కళ్యాణం నేడేగా రమణీయం చూడగా
కమనీయం పాడగా వరదాయం వేడగా
శివ పార్వతుల దివ్య కళ్యాణం నేడేగా
మంగళకరమౌ లోక కళ్యాణం చూడగా
శివనామ గానమే కమనీయం పాడగా
శివరాత్రి పావన సమయం ఇహపర దాయం వేడగా-హరుని వేడగా
1.భవభయహరుడు నిజశుభకరుడు శంకరుడు మన వరుడు
హిమగిరినందిని మునిజన వందిని నిత్యానందిని మన వధువు
ముల్లోకాల సకల దేవతలు దనుజులు మనుజులు మురియగా
నాక లోకమే పారిజాతముల పుష్ప వర్షమును కురియగా
2.పరమ భక్తులు శివశక్తులు జీవన్ముక్తులు సాదర ఆహ్వానితులై
ప్రకృతి ప్రేమికులు భగవతి పార్వతి దీక్షా దక్షులు పెండ్లి పెద్దలై
ద్రవ్య శక్తి నిత్యత్వ సూత్రమే విశ్వ మనుగడకు మూలభూతమౌ
ఆది దంపతుల ఆశీర్వాదమె మానవాళి కిల ప్రగతి ఊతమౌ