Sunday, October 6, 2024

 


https://youtu.be/qyZsO5ztrxk?si=GgNW_WL_vplbDcmD

రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ

రాగం:మోహన

ఆడి పాడి అలసినారా ఓ లచ్చ గుమ్మడి
అమ్మ లాలా కొమ్మలాలా ఓ లచ్చ గుమ్మడి
తొమ్మిది నాళ్ళ ముచ్చటిది ఓ లచ్చ గుమ్మడి
బతుకమ్మను అనిపే రోజిది ఓ లచ్చ గుమ్మడి
సద్దుల బతుకమ్మనేడు ఓ లచ్చ గుమ్మడి
సుద్దులింకా పాడుకుందాం ఓ లచ్చ గుమ్మడి

మంగళగౌరి మాతల్లి ఓ లచ్చ గుమ్మడి
మంగళ కరమే నీరూపు  ఓలచ్చగుమ్మడి
మంగళ సూత్రం కావవే ఓ లచ్చ గుమ్మడి
మంగళహారతి గొనవమ్మా ఓ లచ్చ గుమ్మడి

మాట మార్చలేదమ్మా ఓ లచ్చ గుమ్మడి
పాటలాపలేదమ్మా ఓ లచ్చ గుమ్మడి
ఆటలాడి మురిసినాము ఓ లచ్చ గుమ్మడి
నిన్నే మదిలో నిలిపినాము ఓ లచ్చ గుమ్మడి

పచ్చని ఆకులైతే ఓ లచ్చ గుమ్మడి
పీఠంగా వేసినాము ఓ లచ్చ గుమ్మడి
గునుగుపూలు పరుపు చేసి ఓ లచ్చ గుమ్మడి
అమరించి నామమ్మా ఓ లచ్చ గుమ్మడి

కట్ల పూలు మెట్లు మెట్లుగా ఓ లచ్చ గుమ్మడి
పేర్చి కూర్చినామమ్మ ఓ లచ్చ గుమ్మడి
తంగేడుపూలు బంగరు చీరగ ఓ లచ్చ గుమ్మడి
నీకు సింగారించి నామమ్మా ఓ లచ్చ గుమ్మడి
బంతిపూల మాలలేశాం ఓ లచ్చ గుమ్మడి
చేమంతుల నగలు పెట్టాం ఓ లచ్చ గుమ్మడి

రంగు రంగులు పూలు కూర్చి ఓ లచ్చ గుమ్మడి
నిన్ను బతుకమ్మగ తీర్చి దిద్దాం ఓ లచ్చ గుమ్మడి
రాచగుమ్మడి కేసరాన్ని ఓ లచ్చ గుమ్మడి
గౌరిదేవిగ నిలిపాము ఓ లచ్చ గుమ్మడి
తొమ్మిది నాళ్ళు ఆడిపాడి ఓ లచ్చ గుమ్మడి
నమ్మి నిన్ను కొలిచాము ఓ లచ్చ గుమ్మడి

నూల సద్ది కొబ్బరి సద్ది ఓ లచ్చ గుమ్మడి
నిమ్మ సద్ది ఆవసద్ది ఓ లచ్చ గుమ్మడి
పులుసు సద్ది పెసారా సద్ది ఓ లచ్చ గుమ్మడి
మినప శనగ  పెరుగు సద్ది ఓ లచ్చ గుమ్మడి
సద్దులన్నీ సిద్ధం చేసాం ఓ లచ్చ గుమ్మడి
ఆరగించి ఆదరించు ఓ లచ్చ గుమ్మడి

సాగానంపు వేళాయే ఓ లచ్చ గుమ్మడి
సాగానంప వగపాయె ఓ లచ్చ గుమ్మడి
మరుసటేడు బిరగా రావే ఓ లచ్చ గుమ్మడి
మరిచిపోకు మమ్మెప్పుడు ఓ లచ్చ గుమ్మడి
దండాలు తల్లీ గౌరి ఓ లచ్చ గుమ్మడి
వందనాలు బతుకమ్మ ఓ లచ్చ గుమ్మడి