దివ్వెలా
నువ్వలా.. నువ్వలా..నువ్వలా

1.   1.    అక్కున జేర్చుకున్న ఆనందంలా
అనుభూతులు విచ్చుకున్న ఆహ్లాదంలా
కార్తీక పౌర్ణమీ రేయిలా...కలయే నెరవేరిన హాయిలా
యమునా నదిలా..రాధిక హృది లా
వంశీ నాదంలా...నువ్వలా..నువ్వలా...నువ్వలా...

2.       2.జన్మలు వెంటాడుతున్న అనురాగం లా
 మనసులు పెనవేసుకున్న అనుబంధం లా
 ఎడారిలో ఒయాసిస్సులా---నిశీధి చీల్చే ఉషస్సులా
  బీడుకు వానలా...తేటికి తేనెలా
  మృతసంజీవనిలా .. నువ్వలా..నువ్వలా...నువ్వలా...