Tuesday, April 21, 2009

కనులు తెఱచి చూడర ఓ నేస్తం
మరిగి పోతోందిరా మన దేశం

సకల శోభితం- భరత దేశం
సస్యశ్యామల భాగ్యదేశం
పేరు మార్చుకొంటోందిరా
కొత్త రూపు దిద్దుకొంటోందిరా

కులము మతమనే మారణహోమం
మనిషి మనిషికీ తీరని దాహం
మనమంతా భారతీయులం
మనమధ్యన ఎందుకురా బలంబలం

అధిక ధరల పెనుతుఫానుకూ
మానభంగాల అగ్నిజ్వాలకు
తట్టుకోలేకపోతోందిరా
అట్టుడికిపోతోందిరా

రాజకీయ భూకంపానికీ
రక్తపాత సుడిగుండానికీ
నిలువలేక మూల్గుతోందిరా
చావు మునక లేస్తోందిరా
కదలిరా ఓ నేస్తమూ
కలిపిచూడు నీ హస్తమూ
ఘన విజయాలే మన సొంతమూ
ఇక చిరునవ్వే జీవితాంతమూ

పిరితనం నీ ప్రగతికి గొడ్డలి పెట్టు
గుండెబలం నీ కున్న ఆయువుపట్టు
తరాల అంతరాలు ఆవల నెట్టు
చేరిపో ఎన్నడింక చెదరదు జట్టు

మనదంతా ఒకేఒక వసుధైక కుటుంబం
మనమంతా అందులోన భాగస్తులము
భావాంతరాలే మన కలతల కారణం
మనసువిప్పి మసలుకొంటె సడలదులే సమైక్యము

OK
https://youtu.be/NNZIzPLsSfI

ఏమిటో ఈ యాతన
తీరనీ ఈ వేదన
గొంతు నులిమినట్లుగా-గుండె పిండినట్లుగా ||ఏమిటో||
1.)పయనం మొదలైనది ఒకే పడవలో
అందరమూ ఎక్కిందీ అదే నావలో
సాఫీగా సాగుతోందీ తోటివారి ప్రయాణమూ
తోయములో తోయబడితే నాదా ఆ నేరము
ఈతరాక ఆగానా-లోతుచూసి బెదిరానా ||ఏమిటో||
మెదడు చితికినట్లుగా-ఒళ్ళుకాలినట్లుగా

2.)పూలమ్మే చోటనే కట్టెలమ్ముతున్నాను
అధికారిగ ఉండేవాణ్ణి అనుచరుడిగ మారాను
సాటివారి ముందే సాగిల పడిపోతున్నా
మేధ సహకరించలేక నిర్వీర్య మౌతున్నా
నాకు అర్హతే లేదా- నాది అత్యాశేనా ||ఏమిటో||
నరాల్ తెగిన రీతిగా-శ్వాసాగిన తీరుగా

3.) అరచేతిలో నుండి ఇసుక జారిపోతోంది
కళ్ళముందెవిలువైన కాలంకరిగి పోతోంది
ఏ అద్భుతమో జరిగి యధాస్థితికి వచ్చేనా
ఏ దైవమొ కరుణించి నాకువరమునిచ్చేనా ||ఏమిటో||
కార్జం కెలికినట్లుగా-మజ్జ పెకిలినట్లుగా

OK
https://youtu.be/vQsMUEC96Rs

ఏ రాగమో ఎరుగని ఈ కీర్తన
అనురాగమై పొరలిన ఆలాపన
లయ ఏదై సాగేనో నా గానము
తన్మయముగ ఊగేనూ నా దేహము

ఛందస్సులెరుగని హృదయ స్పందన
సాహిత్య మెరుగని సగటు గుండె భావన
ఒక మేఘం వర్శిస్తే మయూరమై ఆడదా
వసంతం స్పర్శిస్తే- కోకిలయై పాడదా

ఏ రాగమో ఎరుగని ఈ కీర్తన
ఆవేదనై పొరలిన ఆలాపన
లయ ఏదై సాగేనో నా గీతము
నయనాలలో పొంగె జలపాతము

రగిలే ఎద జ్వాలల శివరంజని వెలుగదా
పొరలే కన్నీరే ఇల రేవతియై పారదా
ఏ దిక్కూ లేకుంటే తోడితోడై రాదా
ఓదార్పు లేని గుండె సింధుభైరవేకాదా


OK
ఎదిగిపో ఎదిగిపో పై పైకి ఎదిగిపో
మానవాళి కందరాని మహోన్నతిని అందుకో

అన్యాయాన్నరికట్టు- అవినీతిని అదిమి పెట్టు
మాటలేమి చెప్పక- చేతల చూపెట్టరా

స్వార్థాన్ని సాగనంపు-లంచగొండి రూపు మాపు
మహాశక్తి రూపంగా- విశ్వమంత వెలిగిపో

నడుంవంచి పనిచేస్తూ-నలుగురికి సాయపడు
పదిమందితొ కలిసిమెలిసి-ప్రగతి పథం చేరిపో

మహామహులు ఎందరో-జన్మించిరి పుడమి పైన
వారి మహా చరితలలో-నీ దొకటిగ నిలుపుకో
ఏడవకు ఏడవకు చిట్టి కన్నా
ఏడిస్తే నీకళ్ళ గోదారి వరదన్నా
లోకాన నీకేల చీకూ చీకాకు
శోకాల దారంట పోనేపోమాకు

ఆకలైతే నీకు అమ్మ పాలిస్తుంది
కేకలేయకు నీకు కమ్మని కథ చెబుతుంది
లాలిపాట లెన్నెన్నో హాయిగా పాడుతుంది
ఊయలూపి ముద్దాడి ఊరుకోబెడుతుంది

అమ్మ చంకనెక్కి నీవు చందమామ చూడాలి
నాన్న వీపు కీలుగుఱ్ఱం సవారి చేయాలి
అడగకముందే వుండు అందలమే నీముందు
అలిగిచూడు ఒక్కసారి అమృతమే నీ విందు

బూచిచూచి బెదిరావా భయపడకుర కన్నా
కష్టాల కడలి బ్రతుకు ధైర్యం విడకన్నా
చెరగని నీ నవ్వులే సిరి సంపదలే మాకు
ఈ నాన్న దీవెనలే శ్రీ రామ రక్ష నీకు

OK

ఉగ్రవాదం రగులుతున్నది
రక్తదాహం ప్రబలుతున్నది
రావణ కాష్ఠంలా- జాతికి గ్రహణంలా || ఉగ్రవాదం||

శత్రు వర్గము మన దేశంపై విరుగబడుతున్నది
దుర్మార్గము వికృతమై విర్రవీగుతున్నది
పెట్రేగిన ఒక బలం కత్తులు ఝళిపిస్తున్నది
శాంతి మరచి శ్వేతసుమం నెత్తురు కురిపిసున్నది

తినేఇంటి పునాదులను-కూల్చాలని చూస్తున్నది
కన్నతల్లి శీలాన్నే అమ్మాలని చూస్తున్నది
తీవ్రవాద కుష్ఠువ్యాధి కుళ్లికంపు కొడుతోంది
వెర్రివేయి తలలతో వికటాట్టం చేస్తోంది

మొన్న ప్రధాని ఇందిరా గాంధీని బలిగొంది
నిన్న నేత లోంగో వాలును చంపింది
ఆ గతమూ శాపమై కలచి వేస్తున్నది
ఈనిజమూ బేలయై విలపిస్తూ ఉన్నది

గులాబీల గుండెల్నీ చీల్చేదే మన ధర్మమా
కపోతాల గొంతుల్ని నులిమేదే మన శాస్త్రమా
యోచన యోచన మంచిచెడుల విచక్షణ
ఆలోచన లేనినాడు లేదు మన విమోచన
భరత జాతి రక్షణ
ఆడబోకు జూదము – ఆడి చెడిపోకు నేస్తమూ
సాలెగూడులాంటి క్రీడ- జీవితానికే చీడ-అది ఒక పీడ ||ఆడబోకు||
1.)పంచపాండవులైనా వంచించ బడ్డారు
పాంచాలిని సైతం జూదాన ఒడ్డారు
మానాభిమానాలు మంటగలిసి వారంతా
అడవుల పాలయ్యీ అవస్థలే పడ్డారు- వ్యవస్థలో చెడ్డారు ||ఆడబోకు||

2.) నలమహారాజు నాడు నవ్వులపాలైనాడు
ఒంటిమీద బట్టకైన కరువై పోయాడు
బలికాని వారేరీ ఇలలో జూదానికి
ఇదికాక ఇంకేదీ లేదా మోదానికి- ఆమోదానికీ ||ఆడబోకు||
3.)ఇల్లూ ఒళ్ళూ గుల్లగా-చేసేదే ఒక ఆటా?
కుటుంబాన్ని వీథిలోకి నెట్టేదే ఒక ఆటా?
ధనమూ సమయంవృధా-చేసేదే ఒక ఆటా?
పరువూ మరియాదా- పోగొట్టేదే ఒకాఆటా?-అకటా!ఎందుకీ కట కట?! ||ఆడబోకు||

4.)ఆరోగ్యం ప్రసాదిస్తె - అది ఒక ఆట
ధారుఢ్యం పెంపొందిస్తె-అది ఒక క్రీడ
మోసానికి మూలమే ఈ పేకాటా
చెప్పేసెయ్ ఇకనైనా దీనికి టాటా-విను నా మాటా ||ఆడబోకు||
ఆటుపోటుల సాగరం -ఈ లోటుపాటుల జీవితం
నాటునావలొ నీ ప్రయాణం-సాహసం నీ సాధనం ||ఆటు పోటుల||

ఆకలేస్తే-కేకలేస్తే-ఆరుతుందా తీరుతుందా
పదం పలుకుతు కదం కదిపితె-పంట చేలే పండిపోదా
శ్రమ జయిస్తే సహన మొస్తే-సకల జగతికి సౌఖ్యము
ప్రగతి తెస్తే ఫలితమొస్తే-బ్రతుకు బ్రతుకున స్వర్గము ||ఆటు పోటుల||

ఆశయాలే వల్లె వేస్తే- ఆచరించే దెన్నడు
ఉద్యమాలే్ లేవదీస్తే-ఊరడించే దెవ్వరు
పెంచిచూడు సంపదలనే- జగము సుందర నందనం
పంచిచూడు స్నేహితమునే-బంధు జనులమె అందరం ||ఆటు పోటుల||
ఆకలి కేకలెగసె మన దేశంలో-ఆవేదన ఆవరించె మన దేశంలో
హింస విధ్వంస కాండ-మింటికెగసె మనదేశంలో
శాంతి సమసమైక్యత-మంటగలిసె మన దేశంలో || ఆకలి కేకలెగసె||

బ్రతుకంతా భయం భయం
భవితలొ అంతా శూన్యం
కనరాదీ కడలేనీ -ఎడారిలో ఒయాసిస్సు
అనంతమగు నిశీధిలో-పొదసూపదు ఏ ఉషస్సు ||ఆకలి కేకలెగసె||

పొంచిఉన్న పొరుగువారు
వంచించే మన ఇంటివారు
అడకత్తెరలో పోకచెక్క –మన దేశం
చావలేక బ్రతుకలేక- సతమత మౌతున్న శవం ||ఆకలి కేకలెగసె||

జీవనదులు తెగపారే- సస్యశ్యామల దేశం
సంపదలతొ తులతూగే-సౌభాగ్య మైనదేశం
కులమతజాతిప్రాంత-భాషాభేదాలతో
జరుగుతోంది నేడు- మారణ హోమం
అవుతుందేనాడో ఇలాగే కొనసాగితే-మన దేశం స్మశానం

Sunday, April 12, 2009


రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ

మాతకు వందనం-గోమాతకు వందనం
భూమాతకు భరతమాతకు దేశమాతకు వందనం
నా దేశమాతకు వందనం-అభివందనం మాతకు

చ. రక్త మాంసాలు పంచి
నవమాసాలు మోసి
అరుదైన మానవజన్మ
అందించిన అమ్మకు వందనం

చ. తాను పచ్చి గడ్డి మేసి
కొన్నే తన దూడకిచ్చి
తనపాలు మన పాలుచేసి
జీవితమే అర్పించే గోమాతకు వందనం

చ. తన ఎదలో చోటునిచ్చి
బ్రతుకునకు భద్రతను ఇచ్చి
భారతీయులమైనందుకు
గర్వకారణమైన మాతకు వందనం
భరతమాతకు వందనం

నీతికి వందనం-జాతికి వందనం
జగతికే సంస్కృతి నేర్పే భరతజాతికి వందనం
మన భరత జాతికి వందనం-అభివందనం

వందే మాతరం వందే మాతరం వందే మాతరం
విద్యాలయమే దేవాలయం
మా మాష్టారే ఒక దైవం
వందనాల పూలతో గౌరవాల మాలతో
నిత్యంకొలిచే భక్తులం-మేము విద్యాసక్తులం విద్యాలయమే

అపుడే విరిసిన పువ్వులము
ఎపుడూ మెరిసే నవ్వులము
కోపాలు ఆవేశాలు అసలే ఎరుగని
చిరుదివ్వెలం-మేము సిరిమల్లెలం

గొప్పవారి జీవిత కథలే నిత్య పారాయణం
మాకు విజ్ఞాన శాస్త్రమే రామాయణం
చదువుతూనె మాపయనం-చదువేలే మాగమ్యం
ఏకాగ్రతగా సాధన చేసే యోగులం మేము విద్యార్థులం

Monday, April 6, 2009

https://youtu.be/Q2crfe9-eKc

శ్రీమాన్ కలకుంట సంపత్ కుమారాచార్యుల వారి స్మృత్యంజలి
-రాఖీ
అమరజీవీ!
వ్యాపించెను విశ్వమంత మీకీర్తి తావి
ఓ ఆర్యా!
కలకుంట సంపత్ కుమారాచార్యా!!
జయహో జయహో జోహారులందుకో
మనసావాచా మానివాళులందుకో అమరజీవీ!


1.) మంచితనం చిరునామా మీరేనయ్యా
మానవతకు ప్రతిరూపం మీరేనయ్యా
మీ పెదవుల చిరునవ్వుల స్థిరనివాసము
మీ పలుకులు తేనియల ఘనతటాకము ఓఆర్యా

2.) అధ్యాపక వృత్తికే ఆదర్శం మీరు
విద్యార్థులెన్నటికీ మిమ్ము మరచిపోరు
పద్యాలు బహుకమ్మగ మీ నోట జాలువారు
హృద్యములే కదా మీ నటనల తీరు ఓఆర్యా

3.) మీరు పాడెటి రాగాలు అనురాగ పూరితాలు
శారదాంబ వరము మీకు సాహితి సంగీతాలు
ఆదరాభిమానాలే మీకు ఆభరణాలు
అతిథి మర్యాదలే మీఇంటికి తోరణాలు ఓఆర్యా

4.) ఆధ్యాత్మిక చింతనలో తరియించినారు
పెరుమాళ్ళ సేవలోనె కడతేరినారు
పరమ పదము ఎప్పుడో అందుకొన్నారు
మాస్మృతిపథములో చిరంజీవి వైనారు ఓఆర్యా

OK

Sunday, April 5, 2009

https://youtu.be/yLGEsgVqs2Y

చిరునవ్వుల ముసుగులు - ఎదలోతుల లొసుగులు
ఎవరికొరకు ఈ వింత నాటకాలు - మనుషులంతా ఎందుకు దొంగాటకాలు ||

1.) మొహమాటం మూయునెపుడు -హృదయ కవాటం
బిడియమెపుడు తెరవనీదు-మనసు గవాక్షం
కక్కలేని మ్రింగలేని-తీరే దయనీయం
పారదర్శకత్వమే-సదా హర్షణీయం || చిరునవ్వుల ముసుగులు ||

2.) డాంభీకం డాబుసరితొ – ఉన్నతులని కొలువబడం
భేషజాల ప్రకటనతో – భేషని కొనియాడబడం
పులిఎదురయ్యే వరకె – మేకపోతు గాంభీర్యం
దివాలయ్యి దిగాలయే- దుస్థితే అనివార్యం || చిరునవ్వుల ముసుగులు ||

3.) ఆత్మను వంచించుకుంటె-అవుతుందా అది లౌక్యం
కప్పదాటు మాటలేపుడు-కానేరవు నమ్మశక్యం
జీవితాన అవసరమా-ఇంతటి సంక్లిష్టం
నిన్ను నిన్నుగ చూపేదే-నిజమైన వ్యక్తిత్వం || చిరునవ్వుల ముసుగులు ||

“జన్మదినం కావాలి”

-రాఖీ
జన్మదినం కావాలి జగతికే సంబరం
జనుల జేజేధ్వనులే తాకాలీ అంబరం
తరాలెన్ని మారినా తరగనీకు నీ కీర్తి
కావాలి మహిలోన నీవే ఆదర్శమూర్తి
అందుకో ఆనంద అభినందనం
అందుకో అభిమానయుత చందనం
హ్యాప్పీబర్త్ డే టూయూ- హ్యాప్పీబర్త్ డే టూయూ. || జన్మదినం||

1.)పుట్టుకతో ఎవ్వరూ కాలేరు గొప్పవారు
బాల్యంలో అందరూ పెరిగేదీ ఒకేతీరు
క్రమశిక్షణ బ్రతుకైతే నీ భవితే పూలతేరు
లక్ష్యమొకటి తోడైతే నడకే నల్లేరు
అందుకో ఆనంద అభినందనం
అందుకో అభిమానయుత చందనం
హ్యాప్పీబర్త్ డే టూయూ- హ్యాప్పీబర్త్ డే టూయూ . . || జన్మదినం||

2.)గతమంతా ఒకసారి నెమరువేసుకోవాలి
భవిష్యత్తు ప్రణాళికలు సరిచూసు కోవాలి
పట్టుదలా కృషీ నీకు నేస్తాలు కావాలి
అంచెలంచెలుగా నీవే గమ్యాన్ని చేరాలి
అందుకో ఆనంద అభినందనం
అందుకో అభిమానయుత చందనం
హ్యాప్పీబర్త్ డే టూయూ- హ్యాప్పీబర్త్ డే టూయూ . || జన్మదినం||


3.)దయ క్షమ నీకెపుడూ దగ్గరే ఉండాలి
ఇవ్వడానికెప్పుడూ నీవే ముందుండాలి
ఫలితమన్నది ఎప్పుడూ విజయమే కాబోదు
పథమంతా ప్రతిక్షణం ఆనందం చవిచూడు
అందుకో ఆనంద అభినందనం
అందుకో అభిమానయుత చందనం
హ్యాప్పీబర్త్ డే టూయూ- హ్యాప్పీబర్త్ డే టూయూ . || జన్మదినం||

పూలేల పూజకు నా కన్నులె కలువలు
పూలేల పూజకు నా నవ్వులె మల్లెలు
నీపదముల నిలిపేందుకు నా హృదయమె మందారం
నీ మెడలో వెలిగేందుకు నా మనసే సుమ హారం || పూలేల పూజకు||

అందమైన నాసికయే అదిఒక సంపెంగ
చక్కనైన చెక్కిళ్ళే రోజాల తీరుగ
మెరిసేటి దంతాలే ముత్యాల పేరుగ
అర్చింపగ వేరేల అవయవాలె చాలుగ || పూలేల పూజకు||


నా కరములె నిను కొలిచే కమలాలే అవగా
అవకరములు లేని తలపు మొగిలి రేకు కాగా
నా కంఠమె జేగంటై నీకు హారతీయగా
అర్పిస్తా నా బ్రతుకే నీకై నైవేద్యంగా || పూలేల పూజకు||

OK
https://youtu.be/zymWUa1tc24?si=392zfM8ZTd6ZIkfP

“రాఖీ గీతమాలిక”
సరిగమాపదమనీ పదముల
కొలిచితి పరిపరి విధముల
వేచితి నీకై యుగముల
వదలను నీ పద యుగముల
బాసరమాతా భారతి
చూపవె నాకిక సద్గతి సరిగమాపదమనీ
1.)ఎందరు నిను కీర్తించినా
ఏమని నిను వర్ణించినా
ఎంతైనా అది తక్కువే
ఎప్పటికీ నువు మక్కువే
స్వరముల నేతా శారదా
వరమొందక మది వేసారదా సరిగమాపదమనీ
2.)చిత్రాలెన్నో గీసినా
కవితలనెన్నో రాసినా
పాటకు ప్రాణం పోసినా
అద్భుత నృత్యం చేసినా
దయసేయవె నా వాణీ
దయసేయగ వీణాపాణీ సరిగమాపదమనీ
3.)విద్యలనెన్నో నేర్చినా
వైద్యము సరి చేకూర్చినా
పరిశోధనలే చేసినా
పరమార్థము సాధించినా
నీ కృప జ్ఞాన సరస్వతి
నీ రూపే మేధా సంపతి సరిగమాపదమనీ

Monday, October 27, 2008

https://youtu.be/MlDkiy8gN1w?si=ztqAtHJLZfjoCM-q


మా ఊరు ధర్మపురి – మా దైవం నరహరి
గలగల పారే గోదావరి మాకు సిరి
జగతిలోన లేనెలేదు దీనికేదీ సరి
కళలకు కాణాచి వేదాలకు పుట్టిల్లు
విద్వత్ విద్వత్ శిఖామణులకాలవాలమైనది

సత్యవతి పతి శాపం తొలగింది ఈచోటనె
పాతివ్రత్య మహిమచేత ఇసుకస్తంభమైంది ఇటనె
కుజదోషం తొలగించే నిజమైన స్థలమిదే
కోరుకున్న భక్తులకిల కొంగుబంగారమిదే


శతకాలు పలికిన శేషప్ప వాసమిదె
పౌరాణిక బ్రహ్మ గుండిరాజన్నస్థలమిదే
సంగీత సరస్వతి చాచంవారి ఊరుయిదే
కీర్తిగొన్నఘనపాఠీలెందరికోపుట్టిల్లిదె


బ్రహ్మకూ,యమరాజుకు విగ్రహాలు గల విక్కడ
డోలోత్సవాలు జరిగె ఘనకోనేరుందిక్కడ
ఉగ్రయోగ రూపాలతొ వెలిసాడిట నరసింహుడు
సరితోడుగ నిలిచాడు శ్రీరామలింగేశుడు

నటులు ,నాయకులు ,జ్యోతిష్య పండితులు
కవులు ,గాయకులు, ఘన శాస్త్రవేత్తలు
ఐదునూర్ల బ్రాహ్మణ్యం అలరారె మాఊరున
ప్రతి రోజు ఉత్సవమే నిత్యకళ్యాణమే
ఇక్కడ జన్మించడం పూర్వ జన్మ పుణ్యమే –
మా పూర్వ జన్మ పుణ్యమే!

Friday, October 24, 2008